రాష్ట్రీయం

ఆకర్ష్ ఆంధ్ర ఓటర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: తెలంగాణ ఉద్యమ కాలంలో రాజధాని నగరంలో వీధులన్నీ జై తెలంగాణ నినాదాలతో మారుమోగగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇప్పుడు ఆంధ్ర ఓటర్ల కోసం ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఎత్తులకు పై ఎత్తులతో తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
గ్రేటర్ పరిధిలో ఆంధ్ర ఓటర్ల సంఖ్య ఎంత అనేది స్పష్టమైన అధికారిక లెక్కలు లేకపోయినా ఎవరికి వారు సొంత లెక్కలు చెబుతున్నారు. విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీకి హైదరాబాద్‌లోని ఆంధ్ర ప్రాంతం వారికి సంబంధించిన లెక్కలను ప్రధాన రాజకీయ పక్షాలు అందజేశాయి. అప్పటి కాంగ్రెస్ ఎంపి రాయపాటి సాంబశివరావు నాయకత్వంలోని బృందం హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రాంతం వారు 30లక్షల మంది ఉన్నారని వివరించారు. ఆ వెంటనే టిఆర్‌ఎస్ నాయకులు, ప్రస్తుత ఎంపి బి వినోద్ కుమార్ కేవలం ఆరులక్షల మంది మాత్రమే ఉన్నారని నియోజక వర్గాల వారిగా లెక్కలు చెప్పారు.
ఒక వర్గంగా చూస్తే హైదరాబాద్ ఓటర్లలో ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఒక అంచనా ప్రకారం 30 శాతం వరకు ఉంటారు. ఇంత పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉన్నా ఏ పార్టీ వారి ఓట్ల కోసం పెద్దగా దృష్టిసారించడం లేదు. కానీ ఎంత సంఖ్యలో ఉన్నారో తెలియని ఆంధ్ర ప్రాంతం ఓటర్ల కోసం టిఆర్‌ఎస్ సహా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ముస్లింల ఓట్లు ఎక్కువగా పాత నగరంలోనే ఉండడం, వారంతా ఎంఐఎం వైపు ఉండడంతో మరో పార్టీ అక్కడ ప్రయత్నించి వృథా అనే అభిప్రాయంతో ఉన్నాయి. గతంలో పాత నగరంలో ఎంఐఎంను ఓడించేందుకు బిజెపి ప్రయత్నించేది. గత కొంత కాలంగా బిజెపి సైతం పాత నగరంపై ఆశలు వదులుకుంది.
ఉమ్మడి రాష్ట్రంలోనే 2014లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ పరిస్థితి వేరు. ఇతర ప్రాంతాల వారు టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగానే స్పందించారు. అలాంటి పరిస్థితిలోనూ టిఆర్‌ఎస్‌కు గ్రేటర్ పరిధిలో 22శాతం ఓట్లు వచ్చాయి. గోకుల్ ట్రస్ట్ భూముల వ్యవహారం తరువాత అనూహ్యంగా టిఆర్‌ఎస్ తన వైఖరి మార్చుకుంది. గ్రేటర్‌లోని ఏపి, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఆకట్టుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నించింది. ప్రారంభంలో దీన్ని మిగిలిన రాజకీయ పక్షాలు తేలిగ్గానే తీసుకున్నా క్రమంగా టిఆర్‌ఎస్ ఆంధ్ర ప్రాంతం వారి మద్దతు సైతం సాధిస్తుండడంతో ఇతర పార్టీలు స్పందించాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్ల ఓట్ల కోసం టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందంటూ టిడిపి నాయకుడు నారా లోకేశ్ ట్విట్టర్‌లో ఆదివారం విమర్శించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వివిధ కులాల సంఘాలతో టిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ఇప్పటికే సమావేశం అయ్యారు.
గోదావరి జిల్లాలకు చెందిన రాజులు పెద్ద సంఖ్యలో టిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. ఆంధ్రకు చెందిన వారంతా టిడిపి- బిజెపి కూటమికే అండగా నిలుస్తారనే బలమైన అభిప్రాయం ప్రారంభంలో ఉండేది. కానీ పరిస్థితి మారుతుండడం, మరోవైపు కాంగ్రెస్ సైతం ఆంధ్ర ఓటర్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించడంతో ఏదో ఒక పార్టీకి అండగా ఉంటారనే అభిప్రాయం కనిపించడం లేదు. ఇటీవల వివిధ కులాల వారు కార్తీక వన భోజనాలు నిర్వహించినప్పుడు ఇదే అభిప్రాయం వినిపించింది.
టిడిపికి మొదటి నుంచి అండగా నిలిచిన సామాజిక వర్గం వన భోజనాల్లో గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సైతం చర్చించారు. మనం ఏదో ఒక పార్టీకి పరిమితం కావలసిన అవసరం లేదని, అన్ని పార్టీల్లో మనం ఉండాలని, మన వారికి ఎవరు టికెట్ ఇస్తే వారిని గెలిపించుకోవాలని కుల సంఘాల వన భోజనాల సమావేశాల్లో నిర్ణయించారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిలో కొన్ని అనుమానాలు ఉండేవని, కానీ 18నెలల టిఆర్‌ఎస్ పాలనతో అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయని ఐటి మంత్రి కెటిఆర్ తెలిపారు. గతంలో ప్రధానమంత్రికి మీడియా సలహాదారుగా వ్యవహరించిన బారువా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అంశాన్ని టిఆర్‌ఎస్ నాయకులు ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు ఆంధ్ర ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటూ మరో వైపు పెద్ద సంఖ్యలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లను సైతం ఆకట్టుకునేందుకు ముందు నుంచి టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కెసిఆర్ స్వయంగా కేరళ వారి సమావేశంలో పాల్గొన్నారు. గుజరాతీల సమావేశంలో కవిత పాల్గొన్నారు. గతంలో మోదీ హవా ఉన్నప్పుడు 2014లో హైదరాబాద్ ఓటర్ల స్పందన ఒకలా ఉందని, 18 నెలల్లో టిఆర్‌ఎస్ పట్ల సానుకూలత పెరగడం, అదే సమయంలో మోదీ హవా తగ్గుతుండడం వల్ల గ్రేటర్‌లో సమీకరణలు మారాయని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. ఆంధ్ర ప్రాంతం వారి ఓట్లు ఏదో ఒక పార్టీకి గుండుగుత్తగా పడే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని పార్టీల మధ్య చీలే అవకాశం ఉందని అన్ని పార్టీల నాయకులు చెబుతున్నారు. అయితే అన్ని పార్టీలు తమ వాటా ఎక్కువగా ఉండాలని కోరుకుంటూ అందుకోసం ప్రయత్నిస్తున్నాయి.