రాష్ట్రీయం

అర్చకులకు పదవీ విరమణ తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, జూన్ 24: ఆలయాలకు అర్చకులు ఆత్మలాంటి వారని, అటువంటి వారిని ప్రభుత్వం పదవీ విరమణ పేరుతో ఇంటికి సాగనంపడం తగదని, ఇది హిందూ వ్యవస్థకే దౌర్భాగ్యమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీవారి శేషాచల కొండపై మాధవ కల్యాణ మండపంలో శనివారం జరిగిన అంతర్జాతీయ హిందూ ధార్మిక సమ్మేళన సదస్సుకు ఆయన హాజరయ్యారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభ సభలో ముందుగా ఆయన శ్రీ వాసవీ శాంతిధామ్ పీఠాధిపతి స్వామి కృష్ణానందపురీ, మాతా శివచైతన్యానందమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. అర్చకుడు లేని దేవాదాయ వ్యవస్థను ఊహించలేమని, వారి పూజ లేకుంటే దేవునికి సైతం శక్తి ఉండదన్నారు. అర్చకుని పూజా శక్తి వల్లే ఇంకా ఆలయాలు రక్షింపబడుతున్నాయన్నారు. అటువంటి అర్చకులకు పదవీ విరమణలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. సమాజంలో అర్చకుల శాతం చాలా తక్కువగా ఉందని, ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో అర్చకుల పిల్లలు ఈ వృత్తిలోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. గబ్బిలాలు తిరిగే ఎన్నో దేవాలయాల్లో చాలీచాలని జీతాలతో అర్చకులు బతుకు ఈడుస్తున్నారన్నారు. అర్చకులకు పదవీ విరమణ లేకుండా చేయాలని ఈ సందర్భంగా స్వామీజీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధను కోరారు. ఒక అర్చకుడు పదవీ విరమణ చేస్తే కొత్త అర్చకుడు ఎలా పుడతాడని ఆయన ప్రశ్నించారు. అర్చకులు లేకుంటే ఆలయ వ్యవస్థే లేదని, అర్చకుల పూజ లేకపోతే దేవునికి సైతం శక్తి ఉండదని ఆయన పేర్కొన్నారు. అర్చకులు రక్షింపబడితేనే దేవాలయాల రక్షణ సాధ్యమవుతుందని స్వామీజీ స్పష్టం చేశారు. కాగా అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డులో ఇటీవల దాదాపు 20 దేవాలయాలను ధ్వంసం చేయడం దారుణమని స్వామీజీ పేర్కొన్నారు. ఆలయాలను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ఏవో కొన్ని కులసంఘాలు ముందుకు వచ్చాయే తప్ప యావత్ జాతి ఏం చేసిందని ఆయన ఆవేదన చెందారు. ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాల కారణంగా హిందూ సమాజం దెబ్బ తింటోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తుత తరుణంలో దేవాలయాలను కాపాడుకునేందుకు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తనది విలక్షణమైన మనస్తత్వమని, తనను నమ్మిన వారిని వదలనని చెప్పారు. తన మెడలో తన మాల, తన కండువాయే ఉంటాయి మినహా ఇంకొకరితో ఎప్పుడూ వేయించుకోలేదని, ప్రస్తుతం ఈ ఆర్గనైజేషన్ వేసిన ఉత్తరీయాన్ని ధరించానంటే ఈ సంస్థను నాదిగా భావిస్తున్నానని స్వామీజీ పేర్కొన్నారు. కొత్త దేవాలయాల నిర్మాణం కంటే పాత ఆలయాల జీర్ణోద్ధరణ ఎంతో గొప్పదన్నారు. అనంతరం సాంస్కృతిక రాయబారి గజల్స్ శ్రీనివాస్ మాట్లాడుతూ గుండె బాగుంటే దేహం బాగుంటుందని, అలాగే గుడి బాగుంటే ఆ దేశం బాగుంటుందన్నారు. పురాతన శాసనాలను స్కాన్ చేసి త్రిడి చరిత్రను అందించే టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. దేవాలయాల పరిరక్షణే తక్షణ కర్తవ్యంగా చేస్తున్న తమ ఉద్యమానికి చేయూతనివ్వాలని ఆయన కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ మాట్లాడుతూ ఆలయాల్లో పచ్చదనానికి, సౌరవిద్యుత్ వినియోగానికి, ఆస్తుల పరిరక్షణకు, ఆలయాల సహజ సంపదను కాపాడుకునేలా ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.

చిత్రం.. సదస్సులో మాట్లాడుతున్న స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి