రాష్ట్రీయం

ట్రెజరీ చెల్లింపులకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: రాష్ట్రంలోని జిల్లా, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో విస్తరిస్తున్న అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వాతంత్య్రానంతర కాలం నుంచి ట్రెజరీల ద్వారా వెళ్లిన బిల్లులకు బ్యాంక్‌ల నుంచి నేరుగా చెల్లింపులు జరుగుతుంటే దేశవ్యాప్తంగా రెండేళ్ల నుంచి ‘కార్పొరేట్ నేషనల్ బ్యాంకింగ్ సర్వీస్’ అమల్లోకి వచ్చింది. దీనివల్ల బ్యాంకులు ట్రెజరీల నుంచి వచ్చిన బిల్లులను ఆమోదించి సంబంధిత నగదు మొత్తాలను సంబంధిత ట్రెజరీలకే ఇ-చెక్ రూపంలో పంపటం, ఆపై సంబంధిత బ్యాంక్ ఖాతాలకు జమకావటం జరుగుతోంది. ఈ లావాదేవీలకు సంబంధించిన పాస్‌వర్డ్ ట్రెజరీ అధికారితో పాటు మరోఉద్యోగి వద్ద ఉంటుంది. అయితే ఆ పాస్‌వర్డ్ మూడో వ్యక్తికి తెలియటం, లేదా ఆ ఇద్దరూ కుమ్మక్కయి అక్రమ లావాదేవీలు చేస్తున్నారు. అదే బ్యాంకుల్లో అయితే డబుల్ లాక్ సిస్టం ఉంటుంది. దీంతో ఎక్కడా డబ్బు గల్లంతవుతున్న దాఖలాలు లేవు. ట్రెజరీల్లో గత కొద్ది మాసాల్లోనే ఐదారు కోట్ల రూపాయలు అక్రమంగా ఉద్యోగుల ఖాతాలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు విధాలుగా ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి ‘కాంప్రెహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్’ విధానం అమలుపర్చేందుకు సీనియర్ అధికారులు విజయవాడ సమీప గొల్లపూడిలోని ప్రధాన కార్యాలయంలో గత నెలరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఏవిధంగా అయినా ఈ విధానాన్ని అన్ని ట్రెజరీల్లో అక్టోబర్ నుంచి అమల్లోకి తేవాలని ఉన్నతాధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాలన్నీ అతని జీతం బిల్లు, ఇతరత్రా రుణం మంజూరు, ఇతర బిల్లుల చెల్లింపు సమయంలో క్షణాల్లో కంప్యూటర్‌పై సాక్షాత్కరిస్తాయి. ఇక నుంచి ఉద్యోగుల బిల్లులతో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు సహా అన్ని సర్ట్ఫికెట్లతో పాటు కీలక డాక్యుమెంట్‌ను కూడా స్కానింగ్ చేసి పంపించాల్సి ఉంటుంది. వాటిల్లో ఎక్కడ తేడావచ్చినా చెల్లింపు నిలిచిపోతుంది. దీనిద్వారా బోగస్ బిల్లులకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. రెండో దశలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటైన బయోమెట్రిక్ సిస్టంను ఆన్‌లైన్ ద్వారా ట్రెజరీలకు అనుసంధానం చేస్తారు. దీనివల్ల జీతాల బిల్లుల చెల్లింపు సునాయాసం కావటం అటుంచి బిల్లుల మంజూరులో ఎక్కడా అవకతవకలకు ఆస్కారం ఉండదంటున్నారు. ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన పెన్షనర్లు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యుల నుంచి తగిన సమాచారం లేకపోవటంతో యథావిధిగా వారి ఖాతాలకు పెన్షన్లు వెళుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తమకు సమాచారం అందినప్పటికీ దాన్ని తొక్కిపెట్టి సొంత ఖాతాలకు మళ్లిస్తున్న ఘనులు కూడా ఉన్నారు. లేదా మరణించిన పెన్షనర్ల వారసులతో కుమ్మక్కయి ప్రభుత్వ సొమ్మును దిగమింగుతున్న వారుకూడా ఉన్నారు. ఇలాంటి అక్రమాలకు కూడా పూర్తిగా చెక్ పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఇ-కుబేర విధానం ద్వారా రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆన్‌లైన్ చెల్లింపులు జరిపించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పలు వర్గాలతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.