రాష్ట్రీయం

కోట్లు తినేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/ తిరుపతి/ విజయవాడ, జూన్ 23: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ప్రజారోగ్య శాఖ ఈఎన్‌సి పాము పాండురంగారావు, ఆయన బంధువు, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, కెజిహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎన్‌బి విజయకుమార్‌లను అవినీతి నిరోధక శాఖ వలపన్ని పట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల కూడబెట్టిన ఆస్తులపై ఆరా తీస్తోంది. ఈఎన్‌సి పాండురంగారావు కూడబెట్టిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.900 కోట్ల పైనే ఉండొచ్చని ఏసీబీ డీజీ వెల్లడించారంటే, పరిస్థితిని అంచనా వేయొచ్చు. శుక్రవారం తిరుపతిలోని కేశవాయనగుంట రాఘవేంద్రనగర్‌లో ఉన్న ఏసీబీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో అవినీతి తిమింగలాలు కూటబెట్టిన ఆస్తుల చిట్టాను వివరించారు. ఇదిలావుంటే, తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల అవినీతి భాగస్వాములిద్దరూ కూడబెట్టిన ఆస్తులపై ఏసీబీ శుక్రవారం దాడులు జరిపింది. దాడుల్లో భారీగా బంగారం, వెండితోపాటు వివిధ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు బయటపడింది. ప్రజారోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో ఈఎన్‌సి బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ పాము పాండురంగారావు (58) ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. దాడుల్లో రిజిస్ట్రార్ కార్యాలయ విలువ ప్రకారం 12 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. అయితే మార్కెట్ రేటు ప్రకారం ఆస్తుల విలువ 900 కోట్లు ఉండొచ్చని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ తిరుపతిలో వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నవోదయ కాలనీ గౌతం టవర్స్‌లోని పాము నివాసంతోపాటు విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాద్ సహా మొత్తం 14 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఏసిబి డిజి ఆర్పీ ఠాకూర్ ఆదేశాలతో అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ రమాదేవి నేతృత్వంలో అధికారులు జరిపిన సోదాల్లో కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు, బినామీ పేర్లతో భారీగా అక్రమాస్తులను కనుగొన్నారు. తాడేపల్లిలోని పాండురంగారావు ఇంట్లో పది లక్షలు నగదు, మరో 1.95 లక్షలు విలువైన విదేశీ కరెన్సీ, 25 లక్షలు బ్యాంకు బ్యాలెన్స్ గుర్తించారు. అదేవిధంగా ఇంట్లో లభించిన 15 లక్షలు విలువ చేసే ఖరీదైన గృహోపకరణాలు, 30 లక్షలు విలువైన 1.1 కేజీ బంగారం, రూ.1.8 లక్షలు విలువైన 9 కేజీల వెండి, ఒక హోండా యాక్టివా వాహనం స్వాధీనం చేసుకున్నారు.
స్థిరాస్తుల అక్రమ చిట్టా
సోదాల్లో పాండురంగారావు అక్రమాస్తుల చిట్టాను అధికారులు నిగ్గు తేల్చారు. విశాఖలో 20, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు, విజయనగరంలో ఒకటి, గుంటూరులో ఎనిమిది, హైదరాబాద్‌లో ఏడు స్థలాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఇళ్లు, హైదరాబాద్‌లో వాణిజ్య స్థలం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 24 ఎకరాల పొలం, విశాఖ అశ్వనీ ఆస్పత్రిలో నాలుగు కోట్ల పెట్టుబడులు గుర్తించారు. రైటన్ సాఫ్ట్‌వేర్, హెచ్‌ఎం టెక్నాలజీలో భార్య, కొడుకు పేరిట పెట్టుబడులు, సుధీర్ అండ్ సునీల్స్‌లో సోలార్ పవర్‌ప్లాంటులో రూ.66 లక్షల పెట్టుబడులు గుర్తించారు. పాండురంగారావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డిజిపి ఆర్‌పి ఠాకూర్ తెలిపారు.
ఇదిలావుంటే, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న విజయకుమార్ సైతం భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ నిర్థారించింది. ప్రజారోగ్య శాఖలో ఈఎన్‌సి హోదాలోవున్న పాండురంగారావుతో కలిసి వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ తేల్చింది. ఏసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ అందించిన వివరాల ప్రకారం పాండురంగారావు 2003-05 మధ్య గ్రేటర్ విశాఖలో సిఇగా పని చేస్తున్నపుడు, విజయ్‌కుమార్ భార్య నిర్మల జివిఎంసిలో యుహెచ్‌డి డాక్టర్‌గా పని చేసేవారు. నిర్మల, పాండురంగారావు మధ్య బంధుత్వముంది. దీంతో విజయకుమార్, పాండురంగారావు కలిసి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు. పాండురంగారావుకు ఇద్దరు కుమారులు. విజయకుమార్‌కు ఇద్దరు కుమార్తెలు. విజయకుమార్ ఇద్దరు కుమార్తెలు మెడిసిన్ పూర్తి చేశారు. పాండురంగారావు ఇక్కడి నుంచి బదిలీ అయిన తరువాత కూడా వీరి స్నేహం కొనసాగింది. వీరిద్దరూ కలిసి విశాఖలో హెల్త్ సిటీలో ఒక ఆసుపత్రి నిర్మించేందుకు ఏపిఐఐసి నుంచి 73సెంట్ల భూమి 5.06 కోట్లకు కొనుగోలు చేశారు. అశ్వినీ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఆసుపత్రి నిర్మాణ పనులు మొదలెట్టారు. దీనికి విజయకుమార్ భార్య, ఆయన ఇద్దరు కుమార్తెలు, పాండురంగారావు ఇద్దరు కుమారులు డైరక్టర్లుగా నియమితులయ్యారు. ఏపిఐఐసికి చెల్లించాల్సిన సుమారు ఐదు కోట్ల రూపాయల్లో 1.64 కోట్లు విజయకుమార్ తన ఇద్దరు కుమార్తెల అక్కౌంట్ నుంచి అశ్విని హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్‌కు బదిలీ చేసి, అక్కడి నుంచి ఏపిఐఐసి అకౌంట్‌కు తరలించారు. మిగిలిన మొత్తాన్ని పాండురంగారావు తన ఇద్దరు కుమారుల అకౌంట్‌నుంచి ఏపిఐఐసికి బదిలీ చేసినట్టు ఏసీబీ నిర్థారించింది.
వీరిద్దరూ కలిసి చేస్తున్న వ్యాపారాలపై కనే్నసిన ఏసిబి అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. స్థానిక మాధవధారలో నివాసం ఉంటున్న విజయకుమార్ ఇంటిపై ఏసిబి దాడులు చేసింది. ఆయన ఇంటినుంచి 2.6 కిలోల బంగారం, 3.88 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ, కాకినాడల్లో పలు ఇళ్ల స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మాధవధారలో అత్యంత విలాసవంతమైన ఇల్లు, కార్లు ఉన్నట్టు ఏసిబి గుర్తించింది. వీటి విలువ మూడు కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తోంది. మొత్తంమీద విజయకుమార్ రెండున్నర కోట్ల రూపాయల వరకూ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఏసిబి డిఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. విజయకుమార్‌ను అరెస్ట్ చేసి, శనివారం ఏసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఆయన వివరించారు.

చిత్రం.. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆభరణాలు, ఇన్‌సెట్‌లో ప్రొఫెసర్ విజయకుమార్