రాష్ట్రీయం

తిన్నదంతా కక్కిస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: విశాఖలో విలువైన భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్, పార్టీ ఎమ్మెల్యేలు కబ్జా చేశారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వారు తిన్నదంతా కక్కిస్తానని ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్ అన్నారు. విశాఖ భూ కుంభకోణంలో నిందితులపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైకాపా నేతృత్వంలో గురువారం స్థానిక జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సేవ్ విశాఖ పేరుతో మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ జిల్లాలో 1,06,239 ఎకరాలకు సంబంధించి ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్స్ మాయం కావడం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని అన్నారు. రికార్డుల గురించి ప్రశ్నిస్తే, హుదూద్ తుపానులో పోయాయని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. హుదూద్ తుపానులో కేవలం గాలి మాత్రమే వచ్చిందని, దీనికి రెవెన్యూ భవనాలు ఎక్కడా కూలిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. విశాఖ జిల్లాలో 23,876ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిందని, 375 రీ సెటిల్‌మెంట్ రికార్డులు కనిపించడం లేదని అధికారులే అంగీకరిస్తున్నారని జగన్ అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సోదరుడు భాస్కరరావు తనకు సంబంధం లేని భూములను తనవిగా చూపించి, వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి, రుణాలు తీసుకోవడం దారుణమని జగన్ అన్నారు. జిల్లా అధికారులే దగ్గరుండి ఈ తంతు నడిపించారని జగన్ ఆరోపించారు. ఇందులో సిఎం తనయుడు లోకేష్‌కు కూడా కొంతభాగం ఉందని ఆయన అన్నారు. చోడవరం ఎంపిపి కొమ్మాదిలో 24.3ఎకరాలను అతని పేరున, భార్య పేరున 25 ఎకరాల భూమిని అక్రమంగా రాయించుకున్నాడని, తాను జిల్లాకు వస్తున్నానని తెలిసి, రికార్డులను యథాతథంగా మార్చేశారని జగన్ ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తికి రిషికొండలో విలువైన భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. రాజీవ్ స్వగృహ కోసం కేటాయించిన 358ఎకరాల భూమిని జిల్లాకు చెందిన ఓ మంత్రి కాజేయాలని ప్రయత్నిస్తుంటే, గత కలెక్టర్ అడ్డుకున్నాడని చెప్పారు. ముదపాక భూముల స్కామ్‌లో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని జగన్ ఆరోపించారు. ‘‘విశాఖలో ఎయిర్‌పోర్టు మూసేసి, భోగాపురంలో కొత్త ఎయిర్‌పోర్టు కట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అక్కడున్న అయ్యన్నపాత్రుని భూములు తీసుకోరు. టిడిపి నేతల భూములను వదిలిపెడతారు. కానీ పేద వారి భూములు తీసుకోడానికి ఉపక్రమిస్తున్నారు’’అని జగన్ అన్నారు.
విశాఖలో జరిగిన భూ కుంభకోణాలన్నింటిపైన సిట్‌తో దర్యాప్తు జరిపిస్తామని చెపుతున్నారు. జరిగిన కుంభకోణంలో చంద్రబాబు, లోకేష్, అధికారుల పాత్ర ఉన్నప్పుడు వారి కింద పనిచేసే అధికారులు నిజాయితీగా దర్యాప్తు ఎలా చేస్తారని జగన్ ప్రశ్నించారు. సిబిఐ విచారణ జరిపితే, చంద్రబాబు సహా, అందరూ శిక్ష అనుభవిస్తారని ఆయన అన్నారు. సిబిఐ విచారణ జరిపితే, 20ఏళ్ల వరకూ కొనసాగే అవకాశం ఉందని చంద్రబాబు చెపుతున్నారని, అసలు విషయం ఏంటంటే, సిబిఐ దర్యాప్తులో ఆయన దోషి అని తేలితే 20ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారని జగన్ అన్నారు. ‘పేద వాడికి చెందిన ఒక్క అంగుళం భూమి కూడా అన్యాక్రాంత కాకుండా పోరాడదాం. ఒకవేళ ఈ పోరాటంలో మనం విజయం సాధించకపోతే, రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తోందని, అప్పుడు ఈ అక్రమార్కులు తిన్నదంతా కక్కిస్తా’నని జగన్ చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఇతర నేతలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

చిత్రం.. వైకాపా సేవ్ విశాఖ మహాధర్నాకు హాజరైన జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న జగన్