రాష్ట్రీయం

వాయుగండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 18: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర, దక్షిణ కోస్తాల్లో తీవ్ర ప్రభావం చూపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో గడచిన 24 గంటలుగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదైనాయి. ఈ కారణంగా అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు పట్టణాల్లో వరద నీరు రోడ్ల మీదకు రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఒడిశాలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో వరదనీరు దిగువ ప్రాంతాలకు రావడంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వంశధార, నాగావళి నదుల్లో వరద ఉద్ధృతి పెరిగినప్పటికీ, మంగళవారం మధ్యాహ్నానికి ప్రవాహం నిలకడగా మారింది. ఈ రెండు నదుల పరీవాహక ప్రాంతాల్లో తీరం వెంబడి ఉన్న గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ఒడిశాలోని రాయగడ సమీపంలోని తెరుబలి వద్ద రైల్వే బ్రిడ్జి కూలిపోవటంతో విశాఖ-టిట్లాగర్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 20ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, 40కిపైగా గూడ్స్ రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. కొత్తవలస-కిరండల్ రైల్వే లైన్ వరద ముంపునకు గురైంది. పలుచోట్ల రైలు పట్టాల కింద ఉన్న రాళ్లు కొట్టుకుపోయాయి.
వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 50నుంచి 55కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కు రప్పించడంతో బోట్లన్నీ విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నాయి. విజయనగరం జిల్లాలోని నాగావళి నదీ పరివాహక ప్రాంతాలైన కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో 500హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
తూర్పు కనుమల్లో భారీ వర్షాలు
-కాటన్ బ్యారేజీ నుండి 1.68లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి
రాజమహేంద్రవరం: అఖండ గోదావరి నదికి స్థానికంగా కురిసిన భారీ వర్షాల పోటుతో మంగళవారం సాయంత్రానికి ధవళేశ్వరం సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి నుంచి లక్షన్నర క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తూర్పు కనుమల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సీలేరులో నీటి ప్రవాహం పెరుగుతోంది. తూర్పు కనుమల్లోని సోకులేరు, చీకటివాగు, చంద్రవంక వాగులు పొంగుతున్నాయి. గోదావరి నది వాస్తవ పరీవాహక ప్రాంతంలో పెద్దగా వర్షాలు లేకపోవడం వల్ల ఉద్ధృతి అంతగా కన్పించడంలేదు. స్థానికంగా కురిసిన భారీ వర్షాల వల్లే గోదావరి నదిలో వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది. కొయిదా వద్ద నీటి ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. సోకులేరు మరింతగా పొంగితే చింతూరు మండలంలో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. మారేడుమిల్లికి సమీపంలో ఘాట్ రోడ్డులో రెండు భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డుగా కూలిపోవటంతో పాటు కొండచరియలు కూడా విరిగిపడటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
కాటన్ బ్యారేజి వద్ద మంగళవారం ఉదయం 10.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. 10.96మీటర్ల పాండ్ లెవెల్‌ను నిర్వహిస్తున్నారు. సాయంత్రానికి 1.68లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజికి వున్న 175 గేట్లను 0.4మీటర్ల మేర తెరిచి వరద జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ రైల్వే వంతెన వద్ద 13.89అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలోని కాళేశ్వరం వద్ద 2.65మీటర్లు, పేరూరు వద్ద 4.07, దుమ్ముగూడెం వద్ద 6.15, కూనవరం వద్ద 6.68, కుంట వద్ద 6.67, కొయిదా వద్ద 7.96, పోలవరం వద్ద 6.15 మీటర్ల మట్టంలో గోదావరి ప్రవహిస్తున్నది.
ప్రకాశంలో ఓ మోస్తరు వర్షం
ఒంగోలు/నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం, నెల్లూరుల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో సరాసరిన 7.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా బేస్తవారిపేట మండలంలో సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు 19.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పరవళ్లు తొక్కుతున్న గోదావరి
ఖమ్మం: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ భాగాన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం 20 అడుగులకు చేరింది. ఉప నదులైన తాలిపేరు, పెన్‌గంగ, ఇంద్రావతి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గోదావరిలో నీరు క్రమేణా పెరుగుతోంది. తాలిపేరు ప్రాజెక్టు నిండటంతో 15గేట్లు ఎత్తి 75వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటకులను అనుమతించడం లేదు. వైరా రిజర్వాయర్‌లో నీరు 13అడుగులకు చేరుకోగా పాలేరులో 18.7అడుగులకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో రెండుగేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. కినె్నరసాని జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని బయ్యారం పెద్ద చెరువు పూర్తిగా నిండింది. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని పాకాల రిజర్వాయర్ పూర్తిగా నిండి అలుగు పడటంతో మునే్నరులోకి నీరు ప్రవహిస్తోంది. చలివాగు, మసివాగు, రాళ్ళవాగు, ముర్రేడు, ఆకేరులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

చిత్రాలు.. విశాఖ తీరంలో ఎగసిపడుతున్న అలలు
*ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుండి సముద్రంలోకి వదిలేస్తున్న వరద జలాలు