రాష్ట్రీయం

భాగస్వామ్య సదస్సులో తొలి రోజు ఒప్పందాలు ఇవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 10: విశాఖలో సిఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు తొలిరోజు ఆదివారం వివిధ కంపెనీల మధ్య, ప్రభుత్వానికి, కంపెనీలకు మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. మొత్తం మీద 1,95,457 కోట్ల రూపాయల మేర ఒప్పందాలు కుదిరాయి. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే విద్యుత్ రంగంలో 67,055 ఉద్యోగాలు, పారిశ్రామిక రంగంలో 27,393 మందికి, మైనింగ్ రంగంలో 300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. విద్యుత్ రంగంలో 22, పారిశ్రామిక రంగంలో తొమ్మిది ఒప్పందాలు కుదరగా, మైనింగ్ రంగంలో ఒక ఒప్పందం కుదిరింది. విద్యుత్ రంగంలో 1,45,067 కోట్ల రూపాయల మేర ఒప్పందాలు కుదిరాయి. ఇందులో బ్రిస్‌బేన్‌కు చెందిన క్వీన్స్‌లాండ్ కోల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ 31,680 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే సుజ్‌లాన్ ఎనర్జీ లిమిటెడ్, యాక్సిస్ విండ్ ఎనర్జీ 3000 మెగా వాట్ల విండ్ ఎనర్జీ, 1000 మెగావాట్ల సోలార్ హైబ్రీడ్ ప్లాంట్లను 28 వేల కోట్ల రూపాయలతో స్థాపించనున్నాయి. సనీ గ్రూప్ 23,500 కోట్ల రూపాయలతో కోల్ ఫ్రైడ్ యుఎస్‌పిపి అండ్ విండ్, 3500 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్‌ను స్థాపించనుంది. కెపిసిఎల్ 2780 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను 16,680 కోట్ల రూపాయలతో స్థాపించనుంది. గమేశా విండ్ టర్బైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై) 500 మెగా వాట్ల విండ్ పవర్‌ను ఉత్పత్తి ప్లాంట్‌ను 3,500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనుంది. సన్ ఎడిషన్ ఎనర్జీ ఇండియా (చెన్నై) 3,500 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ (500 మెగా వాట్లు)ను ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక రంగంలో 50,900 కోట్ల మేర ఒప్పందాలు జరిగాయి. రిలయన్స్ ఎడిఎ గ్రూప్ 5000 కోట్లతో నేవల్ షిప్ బిల్డింగ్ కర్మాగారాన్ని స్థాపించనుంది. 1400 కోట్ల రూపాయలతో భారత్ ఫోర్జ్ ఆటోమోటివ్ కంపెనీలను నెలకొల్పనుంది.
భారత్ ఫోర్జ్ 1300 కోట్ల రూపాయలతో డిఫెన్స్ రంగానికి కావల్సిన విడి భాగాల తయారీ కర్మాగారాన్ని స్థాపించేందుకు ఒప్పందాలపై సంతకాలు చేసింది. అశోక్ లేలండ్ 1000 కోట్లతో బాడీ బిల్డింగ్ యూనిట్‌ను నెలకొల్పనుంది. దివీస్ ల్యాబ్స్ 1290 కోట్లతో ఫార్మాస్యూటికల్ కంపెనీని ఏర్పాటు చేయనుంది. అలాగే జియోమైసూర్ సంస్థ 300 కోట్లతో గోల్డ్ మైనింగ్‌ను చేపట్టనుంది.

జూన్ నాటికి ‘ఇంటి’ర్నెట్

ప్రజలతో టెలీకాన్ఫరెన్స్‌లో సంభాషిస్తా ప్రపంచం చూపు విశాఖ వైపు
భారత్‌లోనే ఉపాధి అవకాశాలు మెండు: ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాఖపట్నం, జనవరి 10: వచ్చే జూన్ నాటికి ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అన్నారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఆంధ్రావిశ్వవిద్యాలయం, రాష్ట్ర ఉన్నతవిద్యా శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ ఓపెన్ ఇన్నోవేషన్ కేంద్రానికి విశాఖలో ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాను టెక్నాలజీని బలంగా నమ్మే వ్యక్తినన్నారు. గ్లోబలైజేషన్‌తో ప్రపంచమే కుగ్రామమైపోయిన తరుణంలో మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సేవలు విస్తరించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. జూన్ నాటికి ప్రతి ఇంటికీ 10 నుంచి 15 ఎంబిపిఎస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించే దిశగా ముందుకు సాగుతున్నట్టు ఆయన తెలిపారు.
తొలుత రూ.5000 కోట్లు వ్యయం కాగలదని అంచనా వేసినప్పటికీ తాత్కాలికంగా రూ.320 కోట్లతో దీన్ని సాధించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. భవిష్యత్‌లో తాను ప్రజలతో నేరుగా టెలీకాన్ఫరెన్స్‌లోనే ముఖాముఖి మాట్లాడుతానని, అదే తన లక్ష్యమని పేర్కొన్నారు. తాను సాంకేతిక విప్లవాన్ని ఎంతగా అందుబాటులోకి తెచ్చినప్పటికీ సమర్థత, నైపుణ్యం గల యువత అవసరమన్నారు. ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన బర్కిలీ యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలు నవ్యాంధ్రలో విద్యార్థులతో తమ ఆలోచనలు పంచుకునేందుకు ముందుకు రావడం ముదావహమన్నారు. బర్కిలీ యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రతినిధి సాల్మన్ డార్విన్ మాట్లాడుతూ యువత ఎంతో మేధస్సుతో ముందుకు సాగుతోందన్నారు. విశాఖను స్మార్ట్‌సిటీగా రూపుదిద్దే అంశంలో అవసరమైన నమూనాలకు రూపకల్పన చేస్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్రా యూనివర్శిటీతో కలిసి బర్కిలీ యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పనిచేస్తుందన్నారు. ఉన్నతవిద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సుమిత్ర దావ్రా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, ఉపాధి అవకాశాల మెరుగునకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. అంతకు ముందు బర్కిలీ యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఆచార్యుడు సాల్మన్ డార్విన్, రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సుమిత్ర దావ్రా, ఆంధ్రాయూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య జిఎస్‌ఎన్ రాజు ఒప్పందంపై సంతకాలు చేశారు.
కార్యక్రమంలో మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, విశాఖ ఎంపి కె హరిబాబు, ఎమ్మెల్యేలు గణబాబు, రమేష్‌బాబు, వి అనిత, పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీలు జి శ్రీనివాసులు నాయుడు, పి చలపతిరావు, కలెక్టర్ ఎన్ యువరాజ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జెర్సీ, యూనివర్శిటీ రెక్టార్, రిజిస్ట్రార్, తదితరులు పాల్గొన్నారు.