రాష్ట్రీయం

చిరస్మరణీయుడు సినారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: తెలుగు జాతి అత్యున్నత సాహితీవేత్త డాక్టర్ సి నారాయణ రెడ్డిని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబునాయుడు సినారె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. దేశంలో సినారెకు ఒక ప్రత్యేకత ఉందని, ఆయనతో తనకు సుదీర్ఘ పరిచయం ఉందని పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ అయితే ఆయనను అత్యంత గౌరవంగా చూసేవారని, ఎప్పుడు వచ్చినా సొంత కుటుంబ సభ్యుడి కంటే మిన్నగా చూసేవారని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ సినిమాల్లో నారాయణ రెడ్డి బ్రహ్మాండమైన పాటలు రాశారని వ్యాఖ్యానించారు. తనకు బాగా పరిచయం ఏర్పడిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలకు వక్తృత్వంలో శిక్షణ ఇవ్వాలని కోరినపుడు ఆయన ఒప్పుకొని చాలా సార్లు వచ్చారని అన్నారు. రాజకీయ నాయకులకు కమ్యూనికేషన్ చాలా గొప్ప ఆయుధమని, ఆ విషయంలోనూ ఆయనకు మించిన వారే లేరని అన్నారు. దేశంలో ఎవరికీ దొరకని గౌరవం ఆయనకు దక్కిందని, ఆయన రాసిన పాటలు, కావ్యం చరిత్రలో చిరస్థాయిలో నిలుస్తాయని చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా నారాయణ రెడ్డిని తానే సిఫార్సు చేశానని వెల్లడించారు. అలాగే సాంస్కృతిక మండలి చైర్మన్‌గా కూడా నియమించామని, ప్రతి పదవిలోనూ ఆయన ఎనలేని సేవలు అందించారని చంద్రబాబు వివరించారు. తాను అనేక మార్లు కలిసినపుడు ఎంతో ఆప్యాయత, అనురాగంతో పలకరించేవారని, తాము కుటుంబ సభ్యుడిగా భావించేవారమని,
గొప్ప ఆప్తుడిని కోల్పోయామని పేర్కొన్నారు. నారాయణరెడ్డి మృతి దేశానికి, సాహితీలోకానికే తీరని లోటని, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. తన కుమార్తెలకు నదుల పేర్లు పెట్టుకున్నారంటే నదులపై ఆయనకు ఉన్న ప్రేమ ఎంతో అర్థమవుతుందని చంద్రబాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ , టిడిపి నేతలు ఎల్ రమణ, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నన్నపనేని రాజకుమారి, గాదె వెంకటరెడ్డి తదితరులున్నారు.
హైదరాబాద్‌లో సినారె స్మారక భవనం: కెసిఆర్
కాగా,సినారె స్మారకార్థం హైదరాబాద్ నగర నడిబొడ్డున ఆయన పేరిట సమావేశ మందిరం నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అలాగే ట్యాంక్‌బండ్, కరీంనగర్ పట్టణం, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. సినారె పేరు చిరస్థాయిగా నిలిచేందుకు ఓ ప్రముఖ సంస్థకు ఆయన పేరు పెడతామన్నారు. మంగళవారం మధ్యాహ్నం సినారె ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్రం గర్వంగా తల ఎత్తుకుని మా బిడ్డ అని చెప్పుకునేంతటి మహానీయుడు సి నారాయణరెడ్డి’ అని కొనియాడారు.
నేడు సారస్వత పరిషత్‌లో సినారె భౌతికకాయం
ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం 9 గంటలకు బొగ్గుల కుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో సినారె పార్థివదేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత పది గంటలకు సారస్వత పరిషత్ నుంచి ప్రశాసన్ నగర్ తరలించి, అక్కడి నుంచి ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా అంతిమయాత్రలో పాల్గొంటారని అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్రం.. సినారె భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తదితరులు