ఆంధ్రప్రదేశ్‌

సమరోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిజెపికి ఘన విజయాన్ని సాధించిపెట్టిన ఆ పార్టీ వ్యూహకర్త, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారిగా గురువారం విజయవాడ నగరానికి వస్తున్న సందర్భంగా కమలదళంలో సమరోత్సాహం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిని బలోపేతం చేయటంతోపాటు రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తపర్చే ప్రక్రియలో భాగంగా తొలిసారిగా పోలింగ్ బూత్‌ల స్థాయిలో కమిటీల ఏర్పాటు జరిగింది. రాష్ట్రంలో 40వేలకు పైగా పోలింగ్ బూత్‌లుంటే ఇప్పటికే 30వేల బూత్‌లకు కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ కమిటీ సభ్యుల ద్వారా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కనీసం 250 కుటుంబాలకు కేంద్ర పథకాలను వివరించాలన్నదే అమిత్‌షా ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగానే పోలింగ్ బూత్‌ల కమిటీ సభ్యులతో వేదిక నుంచి అమిత్ షా నేరుగా సంభాషించనున్నారు. స్థానిక సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో జరుగబోయే మహా సమ్మేళనానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
గన్నవరం విమానాశ్రయం నుంచి బెంజి సర్కిల్ వరకు జాతీయ రహదారిపై ప్రధాని నరేంద్రదమోదీ, అమిత్ షా, ఇతర నేతల ముఖ చిత్రాలతో కూడిన భారీ ఫ్లెక్సీలు వెలిసాయి. అడుగడుగునా పార్టీ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, అధికార ప్రతినిధులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో బిజెపి ఏపీ సమన్వయకర్త పురిఘళ్ల రఘురాం, రాష్ట్ర, జిల్లా నాయకత్వాలను సమన్వయపరుస్తున్నారు. స్థానికంగా జరుగుతున్న ఏర్పాట్లపై నాయకత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక అందిస్తున్నారు. సభా ప్రాంగణంలో జిల్లాలవారీగా సిటింగ్ సదుపాయం కల్పించారు. ఉభయ గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని నలుమూలల నుంచి భారీ బైక్ ర్యాలీలతో కార్యకర్తలు సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు జరిగాయి. ఈ సభలో అమిత్‌షాతో పాటు కేంద్ర మంత్రులు ఎం వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, ఇతర సీనియర్ నేతలు పాల్గొననున్నారు.
సభలో అమిత్ షా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను విశదీకరించి వాటి ద్వారా అతి సామాన్యులు సైతం లబ్ధిపొందుతున్న వైనాన్ని ఏవిధంగా ప్రచారం చేయాల్సింది దశ దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా అటల్ పెన్షన్ యోజన పథకం, వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే పథకం ఇది. అసంఘటిత రంగంలోని 87శాతం కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నారు. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల వెయ్యినుంచి ఐదు వేల వరకు పెన్షన్ అందుకోవచ్చు. అయితే వయస్సును బట్టి ప్రీమియం ఉంటుంది. సభ్యుని కంట్రిబ్యూషన్‌లో 50 శాతం ప్రభుత్వం భరిస్తుంది. రెండోది ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన.. ప్రమాద బీమాతో భరోసా ఇచ్చే పథకం. ఏడాదికి కేవలం 12 రూపాయల ప్రీమియంతో రెండు లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుంది. మూడోది ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన.. 18 నుంచి 50 ఏళ్ల లోపు వారి కోసం ఉద్దేశించిన ఈ పథకం కింద ఏడాదికి రూ.330 ప్రీమియం చెల్లిస్తే 2 లక్షల జీవిత బీమా సదుపాయం ఉంటుంది. నాలుగోది ప్రధాన మంత్రి ముద్ర యోజన.. చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. ఇంకా జన్‌ధన్ యోజన.. జీరో బ్యాలెన్స్ ఖాతాతోపాటు రూపే డెబిట్ కార్డు. లక్ష రూపాయల ప్రమాద బీమా, రూ.30 వేల వరకు జీవిత బీమా ఉంటుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన.. 2022 నాటికి ప్రతి కుటుంబానికి సొంతిల్లు కల్పించే పథకం. సుకన్య సమృద్ధి యోజన.. 10 ఏళ్ల లోపు ఆడపిల్లలున్న తల్లిదండ్రుల పేరిట గరిష్టంగా లక్షన్నర డిపాజిట్ చేస్తారు. 18 ఏళ్ల తర్వాత విద్యకోసం సగం డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన.. ప్రతి కుటుంబానికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్, ఇలాంటి పథకాలన్నింటిపై అమిత్‌షా వివరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతోనే రాష్ట్రంలో చంద్రన్న పేరిట వివిధ పథకాలపై విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అమిత్‌షా సభకు విశేష ప్రాధాన్యత చోటు చేసుకోబోతున్నదనటంలో ఎలాంటి సందేహం లేదు.

చిత్రం... మహా సమ్మేళనం సభకు ముస్తాబయిన వేదిక.. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి కామినేని శ్రీనివాస్