రాష్ట్రీయం

విజయదశమి ముహూర్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 14: విజయదశమికి ప్రజా రాజధాని అమరావతి పాలన నగర నిర్మాణ పనులు ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు, నార్మన్ ఫోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్, చంద్రశేఖర్ అండ్ కన్సల్టెంట్ ప్రతినిధులతో సమావేశమై అమరావతి మాస్టర్ ప్లాన్‌పై చర్చించారు. అనంతరం మంత్రి నారాయణ సమావేశం వివరాలు మీడియాకు వివరించారు. అమరావతి నిర్మాణం ‘సింబల్ ఆఫ్ ప్రైడ్’గా, పోలవరం నిర్మాణం ‘సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్’గా సిఎం అభివర్ణించారన్నారు. 900 ఎకరాల్లో శాసనసభ, సచివాలయం, మంత్రు లు, ఐఎఎస్ అధికారులు, ఇతర సిబ్బంది నివాస భవనాలు, 450 ఎకరాల్లో హైకోర్టు జడ్జిలు, అధికారుల నివాస భవనాలు నిర్మిస్తారని వివరించారు. మొత్తం 1350 ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతాయన్నారు. శాసనసభ కోహినూర్ డైమండ్ నమూనాలో, హైకోర్టు గోపురం నమూనాలో ఉంటాయన్నారు. సచివాలయ భవనాలు 10 అంతస్తులుగా నిర్మిస్తారన్నారు. మంత్రులు, సచివాలయం, హెచ్‌ఓడిలు ఒకే ఫ్లోర్‌లో ఉంటారని, మొత్తం భూమిలో 50 శాతం పచ్చదనం- జలం (బ్లూ-గ్రీన్)తో నిండి ఉంటుందన్నారు. వీటి మధ్యలో 500 అడుగుల ఎత్తులో ఐకానిక్ టవర్ నిర్మిస్తారని, దీనిపై నుంచి చూస్తే 217 చదరపు కిలోమీటర్ల రాజధాని ప్రాంతం మొత్తం కనిపిస్తుందన్నారు. పరిపాలన నగరానికి ఒకవైపు ఎన్టీఆర్, మరోవైపు అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తారన్నారు. నది నుంచి వరుసగా శాసనసభ, సచివాలయం, హైకోర్టు తరువాత శాఖమూరి పార్కు వస్తుందని చెప్పారు. కృష్ణానది పక్కన బహుళ ప్రయోజనాలకు కొంత స్థలం వదిలినట్లు తెలిపారు.
ఫోస్టర్స్ సంస్థ ఆగస్టు 15కల్లా శాసనసభ సవివర ఆకృతులు అందచేస్తుందని, హఫీజ్ కాంట్రాక్టర్స్ స్ట్రక్చరల్ డిజైన్ అందచేస్తుందని, సెప్టెంబర్‌లో టెండర్లు పిలిచి విజయదశమికి పనులు ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే హైకోర్టు ఆకృతులు ఆగస్ట్ 30 నాటికి అందజేస్తారని, సెప్టెంబర్ 15 నాటికి స్ట్రక్చరల్ డిజైన్స్ అందచేస్తారని చెప్పారు. డిజైన్లు అందిన నెల రోజుల లోపల సీఆర్డీఎ టెండర్లు పిలవడం పూర్తి చేస్తుందని చెప్పారు. ఏడాదిన్నరలో సీఆర్డీఏ మంచి రాజధాని నిర్మిస్తుందన్నారు. హైకోర్టు ఆకృతులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మరో ఏడుగురు సభ్యుల బృందానికి చూపించారని, వారి సూచనల మేరకు ఆకృతుల్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు. ఫోస్టర్స్ అందించే తుది ఆకృతులపై కొత్తగా ఎన్నికయ్యే రాష్టప్రతికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు.

చిత్రం.. రాజధాని డిజైన్లను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు