రాష్ట్రీయం

నేనెక్కడికీ పోలేదు..! ఎప్పటికీ.. మీవెంటే నేనుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: ‘నేను ఎక్కడికీ పోలేదు.. మీ వెంటే ఉన్నాను.. మీ తోనే ఉంటాను..’ అని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలనుద్దేశించి అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో మంగళవారం టిడిపి- బిజెపి సంయుక్తంగా నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో చంద్రబాబు ఆవేశంగా ప్రసంగించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒక్కో కార్యకర్త ఒక్కో సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ తమకు కంచుకోట వంటిదని, 2019 ఎన్నికలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు నాంది కావాలని అన్నారు. తాను ఎక్కడికో వెళ్ళిపోయానని, తెలంగాణలో టిడిపిని పట్టించుకోరని కొంతమంది అంటున్నారని చెబుతూ తాను ఎక్కడికీ పోలేదని, కార్యకర్తల వెంటే ఉంటానని, మళ్ళీ, మళ్ళీ వస్తానని చంద్రబాబు ఉద్ఘాటించారు. కొంత మంది నాయకులు పార్టీ వీడినా, తన ప్రాణ సమానమైన కార్యకర్తలు పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారని తెలిపారు. తీవ్రవాదులతో సమస్య వచ్చినా, మరో సమస్య వచ్చినా, ఎవరైనా మరణించినా వారి కుటుంబ సభ్యులూ టిడిపితోనే ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఎవరూ పార్టీని వీడలేదని ఆయన చెప్పారు. దివంగత ఎన్టీఆర్ పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టారని, ప్రముఖల విగ్రహాలను, తెలుగు పెద్దల విగ్రహాలను ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించారని చంద్రబాబు తెలిపారు. అధికారంలోకి రాగానే పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని,ఉమ్మడి రాష్ట్రంలో తాను అధికారం చేపట్టిన తర్వాతే ప్రపంచ పటంలో హైదరాబాద్‌కు ఒక గుర్తింపు తెచ్చానని అన్నారు. హైదరాబాద్‌లో వంద పర్యాయాలు ఆకస్మిక తనిఖీలు చేశానని, సైబరాబాద్‌ను తొమ్మిదేళ్ళలో పూర్తి చేశానని, ఐటి కంపెనీల కోసం బిల్ గేట్స్‌ను తీసుకుని వచ్చానని ఆయన వివరించారు. రోడ్ల వెడల్పు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, జంట నగరాలకు కృష్ణా నదీ జలాలను తెచ్చానని, ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేయించానని, ఎంఎంటిసి ఇలా ఎనె్నన్నో పథకాలను అప్పటి ప్రధాని ఎబి వాజ్‌పేయ్ సహకారంతో చేపట్టానని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను మళ్లీ బ్రహ్మండంగా అభివృద్ధి చేసుకోవాలంటే టిడిపి-బిజెపి ఈ ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉందని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు బాగా లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రాలు విడిపోయినా తెలుగు వారంతా ఒక్కటేనని, తెలుగు జాతి కలిసి ఉండాలని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళ వంటివని పునరుద్ఘాటించారు. తాను ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా, కేంద్ర మంత్రులను కలిసినా ఆంధ్ర ప్రదేశ్‌తో సమానంగా తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందేందుకు సహకరించాలని కోరుతూనే ఉన్నానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని,తమకు పూర్తి సహకారం అందిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రభుత్వానికి భారీగానే ఆదాయం లభిస్తోందని, డబ్బుల సమస్యే లేదని, కాబట్టి అభివృద్ధికి ఆకాశమే హద్దు అని అన్నారు. ఇంకా అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. టిడిపి-బిజెపి కలిసి పోటీ చేస్తున్నందున సీట్ల సర్దుబాటు విషయంలో ఏవైనా చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
లక్ష్యం సాధించే వరకూ..
కేంద్ర మంత్రి నడ్డా
బిజెపి నాయకుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా ప్రసంగిస్తూ ఈ రోజు స్వామి వివేకానంద జయంతి అని చెబుతూ లక్ష్యం సాధించే వరకూ విశ్రమించరాదన్న ఆయన సూక్తిని స్పూర్తిగా తీసుకుని గ్రేటర్ ఎన్నికల్లో పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న రోజుల్లోనే, ప్రధానిగా ఉన్న వాజపేయి రాష్ట్భ్రావృద్ధికి ఎంతో సహకరించారని ఆయన తెలిపారు. ఎంఎంటిఎస్, ఐఎస్‌బి, గచ్చిబౌలి స్టేడియం, అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా ఎనె్నన్నో అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు చేపట్టారని ఆయన చెప్పారు. స్మార్ట్ సిటీల గురించి చంద్రబాబు 15 ఏళ్ళ క్రితమే ఆలోచన చేశారని అన్నారు. దేశ చిత్ర పటంలో హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని ఆయన ప్రశంసించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా తమతో పాటే అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కలిసి రావాలని ఆయన కోరారు.
కారు స్పీడుకు బ్రేకు: దత్తాత్రేయ
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తూ టిఆర్‌ఎస్ కారుకు బ్రేకు వేయాలని టిడిపి-బిజెపి కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. కేంద్రం ఎంతో సహకరిస్తున్నదని, ఇంకా సహకరిస్తుందని ఆయన తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని తీసుకుని వస్తామని చెప్పారు.

చిత్రం... నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన ‘శంఖారావం’లో చంద్రబాబుతో బిజెపి మంత్రులు