రాష్ట్రీయం

జోనల్ వ్యవస్థ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నాలుగు ఆర్డినెన్స్‌లను రాష్ట్ర మంత్రిమండలి శనివారం ఆమోదం తెలిపింది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. కల్తీని పిడి చట్టంలో చేరుస్తూ ఒక ఆర్డినెన్స్, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పై నిషేధం, ఆర్‌ఓఆర్ చట్టంలో సవరణలు, వ్యాట్ చట్టాన్ని మరో ఆరేళ్ల పాటు కొనసాగించే విధంగా వ్యాట్ చట్టానికి సవరణలు చేస్తూ జారీ అయిన ఆర్డినెన్స్‌లను మంత్రివర్గం ఆమోదించింది. వచ్చే మూడేళ్లలో 26వేల 290 మంది పోలీసులను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జోనల్ వ్యవస్థ రద్దు కోసం రాష్టప్రతికి సిఫారసు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్టప్రతి ఉత్తర్వులు 371 డి ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో మూడు కేటగిరిలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు, జోనల్ పోస్టులు, జిల్లా పోస్టులుగా మూడు అంచెల వ్యవస్థ ఉంది. తెలంగాణ ఆవిర్భావం, కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం మూడు అంచెల వ్యవస్థకు బదులు రెండు అంచెల వ్యవస్థ ఉండాలని ఉద్యోగ సంఘాలు పలు సార్లు అభిప్రాయాలు వెల్లడించినట్టు కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి రెండు అంచెలకు పరిమితం కావాలని, జోనల్ స్థాయిని తొలగించాలని సూచించారు. ఈ మేరకు రెండు అంచెల వ్యవస్థకు అనుకూలంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఆమోదించాలని రాష్టప్రతిని కోరతారు. రెండు అంచెల వ్యవస్థ కోసం 371డికి సవరణ చేయాలని రాష్టప్రతిని కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. తీర్మానం ప్రతిని రాష్టప్రతికి పంపిస్తారు. దీనిపై ఉద్యోగ సంఘాలు, ఎవరైనా సలహాలు సూచనలు చేయడానికి వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని వేసినట్టు కడియం తెలిపారు.
పీడి చట్టాన్ని సవరిస్తూ జారీ అయిన ఆర్డినెన్స్‌ను మంత్రివర్గం ఆమోదించింది. ఆహార పదార్థాల కల్తీ మొదలుకొని, నకిలీ డ్యాకుమెంట్లు నకిలీ కరెన్సీ తయారీ వరకు మొత్తం పది అంశాలను చేరుస్తూ ఆర్డినెన్స్ తీసుకు వచ్చారు. పిడి యాక్ట్‌లో వీటిని చేరుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కల్తీ చేసినా, కల్తీ ఆహార పదార్థాలు విక్రయించినా పిడి చట్టం కింద చర్య తీసుకుంటారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, కల్తీపాలు, కల్తీ నూనెలు, నకిలీ డ్యాకుమెంట్ల, సర్ట్ఫికెట్లకు ఇక పిడిచట్టం కింద చర్య తీసుకుంటారు.
వ్యాట్ స్థానంలో జిఎస్‌టి అమలులోకి రానున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాట్ చట్టం మరో ఆరేళ్ల పాటు ఉండే విధంగా ఆర్డినెన్స్ జారీ చేశారు. వ్యాట్ చట్టం ఆధారంగా ఉన్న కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాలను దృష్టిలో పెట్టుకుని ఆర్‌ఓఆర్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది. మంత్రివర్గం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. పదిహేను రోజుల్లో మ్యూటేషన్ చేయాలి. ఒకే పాస్ బుక్ ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్‌లకు ఉండే విచక్షణాధికారాలు తొలగిస్తూ ఆర్‌ఓఆర్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ జారీ చేశారు. పోలీసు శాఖలో 26వేల 290 పోలీసు పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. వీటిలో 18వేల 290 కొత్త పోస్టులు కాగా, ఎనిమిది వేల ఖాళీలు ఉన్నాయి. మూడేళ్లలో దశల వారిగా ఈ పోస్టులను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
తెలంగాణ స్టేట్ రోడ్ కార్పొరేషన్‌కు రుణ పరిమితి వెయ్యి కోట్ల రూపాయలు కాగా, దానిని ఐదువేల కోట్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదించింది. వీటిలో 1200కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.
రైతుల ఎన్‌రోల్‌మెంట్‌పై క్యాబినెట్‌లో చర్చ జరిగినట్టు తెలిపారు. కొన్ని జిల్లాల్లో రైతులు ఇంకా ఎన్‌రోల్ చేసుకోలేదని, ఈనెల 15కు చివరి తేదీ ముగిసినా ఇంకా ఎన్‌రోల్ చేసుకోని వారికి కొంత అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ఈ నెల 20 నుంచి గొర్రెల పంపకం పథకానికి గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారని కడియం తెలిపారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ నియోజక వర్గాలు అన్నింటిలో మంత్రులు, ఎంపిలు, శాసన సభ్యులు, జడ్‌పి చైర్మన్‌లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20న ప్రారంభం అయి కొనసాగుతుందని చెప్పారు. దేశంలో తొలిసారి రాష్ట్రంలో వంద సంచార పశు వైద్య శాలలను కూడా అదే రోజు ప్రారంభించనున్నట్టు చెప్పారు. గతంలో నాలుగువేల చెరువుల్లో చేపలను ఉచితంగా వేసినట్టు చెప్పారు. ఈసారి 70 కోట్ల చేపలను 24వేల చెరువుల్లో వేయనున్నట్టు చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులు అయిన వారికి ఆ ప్రాజెక్టులోని మత్స్య సంపదలో హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అక్టోబర్ 22 నుంచి వారం రోజుల పాటు తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
హరిత హారంలో ఈసారి 40 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. వర్షాల పరిస్థితిని బట్టి హరిత హారం ఎప్పుడు చేపట్టాలో నిర్ణయిస్తారని కడియం శ్రీహరి తెలిపారు. మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం.. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను మీడియాకు వివరిస్తున్న ఉప ముఖ్యమంత్రి
కడియం శ్రీహరి. చిత్రంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి