రాష్ట్రీయం

ఖరీఫ్..‘సాగే’నా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 24: సాగర్ ఆయకట్టు రైతులు ఈ ఏడాది కూడా సాగునీటి కోసం వేచి చూడాల్సిందేనా? నాగార్జున సాగర్ జలాశయం అడుగంటిపోవటంతో ఖరీఫ్‌పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. గత రెండేళ్లుగా ఇక్కడ అనధికార క్రాప్ హాలీడే కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తరువాత మంచినీటి అవసరాలకు మినహా సాగుకు నీరందక పోవటంతో రైతులు నిరుడు రెండు పంటలు కోల్పోయారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కుడికాల్వ ఆధునికీకరణకు వేలకోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6,74,263 ఎకరాల భూమి సాగులో ఉంది. గుంటూరు జిల్లాలో 2,43,198 ఎకరాలు ప్రకాశం జిల్లాలో 6236 ఎకరాల మాగాణి భూములు ఉండగా, ఆరుతడి పంటలు మెట్ట్భూముల్లో గుంటూరు జిల్లాలో 4లక్షల 16వేల 314 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 8515 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. నీటి లభ్యతను బట్టి మరో లక్ష ఎకరాలు అనధికారికంగా సాగవుతోంది. రాష్ట్ర విభజనకు ముందు 2009-10లో మాగాణి అవసరాలకు 3.3 టిఎంసిలు, ఆరుతడి పంటలకు 4.01, 2010-11లో ఖరీఫ్‌కు 3.27, రబీకి 3.84, 2011-12లో మాగాణికి 3.15, మెట్ట పంటలకు 3.88టిఎంసిల నీటిని విడుదల చేశారు. 2012లో ఖరీఫ్ సాగుకు నీరందలేదు. రబీకి మాత్రం 4.15టిఎంసిలు పంపిణీ చేశారు. 2013-14 లో మాగాణికి 2.79, మెట్టకు 4.2, 2014-15లో 2.64, 4.29 టిఎంసిలు వదిలారు. 2015-16 సంవత్సరంలో ఖరీఫ్, రబీకి చుక్కనీరందలేదు. 2016-17లో ఖరీఫ్‌కు 0.436, రబీకి 5.772 టిఎంసిల నీటిని విడుదల చేశారు. ఇందులో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు మంచినీటి అవసరాలతో పాటు సాగునీటికి కొంత వినియోగించారు. ఖరీఫ్‌తో పాటు రబీకి గత ఏడాది 22వేల 5 ఎకరాల్లో వరి, లక్షా 33వేల 155 ఎకరాల ఆరుతడి పంటలకు మాత్రమే నీరందించారు. గత ఏడాది జిల్లా మొత్తంగా 29శాతం వర్షపాతం తక్కువ నమోదయింది. పులిచింతల నుంచి నీరందుతుందని భావించిన రైతాంగానికి కన్నీళ్లే మిగులుతున్నాయి.. సాగర్‌లో హైడల్ జనరేషన్‌కు పోగా మిగిలిన నీటిని దిగువకు వదలుతున్నారు. కృష్ణావాటర్ ట్రిబ్యునల్ సైతం సాగర్ కుడికాల్వ పరిధిలోని ఆయకట్టు ప్రయోజనాలను విస్మరిస్తోందనే విమర్శలు తలెత్తుతున్నాయి. గుంటూరులోని 36 మండలాలు సాగర్ కుడికాల్వ నీటిపై ఆధారపడి ఉన్నాయి. 82,248 హెక్టార్ల సాగు భూమికి గాను నిరుడు కేవలం 24, 768 హెక్టార్లలో మాత్రమే అదీ బోర్ల కింద సాగు చేశారు. ఖరీఫ్‌కు నీరందించలేమని గతంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో రబీ సాగుకు సమాయత్తమైన రైతాంగానికి నిరాశే మిగిలింది. తెలంగాణతో పేచీ కారణంగా 9టిఎంసిల నీటిని తాగునీటి అవసరాలకే అరకొరగా వదిలారు. రాష్ట్ర సరిహద్దుల్లో రైతుల మధ్య జలవివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా ఖరీఫ్‌కు నీరందుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులిచింతల, సాగర్ జలాశయాలు చెంతనే ఉన్నప్పటికీ పల్నాడు ప్రాంతం బీడుగా మారుతోంది. పులిచింతల నిర్వాసిత తెలంగాణ గ్రామాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించక పోవటంతో సామర్థ్యానికి తగిన నీరు నిల్వ చేయలేకపోతున్నారు. ఇక సాగర్‌పై సింహభాగం తెలంగాణ పెత్తనం కావటంతో టిఎస్ సర్కార్ దయాదాక్షిణ్యాలపై రైతులు సేద్యం చేయాల్సిన అగత్యం ఏర్పడింది. ఆరుతడి పంటలకు సంబంధించి 50 శాతం సబ్సిడీపై విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేయటంతో గత ఏడాది ఖరీఫ్‌లో 7691 హెక్టార్లలో పెసర, 10,017 హెక్టార్లలో మినుము, 30,552 హెక్టార్లలో కందులు సాగు చేశారు. మిర్చికి 2015లో క్వింటాల్ ధర 15 వేలకు చేరటంతో పెద్దఎత్తున 74,739 హెక్టార్లలో, ప్రత్తి లక్షా 30,160 ఎకరాల్లో సాగు చేశారు. అయితే రెండు పంటలకు గిట్టుబాటుధర రాక, వరిసాగుకు నీరందక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సాగర్ ప్రధాన జలాశయం సామర్థ్యం 584 అడుగులు కాగా ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి మూడు అడుగుల తక్కువ పరిమాణంలో నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌కు కూడా నీరందే పరిస్థితులులేవు. క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. కృష్ణా రివర్‌బోర్డులో సాగర్ ఆయకట్టు రైతుల కడగండ్లపై చర్చించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

చిత్రం.. డెడ్ స్టోరేజీకి మూడడుగుల మేర తగ్గిన సాగర్ జలాశయం