రాష్ట్రీయం

సెలవు పెడితే శాశ్వతంగా ఇంటికే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 9:ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు ఉన్నత చదువులు, ఇతరత్రా కారణాలతో సెలవు పెట్టి ఆసుపత్రులు మూతపడే పరిస్థితులు తీసుకొస్తున్నారని, ఇలాంటి వైద్యులను శాశ్వతంగా ఇంటికి పంపి వారి స్థానంలో కొత్త వైద్యులను నియామకం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తి చేసి సీమ జిల్లాలకు నీరు అందిస్తామన్నారు. మహిళలు, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. కడప నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, బెంగుళూరు నగరాలకు విమానాలు నడుపుతామని స్పష్టం చేశారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా శనివారం సిఎం చంద్రబాబు కడప నగర సమీపంలోని ఆలంఖాన్‌పల్లెలో నిర్వహించిన గ్రామసభ, బహిరంగ సభలో ప్రసంగించారు. అలాగే రూ. 12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హజ్‌హౌస్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిఎం ప్రసంగిస్తూ జన్మభూమి కార్యక్రమంతో నా జన్మసార్థకమైందన్నారు. మైనార్టీల రుణం తీర్చుకోవడానికి ఈ బడ్జెట్‌లో రూ. 380 కోట్లు కేటాయించామని, దుల్హన్ పథకం కింద రూ. 16 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. కడప నగరంలో గత ఏడాది జూన్‌లోనే విమానాశ్రయం ప్రారంభమైనా ప్రయాణికుల రద్దీలేని కారణంగా విమానాల రాకపోకలు నిలిపివేశారన్నారు. ప్రస్తుతం వాణిజ్యపద్ధతిలో విమానాలు నడపటానికి చర్యలు తీసుకున్నామని ఇక కడప విమానాశ్రయం నుంచి జిల్లా ప్రజలకు విమానయోగం కలుగుతుందని తెలిపారు. పేదల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్ని సౌకర్యాలతో ఆసుపత్రులు నెలకొల్పుతుందన్నారు. అయితే పలువురు ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీసు మోజుతో సెలవుపై వెళ్లి సొంత నర్సింగ్ హోమ్‌లు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజలు తమకు నచ్చిన వైద్యుడి చేత ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటే వారికి కావాల్సిన ఆర్థిక సహాయం ప్రభుత్వమే భరిస్తుందని, ఉచితంగా మందులు కూడా ప్రభుత్వమే ఇస్తుందని స్పష్టం చేశారు. ఎన్‌టిఆర్ ఆరోగ్య సేవా పథకం ద్వారా రూ. 2.5 లక్షల వరకూ ప్రభుత్వం ఉచితంగానే వైద్య ఖర్చులు భరిస్తుందన్నారు. ఎన్‌టిఆర్ ఆరోగ్య సేవా పథకం కింద ప్రస్తుతం కొన్ని వ్యాధులకు మాత్రమే చికిత్స అందుబాటులో ఉందని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని రకాల వ్యాధులకు ఈ పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోత విపరీతంగా ఉండేదని తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యుత్ కొరత పూర్తిగా తీసివేసి ముందుచూపుతో మిగులు విద్యుత్‌ను నిల్వ చేసి ఇళ్లకు 24 గంటలు, వ్యవసాయానికి 7 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాయలసీమ ప్రాంతానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గోదావరి డెల్టా నీటిని ఏడాదిలోపే తెప్పిస్తానన్నారు. పోలవరం ప్రాజెక్టులో 7 మండలాలు తెలంగాణలో ఉండగా ఆ మండలాల వల్ల ఆ ప్రభుత్వం తమకు పోలవరం ప్రాజెక్టు సాగునీరు, తాగునీటికి సాంకేతిక సమస్యలు తెచ్చిపెడతాయన్న ఉద్దేశ్యంతో కేంద్రంతో సంప్రదింపులు చేసి ప్రధానిని ఒప్పించి ఆ 7 మండలాలను పోలవరం పరిధిలోకి తీసుకురావడం వల్ల పోలవరం నుంచి 30 టిఎంసిల నీటిని సీమ జిల్లాలకు తెప్పిస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులతో పాటు అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. అలాగే ఏడాదిలోపు తెలుగుగంగ, హంద్రీ-నీవా సుజల-స్రవంతి, గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తిచేసి సీమ జిల్లాల వ్యాప్తంగా కరవును పారదోలేందుకు కంకణం కట్టుకున్నానని అన్నారు. భూగర్భజలాలు అభివృద్ధి చేసేందుకు నీరు-చెట్టు కార్యక్రమం ప్రవేశపెట్టామన్నారు.

ఆలంఖాన్‌పల్లె జన్మభూమి సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

విష్ణును విస్మరిస్తున్నారంటూ
రఘువీరాను నిలదీసిన కేడర్
కాంగ్రెస్ నుంచి వైదొలుగుతామంటూ బెదిరింపులు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 9: కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వున్నప్పటికీ పార్టీ ఉనికి కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణును ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నప్పటికీ అగ్రనేతలు విస్మరిస్తున్నారంటూ విష్ణు వర్గీయులు వీరంగం సృష్టించారు. జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనే నిమిత్తం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, పార్లమెంటు సభ్యులు కెవిపి రామచంద్రరావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ బిడుగు రుద్రరాజు, తదితరులు శనివారం మధ్యాహ్నం ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్నారు. వారి కోసం ఉదయం నుంచి వేచివున్న విష్ణు వర్గీయులు వారిని చూసిన వెంటనే కోపోద్రిక్తులై వీరంగం సృష్టించారు. టిడిపి ఉద్దేశపూర్వకంగా కల్తీ మద్యంతో ఏ మాత్రం ప్రమేయం లేనప్పటికీ మల్లాది విష్ణును అరెస్టు చేసి జైలుకు పంపి రెండురోజులు అవుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతలెవరూ పట్టించుకోపోవటంలో ఆంతర్యం ఏమిటంటూ నిలదీసారు. కాంగ్రెస్ నేతలు ఎంతో ఓర్పుతో వారిని అనునయిస్తూ విష్ణుకు వెన్నుదన్నుగా నిలుస్తామంటూ వారిని శాంతింపచేసారు. కల్తీ మద్యంతో ఎలాంటి ప్రమేయం లేని మల్లాది విష్ణును అరెస్టు చేయటం చూస్తే నగర పోలీసులు అధికారపక్ష తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనేది అర్ధమవుతుందని రఘువీరారెడ్డి, రామచంద్రయ్య, కెవిపి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో శాశ్వతంగా వుండదనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. కల్తీ మద్యం శాంపిల్స్‌ను పరీక్షించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ల్యాబ్‌ల నివేదికను నేటివరకు బహిర్గతం చేయకపోవటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాగా సమావేశం అనంతరం కాంగ్రెస్ అగ్రనాయకులు ముందుగా లబ్బీపేటలోని విష్ణు నివాస గృహానికి వెళ్లి మద్యం దుకాణాలకు లైసెన్స్‌దారు, ఆయన తల్లి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. చట్టాన్ని గౌరవిస్తామంటూ అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధింపు చర్యలకు పాల్పడుతుందని తాము భావిస్తున్నామన్నారు. అవసరమైతే న్యాయపోరాటం సాగిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులందరూ గాంధీనగర్‌లోని సబ్‌జైలుకు వెళ్లి విష్ణును పరామర్శించారు. నేతలు ఆయనతో ఏకాంతంగా మాట్లాడారు.

ఉన్నత విద్యలో నాణ్యతను పెంచాలి
కర్నూలు అర్బన్, జనవరి 9:ఉన్నత విద్యారంగంలో రోజురోజుకూ నాణ్యత లోపిస్తోందని దాన్ని పెంచేందుకు యూనివర్శిటీలు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ప్రఖ్యాత రసాయన శాస్తవ్రేత్త ఆచార్య గోవర్ధన్‌మెహతా పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలో శుక్రవారం నిర్వహించిన రాయలసీమ యూనివర్శిటీ తొలి స్నాతకోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పరిశోధన, పిజి, డిగ్రీలో పట్ట్భద్రులైన విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా దేశాభివృద్ధికి నడుం బిగించాలన్నారు. ఉన్నతాశయం, లక్ష్యంతో ఆ దిశగా ఎదిగేందుకు చర్యలకు ఉపక్రమించాలని సూచించారు. యువతలో ఐక్యత, పోటీతత్వం, తమకు ఉన్న పరిచయాలను అనుసంధానం చేసే జ్ఞానం వుంటే ప్రపంచాన్ని జయించి దేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగలరని తెలిపారు. అనంతరం ఆచార్య మెహతాకు రాయలసీమ యూనివర్శిటీ సైన్స్‌లో గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. అనంతరం ఆచార్య మెహతా, వైస్ ఛాన్సిలర్ నరసింహులు 20 సబ్జెక్టుల్లో ర్యాంకర్లకు, ఏడుగురు పిహెచ్‌డి పట్ట్భద్రులకు బంగారు పతకంతో పాటు స్నాతక్సోవ పత్రాలు అందజేశారు.
మేడారం జాతరకు 3,600 బస్సులు
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జనవరి 9: ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతరకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 3,600 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండి జివి రమణారావు వెల్లడించారు. శనివారం ఖమ్మంలో నూతన బస్టాండ్ ఏర్పాటు కోసం ఎనె్నస్పీ స్థలాన్ని పరిశీలించిన అనంతరం తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ జాతరకు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. గతంలో సమైక్య రాష్ట్రంలో ఏపి నుండి 1800 బస్సులను తీసుకొచ్చి మేడారం జాతరకు తిప్పేవారమని, ఇప్పుడు 3,600 బస్సులను తెలంగాణ జిల్లాల్లోని డిపోల నుంచే తిప్పాల్సి ఉంటుందన్నారు. ఖమ్మంలో ప్రస్తుతం ఉన్న బస్టాండ్ వచ్చిపోయే బస్సులకు, ప్రయాణికుల రద్దీకి సరిపోవడం లేదని, దీంతో నిర్మాణం తలపెట్టిన కొత్త బస్టాండ్‌ను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామన్నారు. ఇందుకు రెవెన్యూ శాఖ స్థలాన్ని కూడా చూపించిందన్నారు. ఆర్టీసీ నష్టాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఎండి రమణారావు వివరించారు.
కాలువలోకి ఆటో..ఇద్దరు గల్లంతు
డి.గన్నవరం, జనవరి 9: తూర్పు గోదావరి జిల్లా డి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం వద్ద శనివారం ప్రయాణీకుల ఆటో అదుపుతప్పి ప్రధాన పంటకాలువలోనికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. 8మంది గాయపడ్డారు. పి.గన్నవరం నుండి రావులపాలెం వైపు ప్రయాణీకులతో వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన కాలువలోకి దిగి తొమ్మిది మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఐదో తరగతి విద్యార్థిని పుచ్చకాయల మేరీగ్రేస్, మరో మహిళ గల్లంతయ్యారు. గాయపడిన వారిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, అమలాపురం ఆర్డీవో గణేష్‌కుమార్ సందర్శించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.
వైద్య పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 9: రాష్ట్రంలో ప్రాథమిక వైద్యశాలలు, కమ్యూనిటీ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో త్వరలో 500 మంది వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. కడప జిల్లా పర్యటలో భాగంగా శనివారం ఆయన వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలను తనిఖీ చేశారు. అందులో భాగంగా పలుచోట్ల విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన తన పర్యటనలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయడంతో పాటు గ్రామాల్లో ప్రజలకు వైద్యసేవలు ఏ విధంగా అందుతున్నాయోనని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పలు వైద్యశాలల్లో వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా, మరికొన్ని చోట్ల వైద్యులు, సిబ్బంది ఉన్నా వారు సకాలంలో విధులకు హాజరుకాకపోవడం వల్ల రోగులు ఇక్కట్లకు గురవుతున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తామన్నారు.

కమ్యూనిస్టు, వైకాపా
నేతల గృహ నిర్బంధం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 9: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కడప జిల్లా పర్యటన నేపథ్యంలో ఆందోళనకు సిద్ధపడ్డ ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కడప జిల్లా పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శనివారం తెల్లవారుజామునే హౌస్ అరెస్టు చేశారు. వైకాపాకు చెందిన కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సిపిఎం, సిపిఐ జిల్లా నాయకులు, రాయలసీమ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కడప మేయర్ కె.సురేష్‌బాబు ఇంటి నుంచి తప్పించుకుని తన ఫాం హౌస్‌కు చేరుకున్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకుని కడప నగరం నుంచి విమానాశ్రయం వైపు జాతీయ రహదారిపై ఉన్న వైఎస్ సర్కిల్ వరకూ 7 కిలోమీటర్ల మేర భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. బాబు తన ప్రసంగంలో జగన్మోహన్‌రెడ్డి, ఆయన అనుయాయులపై పరోక్షంగా ధ్వజమెత్తారు. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ సంఘటనలు గుర్తు చేసి అసెంబ్లీలో తనకే భద్రత లేదంటే ప్రజలకు ఏమాత్రం భద్రత ఉంటుందోనని ఆవేదన వెలిబుచ్చారు. కడప నగరం నుంచి విమానాశ్రయం వరకూ జాతీయ రహదారిలోని వైఎస్ సర్కిల్ వరకూ 7 కిలోమీటర్ల మేర బంధోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రజలకు చిరుధాన్యాల
ప్రాముఖ్యతను చెప్పాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు
ఒంగోలు, జనవరి 9: అత్యధిక పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం స్థానిక బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో ఫుడ్ -360 ఫౌండేషన్, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సేంద్రీయ వ్యవసాయం - చిరుధాన్యాల ఆవశ్యకత మార్కెటింగ్ అవకాశాలపై జరిగిన రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యవంతమైన జీవితానికి చిరుధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అత్యంత సహజంగా, అధిక పోషకాలను అందించే చిరుధాన్యాల సాగును చేపట్టాలని ఆయన సూచించారు. ఆధునిక జీవన విధానంలో చిరుధాన్యాల ఆవశ్యకతను, ప్రయోజనాలను తెలియచేసి విస్తృతంగా వాడేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. ఫుడ్ -360్ఫండేషన్ అధ్యక్షుడు జెఎ చౌదరి అధ్యక్షత వహించిన ఈసభలో గల్లాఫుడ్స్ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రయ్యనాయుడు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ తదితరులు చిరుధాన్యాల ఆవశ్యకతను వివరించారు.

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
సిపిఐ నేతలు షమీమ్ ఫైజీ, నారాయణ డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 9: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని, పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు 15 రూపాయలు తగ్గించాలని, పఠాన్‌కోట్ దాడులకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జాతీయ సమితి సమావేశంలో శనివారం తీర్మానాలు చేశారు. పార్టీ 90వ వార్షిక ముగింపు ఉత్సవాల్లో భాగంగా గుంటూరులో నిర్వహిస్తున్న జాతీయ సమితి సమావేశాలు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పార్టీ జాతీయ సమితి సభ్యులు షమీమ్ ఫైజీ, కె నారాయణ మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలను కేంద్ర ప్రభుత్వ హత్యలుగా వారు ఆరోపించారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున కేంద్రమే ఆదుకోవాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరుతో వినియోగదారుని నడ్డివిరుస్తూ కంపెనీలకు లాభం చేకూర్చటం ఎంతమాత్రం తగదని హితవు పలికారు. ఎక్సైజ్ డ్యూటీ పేరుతో రూ.30లను వినియోగదారుని నుంచి కేంద్రం వసూలు చేయటం మానుకోవాలన్నారు. పాకిస్తాన్‌తో శాంతి చర్చలు కొనసాగిస్తూనే పఠాన్‌కోట్‌లో దాడులకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

మీకు ఇబ్బంది కలగనీయను

కాపు రిజర్వేషన్లపై బిసిలకు చంద్రబాబు హామీ

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 9: కాపు సామాజిక వర్గానికి బిసి హోదా కల్పించినా ఇతర బిసి కులాల వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీయిచ్చారు. కాకినాడ ఆర్ అండ్ బి అతిథిగృహంలో బసచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును శనివారం వివిధ బిసి సంఘాల నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో కొద్దిసేపు మాట్లాడారు. సమాజంలో డబ్బున్న వారు, డబ్బులేని వారు అనే రెండే కులాలున్నాయని, అందుకే ఆర్ధికంగా వెనుకబడిన అన్ని కులాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఈసందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో కులాలపై చర్చ పూర్తిగా తగ్గించాల్సిన అవసరముందని, దానివల్ల మొత్తం సమాజమే నష్టపోయే పరిస్థితి వస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని పలువురు ఎస్సీ సంఘాల నాయకులు సిఎంను కోరగా దానికి ఆయన స్పందిస్తూ మాలమాదిగలకు సమానంగా న్యాయం చేశామని ఇప్పటికే ఈ రెండు వర్గాల వారికి కేబినెట్ పదవులను ఇచ్చామని బదులిచ్చారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కాకినాడ ఎంపి తోట నరసింహం, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, జిల్లా పరిషత్ అధ్యక్షుడు నామన రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పథకాల్లో అవినీతిని సహించను
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో అవినీతికి పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమల్లో నూరు శాతం ప్రగతి సాధించాలని కలెక్టర్లకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నుండి శనివారం ఉదయం ముఖ్యమంత్రి 13 జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీడియాకు దూరంగా జరిగిన ఈ కాన్ఫరెన్స్‌లో ప్రధానంగా జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై సమీక్షించారు. జిల్లాల వారీగా కార్యక్రమం ప్రగతిని తెలుసుకున్నారు. మొదటి, రెండో విడతలో సాధ్యం కాని అన్ని హామీలను మూడో విడత జన్మభూమిలో పరిష్కరించడానికి కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సాయం కోసం సర్కార్ మెడలు వంచుతా

రైతు, చేనేత కార్మికులకు జగన్ భరోసా

ధర్మవరం, జనవరి 9:ప్రభుత్వం మెడలు వంచి రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలకు న్యాయం జరిపిస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రైతు, చేనేతల భరోసా యాత్రలో భాగంగా శనివారం జగన్ అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని చిగిచెర్ల, అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు, బుక్కరాయసముద్రంలలో పర్యటించారు. ఇందులో భాగంగా తొలుత ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రైతు పండ్ల సత్యనారాయణగౌడ్ ఇంటికెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అలాగే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం రాప్తాడు మండలంలోని కందుకూరుకు బయల్దేరి వెళ్లారు. జగన్ వెంట వైకాపా జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, గురునాథరెడ్డి, జడ్‌పి మాజీ చైర్మన్ తోపుదుర్తి కవిత, పార్టీ నాయకులు తోపుదుర్తి ప్రకాష్, ఎర్రిస్వామిరెడ్డి, వెంకటచౌదరి, చవ్వా రాజశేఖరరెడ్డి, మహానందరెడ్డి, గ్రామ సర్పంచ్ రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కందుకూరు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైకాపా అధినేత జగన్

విశాఖ జిల్లాలో ఎర్రచందనం పట్టివేత
కర్నూలు ఫ్లైయింగ్ స్క్వాడ్ దాడులు

పరవాడ, జనవరి 9: కర్నూలు జిల్లా అటవీశాఖకు చెందిన ప్లైయింగ్ స్క్వాడ్ అధికారులు శనివారం విశాఖ జిల్లా పరవాడ మండలంలో జరిపిన దాడుల్లో ఒక మహిళా రైతు నిల్వచేసిన కోటి రూపాయలు విలువచేసే 10 టన్నుల ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. నల్లమల అడవుల్లో పట్టుబడ్డ కొందరు అనుమానితులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులను నిర్వహించారు. పరవాడ మండలం, రావాడ శివారు ధర్మారాయుడుపేట గ్రామానికి దూరంగా ఉన్న ఇంటిలో ఈ ఎర్రచందనం నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు కర్నూలు జిల్లా అధికారులు శుక్రవారం రాత్రి ఇక్కడికి చేరుకున్నారు. విశాఖపట్నం అటవీశాఖ అధికారుల సమక్షంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు పర్యవేక్షణలో శనివారం యాసవరపు సీత అనే మహిళా రైతు ఇంట్లో సోదాలు నిర్వహించి ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈమె ముందుగా అనుమతి తీసుకుని ఇ.బోనంగి రెవెన్యూ పరిధిలోని భూమిలో ఎర్రచందనం చెట్లు వేసుకున్నారు. ఈ చెట్లలో కొన్ని హదూద్ తుపానులో నేలకొరిగాయి. అంతకు ముందే ఆమె కొన్ని చెట్ల నరికివేతకు రెవెన్యూ, అటవీశాఖ అధికారుల నుండి అనుమతులు తీసుకున్నారు. చెట్లను రెండు విడతలగా నరికి ఇంటిలో నిల్వ చేసుకున్నారు. అయితే ఎన్ని చెట్లకు అనుమతి తీసుకున్నారు, ఎంత నిల్వ ఉంచారన్న అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు ఈ దుంగలను తూకం వేసి, బరువు, ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే ఎర్ర చందనం దుంగలపై గల పొరను తొలగించి, నిల్వ ఉంచటం నేరమని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇక్కడ దొరికిన దుంగలు అడవుల్లో పెరిగే చెట్లు మాత్రం కావని అధికారులు నిర్ధారించారు. సి గ్రేడ్‌కు చెందిన ఈ ఎర్రచందనం విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న అధికారులు