రాష్ట్రీయం

రాజకీయ రచ్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 15: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిల మధ్య ఇటీవల జరిగిన భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. మోదీని కలిసిన సందర్భంలో జగన్ ఇచ్చారని భావిస్తున్న వినతిపత్రం ఒక పత్రిక-చానెల్‌కు లీకు కావడం పెను దుమారానికి దారి తీసింది. రాష్ట్ర సమస్యల పరిష్కారం పేరుతో మోదీని ఈనెల 10న ప్రధానిని కలిసిన జగన్.. ఆయన కాళ్లు పట్టుకుని తనను వేధిస్తున్న ఈడీ అధికారులపై ఫిర్యాదు చేశారే తప్ప, రాష్ట్ర సమస్యలపై మాట్లాడలేదని సదరు మీడియాలో ప్రత్యక్షమైన లేఖ ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల మధ్య చిచ్చు పెట్టింది.
తమ నేత జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక పత్రిక రాసిన కథనం తప్పుడు సమాచారంతో కొనసాగిందని, అసలు జగన్ ప్రధానికి ఫిబ్రవరి 17న ఆ లేఖ రాశారని, దానిని కేంద్ర హోంశాఖకు పంపిస్తే, మార్చి 28న లేఖ అందిందని, వారు ఏప్రిల్ 13న సంబంధిత అధికారులకు కాపీలు పంపించారని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. తమ వాదనకు మద్దతుగా ఆయన మోదీకి నాటి లేఖను కూడా ఆయన విడుదల చేశారు. ఫిబ్రవరి 17వ తేదీ నాటి లేఖను సంపాదించి, దానికి మోదీతో జగన్‌ల తాజా భేటీకి ముడిపెట్టిన ఆ పత్రిక-చానెల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవటంతో పాటు ఆ పత్రిక-చానల్‌ను తమ పార్టీ కార్యక్రమాల నుంచి బహిష్కరిస్తున్నామనేంత వరకూ వెళ్లింది. నిజానికి తాము ప్రధానికి మిర్చిరైతు, అగ్రిగోల్డ్ బాధితులు, ప్రభుత్వ అవినీతితోపాటు ప్రత్యేక హోదా అంశంపై వినతి పత్రం ఇచ్చామని భూమన వివరించారు.
తాజా పరిణామాలతో అటు బిజెపి కూడా అప్రమత్తమయింది. గత కొంతకాలం నుంచీ తమ పార్టీని, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధిస్తోన్న ఆ పత్రికలో వచ్చిన లీకు లేఖపై, రాష్ట్ర బిజెపి నేతలు కొందరు ఉదయమే పార్టీ కార్యాలయానికి, పీఎంఓకు ఆ వార్తాకథనాన్ని తర్జుమా చేసి పంపించారు. అయితే అది పీఎంఓ నుంచి లీకు అయి ఉండదని, హోంమంత్రిత్వ శాఖ నుంచి చెన్నై ఈడీ కార్యాలయం వరకూ జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల నేపథ్యంలో, ఏదో ఒకచోట లీకు కావచ్చన్న సమాచారం వచ్చిందని బిజెపి నేత వెల్లడించారు. అయినా లేఖ లీకు అయినందున దీనిని నాయకత్వం చిన్న విషయంగా తీసుకోదని స్పష్టం చేశారు.
అటు సోమవారం రాత్రి బెజవాడలో మీడియాతో మాట్లాడిన జగన్ కూడా ‘ఏ ఈడీ అధికారి నుంచి ఆ లేఖ వచ్చిందో ఆ పత్రికనే అడగండి. బాబు బిజెపిలో తన వాళ్లను మంత్రులుగా పెడతాడు. తనకున్న మంత్రిని కేంద్రంలో కూర్చోబెట్టుకుని ఆయనతోను, బాబుకు సపోర్టు చేస్తున్న మంత్రులను ఉపయోగించుకుని మళ్లీ ఇప్పుడు నాపై కుట్ర చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌తోనూ ఇదే కుట్ర చేయించాడు’ అని వ్యాఖ్యానించడం బట్టి, ఈ లీకు వ్యవహారమంతా కేంద్ర మంత్రుల ప్రమేయంతో జరిగిందని చెప్పకనే చెప్పినట్టయింది.
అయితే, అటు బిజెపి గానీ, ఇటు వైసీపీ గానీ పీఎంఓ నుంచి లీక్ అయిందని చెప్పకుండా దర్యాప్తు అధికారుల స్థాయిలోనే ఆ లేఖ లీకయిందని చెబుతుండటం గమనార్హం. జగన్ చెప్పినట్లు దర్యాప్తు అధికారి ఆ లేఖను లీకు చేశారనుకున్నా, ఎవరిపైనయితే ఫిర్యాదుచేశారో అదే అధికారికి ప్రభుత్వం లేఖను జతచేసి, వివరణ కోరదన్న కనీస విషయాన్ని గుర్తించకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా మోదీని ఎక్కడా వ్యక్తిగతంగా విమర్శించవద్దని, కేవలం జగన్ లక్ష్యంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. బిజెపితో సంబంధాలు తెగేదాకా లాగితే నష్టపోయేది తానేనన్న ముందుచూపుతో, ఆ పార్టీ నాయకత్వం దిద్దుబాటకు దిగినట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి రాష్ట్ర స్థాయిలో ఒకరిపై మరొకరు బురద చల్లుకుంటున్న టిడిపి-వైసీపీ.. ప్రధాని, ఆయన కార్యాలయం విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
జగన్ మాత్రం తన ఆరోపణలన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ముగ్గురు కేంద్ర మంత్రుల మీదనే ఎక్కుపెట్టినట్లు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ బృందం చాలాకాలం నుంచీ ఢిల్లీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో.. టిడిపికి ఏయే మంత్రులు సహకరిస్తున్నారు? ఏ అధికారులు సమాచారం అందిస్తున్నారన్న విషయంపై ఒక స్పష్టత ఉందని జగన్ తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అదే విషయాన్ని ప్రధాని మోదీకి లేఖలో ఫిర్యాదు రూపంలో స్పష్టం చేసినట్లు మీడియాలో వెలుగు చూసిన లేఖ, ఆయన తాజా విమర్శలు చెప్పకనే చెబుతున్నాయి.