రాష్ట్రీయం

తెగిపోయన విద్యుత్ బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ బంధం తెగిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు కరెంట్ సరఫరాను నిలిపివేశాయి. బకాయిల పేరుతో రెండు రాష్ట్రాల మధ్య రేగిన వివాదం తెగేదాకా సాగింది. దీని ప్రభావం ఆగస్టులో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తోంది. తమకు రావలసిన రూ.3500 కోట్ల బకాయిలను వేరే అంశాలతో ముడిపెట్ట రాదంటూ ఏపి జెన్కో వాదిస్తుండగా, తమకూ రావలసిన బకాయిలు ఇవ్వాల్సిందేనంటూ తెలంగాణ తేల్చి చెప్తోంది. బకాయిలు చెల్లించిన తరువాతే మాట్లాడుకుందామంటూ అంటూ ఏపి ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల సిఎండి విజయానంద్ తెలంగాణకు లేఖ రాశారు. ఆస్తులు, అప్పులకు, విద్యుత్ బకాయిలకు సంబంధం లేదని, తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే ఏ అంశాన్నీ ప్రోత్సహించబోమని ఏపి జెన్కో సిఎండి విజయానంద్ ఆంధ్రభూమికి చెప్పారు. మరో పక్క తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ఆంధ్రభూమితో మాట్లాడుతూ తెలంగాణ కూడా ఆదివారం తెల్లవారుఝాము నుంచి ఆంధ్రకు వెళ్లే విద్యుత్‌ను నిలిపేశామన్నారు. దీని వల్ల తెలంగాణకు వచ్చే నష్టమేమీ లేదని ఆయన అన్నారు. మార్కెట్‌లో రూ.3కే విద్యుత్ దొరుకుతోందని ఆంధ్ర విద్యుత్ యూనిట్‌కు రూ. 4.80పైసలవుతోందని ఆయన తెలిపారు. ఇంత ఖరీదు పెట్టి కొనడం అనవసరమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవటం కోసమే ఆంధ్రకు విద్యుత్ సరఫరాను నిలిపేశామన్నారు. 400 మెగావాట్ల కొరత ఉన్నట్లు కనపడినా అది తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపదన్నారు. కాగా, కారుచౌకగా యూనిట్ విద్యుత్ రూపాయిలోపునే దొరికే జల విద్యుత్ కోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య జగడం పొంచి ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు పరస్పరం విద్యుత్ సరఫరాను నిలిపివేసుకున్నా, జలవిద్యుత్ ఉత్పత్తిపై పెత్తనం కోసం పోరు అనివార్యంగా కనపడుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు మూడేళ్లుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి ఈ రెండు ప్రాజెక్టులకు వరద నీరు వస్తే చౌకగా లభించే జలవిద్యుత్ కోసం రెండు రాష్ట్రాలు ప్రయత్నిస్తాయి. ఒకళ్లు నీరు వదలమంటే, మరొకరు నీరు వదలరు. శ్రీశైలం నుంచి నీటిని దిగువకు వదిలే నియంత్రణ ఆంధ్ర ఆధీనంలో ఉంది. శ్రీశైలం నుంచి చీటికి మాటికి దిగువకు నీరు వదిలితే రాయలసీమ నేతలు అంగీకరించరు. నీరు వదలకపోతే జలవిద్యుత్ ఉత్పత్తి జరగదు.
సాగర్ నుంచి దిగువకు నీటిని వదిలే అధికారం తెలంగాణకు లభించింది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణాబోర్డుకు అప్పగించే విషయమై కేంద్రం ఇంతవరకు ఎటువంటి కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. శ్రీశైలం రిజర్వాయర్‌కు సంబంధించి కుడిగట్టు విద్యుత్ హౌస్‌లో 770 మెగావాట్లు, లోయర్ సీలేరులో 460మెగావాట్లు, అప్పర్ సీలేరులో 240మెగావాట్లు, మినీ హైడల్ విద్యుత్ 278మెగావాట్ల ఉత్పత్తి ఆంధ్ర ఆధీనంలో ఉంది. తెలంగాణ ఆధీనంలో శ్రీశైలం ఎడమ గట్టు పవర్ హౌస్ 900మెగావాట్లు, శ్రీశైలం రివర్సబుల్ పంపు స్టేషన్ 900మెగావాట్లు, నాగార్జునసాగర్ 816మెగావాట్లు, ఇతర హైడల్ ప్రాజెక్టులు 636 మెగావాట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. నీళ్లు బాగుంటే సాలీనా ఆంధ్ర నుంచి 2470 మిలియన్ యూనిట్ల విద్యుత్, తెలంగాణ నుంచి 3200 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పైనుంచి కృష్ణానదికి ఆశించిన స్థాయిలో వరద నీరు వచ్చి, భారీ వర్షాలు కురిస్తే జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంనుంచి ఒక మాదిరిగా జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో జలవిద్యుత్ ఉత్పత్తి తారాస్థాయికి చేరుకుంటుంది. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ ప్రాజెక్టుల కెపాసిటీ 1670 మెగావాట్లయితే, నీరు దిగువకు వదలమని తెలంగాణ కోరితే, ఆంధ్ర వదిలే పరిస్థితి కనపడటం లేదు. జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్ పంపకంపై ఇంతవరకు స్పష్టత లేదు. కృష్ణా బోర్డు జల విద్యుత్‌లో చెరి సగం పంచుకోమని కోరింది. ఈ ప్రతిపాదనను ఆంధ్ర అంగీకరించలేదు. శ్రీశైలం ఎడమ గట్టు పవర్ హౌస్, రివర్సబుల్ పంప్ హౌస్ జల విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించినందువల్ల తమకు ఎక్కువ వాటా కావాలని ఆంధ్ర కోరుతోంది. కాగా తూర్పుగోదావరి జిల్లా లోయర్ సీలేరులో విద్యుత్ వాటా కావాలని తెలంగాణ కోరుతోంది. ఉమ్మడి ఆంధ్రలో ఖమ్మం జిల్లాలో ఈ ప్రాజెక్టు ఉండేది. ఈ ప్రాజెక్టునుంచి సాధారణ రోజుల్లో కూడా 460మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సీలేరు జల విద్యుత్‌లో వాటా ఇస్తే, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కూడా తగినంత వాటా ఇస్తామని తెలంగాణ ఆఫర్ చేస్తోంది.