రాష్ట్రీయం

ఎన్టీఆర్ ఇళ్లకు 500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్న ప్రీ ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం (గతంలో మంజూరైన అసంపూర్తి ఇళ్లు) కింద అదనంగా 25వేల రూపాయలు లబ్ధిదారులకు చెల్లించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు రూ.500 కోట్లను కేటాయించారు. వెలగపూడి సచివాలయంలో సిఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశమైంది. మంత్రిమండలి నిర్ణయాలను సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. లింటెల్ లెవల్, రూఫ్ లెవెల్ (ఆర్‌ఎల్) కింద 1,15,801 మంది, బిలో బేస్‌మెంట్ లెవల్ (బిబిఎల్), బేస్‌మెంట్ లెవల్ కింద 1,78,108 మంది లబ్ధి పొందుతారు. బిబిఎల్ కింద మధ్యలో నిలిచిపోయిన 1,77,514 గృహాల నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. ఆర్‌ఎల్ కింద 85,222 ఇళ్లను పూర్తిచేస్తారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని కూడా మంత్రిమండలి చర్చించింది. కమిషన్‌కు అవసరమైన డేటాను ఇప్పటికే పూర్తిస్థాయిలో అందించిన కారణంగా నివేదిక త్వరగా ఇవ్వాలని కోరింది. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారంలో భాగంగా శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధుల పరిశోధనా సంస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ వైద్య పరిశోధనా మండలి సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తుంది. ఏడాదికి 5కోట్ల రూపాయల చొప్పున మూడేళ్లలో 15 కోట్లు ఖర్చుచేయనున్నారు. మూడేళ్లకు ఒకేసారి నిధులు మంజూరు చేసేందుకు కూడా నిర్ణయించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులకు నెలకు రూ.2,500లు చొప్పున పింఛన్ చెల్లించేందుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు, నాలుగు, ఐదు దశల్లో ఉండి ప్రభుత్వ వైద్యశాలల్లో డయాలసిస్ పొందుతున్నవారు అర్హులు. ఈ పింఛన్ చెల్లింపులకు ఏటా రూ.12 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.
బెల్ట్‌షాపులపై కొరడా
రాష్ట్రంలో మంగళవారం నుంచి బెల్టుషాపు లేకుండా చూడాలని కమిషనర్‌ను, కార్యదర్శిని మంత్రిమండలి ఆదేశించింది. వైన్‌షాపులకు దేవుళ్ల పేర్లు ఉండకూడదని, షాపుల బయట కూర్చుని తాగటానికి వీల్లేదని స్పష్టం చేసింది. బెల్టు షాపులకు మద్యం సప్లయ్ చేసే మెయిన్ షాపుల లైసెన్సులు రద్దుచేయాలని, బెల్టుషాపులు నిర్వహించేవారికి ఆరు నెలల జైలుశిక్ష విధించేందుకు నిర్ణయించింది.
* ఇసుక మాఫియా నిర్మూలన, ప్రజలకు ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాల్లో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు.
* రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న తాగునీటిని 40 నుంచి 100 లీటర్లకు పెంచాలన్న లక్ష్యంతో ఏపి తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటు.
* రాష్ట్రంలో అన్ని జలరాశులు, ప్రాజెక్టుల దగ్గర జలహారతి కార్యక్రమం ఆగస్టులో చేపట్టేందుకు నిర్ణయం.
* విశాఖ ఆర్‌కె బీచ్ రోడ్డులో ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్‌ను పిపిపి విధానంలో ఏర్పాటు చేసేందుకు 9.12 ఎకరాల స్థలం కేటాయింపు.
* సోషల్ వెల్ఫేర్, బిసి వెల్ఫేర్, ఇండస్ట్రీస్ తదితర శాఖల్లో 230 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.
* ఏపిసిఆర్‌డిఏ చట్టానికి సవరణ ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో పెట్టబోయే ముసాయిదా బిల్లుకు ఆమోదం. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, ప్రత్యేక క్యాపిటల్ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం.
* రాష్ట్రంలోని 17 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అమరావతిలో 28 ఎకరాల స్థలం కేటాయింపు.
* ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు వెయ్యి చ.గజాల నివాసిత స్థలం కేటాయింపు.
* ఏపి సిఆర్‌డిఏ పరిధిలోని పాత లేఅవుట్లకు అనుమతి మంజూరుకు నిర్ణయం.
* విజయనగరం జిల్లా గాజులరేగలో వంద పడకల ఇఎస్‌ఐ ఆస్పత్రికి 5 ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లా చొల్లంగిలో కోస్ట్‌గార్డ్ స్టేషన్ ఏర్పాటుకు 11 ఎకరాలు, విశాఖ జిల్లా దిబ్బపాలెంలో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫేస్-2కు 21.6 ఎకరాలు, రాజమహేంద్రవరంలో బాలుర అబ్జర్వేషన్ హోం కోసం 2029 చ.గజాలు మంజూరు.
* గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులో ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ధి ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు 50 సెంట్ల భూమి, చిత్తూరు జిల్లా అమ్మవారిపేటలో ఫ్రూట్, వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు 21 ఎకరాలు కేటాయింపు.
* చిత్తూరు జిల్లా తుకివరంలో రామకృష్ణా మఠం అభివృద్ధి 7.16 ఎకరాలు, కర్నూలు జిల్లా లోయర్ అహోబిలంలో సత్రం నిర్మాణం కోసం 1.75 ఎకరాల భూమి కేటాయింపు.
* పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బొడ్డువారిపాలెంలో యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా 110 ఎకరాల్లో అల్యూమినియం ఎల్లాయ్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలం కేటాయింపు, మొదటి దశలో రూ. 11,400 కోట్లు పెట్టుబడి పెడతారు.

చిత్రం.. మంత్రిమండలి సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు