రాష్ట్రీయం

రైతన్నకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: రాష్ట్రంలో రైతుకు మద్దతు ధర సమస్య తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. మార్కెట్‌లో రైతన్నకు గిట్టుబాటు ధర లభించని పక్షంలో ప్రభుత్వం తరపున మద్దతు ధర చెల్లించడానికి ఈ నిధిని వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వం కల్పించే మద్దతు ధర కూడా గిట్టుబాటు కాదని రైతన్న భావించే పక్షంలో ప్రాసెసింగ్ (మిల్లింగ్) చేసుకునే అధికారం కూడా వారికి కల్పించబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. మిర్చికి గిట్టుబాటు ధర కోసం ఇటీవల ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నం కాకుండా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి రైతన్నకు బాసటగా నిలవాలని సిఎం నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే నిధికి మరింత తోడుగా బ్యాంకుల నుంచి రైతు సమాఖ్యలు రుణం తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు కెసిఆర్ ప్రకటించారు. ప్రభుత్వం కల్పించే మద్దతు ధర కూడా గిట్టుబాటు కాదని రైతన్న భావించే పక్షంలో రైతులు నేరుగా తమ ధన్యాన్ని తామే ప్రాసెసింగ్ చేసుకునే అధికారాన్ని కల్పించబోతున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు గురువారం ప్రగతి భవన్‌కు రాగా వారితో ముఖ్యమంత్రి మద్దతు ధర కల్పించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు ప్రస్తుతం గ్రామాలలో సర్వే చేస్తున్నారని, భూముల వివరాలను రైతులు వారి వద్ద నమోదు చేయించాలని ముఖ్యమంత్రి సూచించారు. సర్వే పూర్తి అయిన తర్వాత గ్రామ రైతు సంఘాలు, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రాష్ట్ర రైతు సమాఖ్యకు ఐదు వందల కోట్లు చెల్లించి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెట్‌లో గిట్టుబాటు లభించినప్పుడు మాత్రమే రైతులు తమ ధన్యాన్ని అమ్ముకోవచ్చని, లేనిపక్షంలో వారే ప్రాసెసింగ్ చేసుకునే అధికారం వంటి విశేష అధికారాలను కల్పించనున్నట్టు చెప్పారు. వ్యవసాయానికి సంబంధించి ప్రతీ దశలోనూ రైతు సంఘాలు ఎక్కడికక్కడ చొరవ తీసుకుని రైతన్నకు మేలు చేయాలన్నారు. వ్యవసాయ రంగ విధానాల రూపకల్పనలో రైతు సంఘాలకు భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. రెండు పంటలకు కలిపి ఎకరానికి ఎనిమిది వేల రూపాయాల చొప్పున రైతులకు చెల్లించడం వల్ల వారు అప్పుల ఊబిలోకి వెళ్లే ప్రమాదం తప్పుతుందన్నారు. వచ్చే ఏడాదికల్లా కాళేశ్వరం పంప్ హౌజ్ నుంచి గోదావరి నీటిని వరంగల్‌కు అందిస్తామన్నారు. అలాగే మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా వరకు ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువలను ముందుగానే మరమ్మతులు చేసుకోవాలని సిఎం సూచించారు. వర్షపు నీటిని వృథా చేయకుండా చెరువులు నింపి రెండు పంటలు పండించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

చిత్రం.. మహబూబాబాద్ రైతు ప్రతినిధులతో ముఖ్యమంత్రి కెసిఆర్