రాష్ట్రీయం

నాగావళి పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 16: ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశాలో కురిసిన భారీ వర్షాలకు విజయనగరం జిల్లాలోని నాగావళి పరీవాహక ప్రాంతమైన కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో వరద నీరు గ్రామాల్లోకి చొచ్చుకురావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కూనేరు జాతీయ రహదారిపైకి నాగావళి వరద నీరు చేరడంతో ఆంధ్రా-ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశాలోని రాయగఢ జిల్లాలోని సింగుపూర్-తెరువాలి వద్ద పాత రైల్వే బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ సహాయం అందజేసేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను తరలించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి వరద నీరు ఉద్ధృతం కావడంతో తోటపల్లి రిజర్వాయర్ ఎనిమిది గేట్లను ఎత్తివేశారు. నాగావళి నదిలోకి సాయంత్రం 4 గంటలకు 22,500 క్యూసెక్కుల నీరు, 5 గంటలకు 48,500, 7 గంటలకు 75వేల క్యూసెక్కుల నీరు చేరింది. సాయంత్రం 4 గంటలకు 29,825 క్యూసెక్కుల నీటిని, 5 గంటలకు 49,685 క్యూసెక్కులు, 7 గంటలకు 70వేల క్యూసెక్కుల నీటిని బయటకు విడిచిపెట్టారు. వరద ఉద్ధృతికి కొమరాడ మండలం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలపై ప్రభావం చూపింది. కొమరాడ మండలం కూనేరు, కొట్టు, తొడుమ, కళ్లికోట, దళాయిపేట, నిమ్మలపాడు, బిత్తరపాడు, గుంప పంచాయతీలలోకి వరద నీరు చేరింది. జిల్లాలో వరదనీటి పరిస్థితిపై ఎప్పటికపుడు కలెక్టర్ వివేక్‌యాదవ్ సమీక్షిస్తున్నారు. పూర్ణపాడు,
లాబేసు, కట్టు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. కొమరాడ, జియ్యమ్మవలస, జిఎల్ పురం, గరుగుబిల్లి, పార్వతీపురం మండలాల తహసీల్దార్లను సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు వరద పరిస్థితిని ఎప్పటికపుడు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, కొమరాడలోని ఇందిరానగర్‌కు చెందిన ఎ.సీతారాయుడు నాగావళి నదిలో చిక్కుకున్నట్టు సమాచారం.
కొట్టుకుపోయిన రైల్వే బ్రిడ్జి
ఒడిశా రాష్ట్రంలో పడిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు రాయగడ-టిట్లాఘర్ సెక్షన్ల మధ్య ఉన్న ప్రధాన రైల్వేబ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో నడిచే కొన్ని రైళ్ళను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్ళించారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోకి వచ్చే రాయగడ జిల్లా టిట్లాఘర్-రాయగడ రైల్వేసెక్షన్ల మధ్య ఉన్న సింగుపురం రోడ్డు-తెరుబల్లి రైల్వే స్టేషన్లకు సంబంధించిన 588 నెంబర్ బ్రిడ్జి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన గ్యాంగ్‌మెన్ రైల్వే అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ మార్గంలో నడుస్తున్న గూడ్స్‌ను నిలిపివేశారు. దీని తరువాత నడిచే రైళ్ళన్నంటినీ నిలిపివేయగలిగారు. జగదల్‌పూర్-హౌరా సమళేశ్వరి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్, నాందేడ్-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ-రాయగడ పాసింజర్, నిజాముద్దీన్-విశాఖపట్నం, సంబల్‌పూర్-రాయగడ, సంబల్‌పూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, రాయ్‌పూర్-విశాఖపట్నం పాసింజర్ రైళ్ళను ముందుగానే దారి మళ్ళించారు.