రాష్ట్రీయం

ప్రాజెక్టులపై పేచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న పేచీకి ఇప్పుడు గోదావరి తోడైంది. గోదావరి జలాలపైనా రెండు రాష్ట్రాలు పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. జల సౌధలో శుక్రవారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్‌కె సాహు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పరం వాదనలకు దిగాయి. అటు పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆంధ్ర.. వాదనలకు దిగాయి. ప్రాజెక్టుకు అనుమతులే కాదు, కనీసం బోర్డునుంచి అనుమతి తీసుకోకుండా పట్టిసీమ ప్రాజెక్టును ఆంధ్ర ఎలా నిర్మించిందని తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తింది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఎక్కడుందంటూ ఆంధ్ర ప్రభుత్వం గట్టిగా ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తదికాదని, ఉమ్మడి రాష్ట్రంలోనే దీనికి అనుమతులు ఉన్నాయన్న వాదనను తెలంగాణ ప్రభుత్వం వినిపించింది. పట్టిసీమ ప్రాజెక్టు కూడా కొత్తదికాదని, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గోదావరి బోర్డు జోక్యం చేసుకుంటూ, ఒక రాష్ట్రం నిర్మించే ప్రాజెక్టులను మరో రాష్ట్రం వ్యతిరేకించడం, పరస్పరం వాదించుకోవడం వల్ల ప్రయోజనం లేదని అభిప్రాయపడింది. ఇరు రాష్ట్రాలు గోదావరి పరీవాహకంలో పూర్తిచేసిన ప్రాజెక్టులు, పురోగతిలోవున్న ప్రాజెక్టుల వివరాలతోపాటు వాటికి లభించిన అనుమతి పత్రాలను బోర్డు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని చైర్మన్ సాహు ఆదేశించారు. దీనివల్ల ఇరు రాష్ట్రాలు చేస్తున్న వాదనలో వాస్తవం ఎంతవరకు ఉందనేది తేలుతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక (డిపిఆర్) పూర్తిగా బోర్డుకు అందలేదని చైర్మన్ సాహు గుర్తు చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు రీ-డిజైనింగ్‌పైనా తమకు సమగ్ర నివేదిక సమర్పించాలని కోరారు. ఇరు రాష్ట్రాలు ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికలు బోర్డుకు సమర్పించలేదని బోర్టు చైర్మన్ సాహు గుర్తు చేశారు. వెబ్‌సైట్‌లో తమ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వివరాలు ఆప్‌లోడ్ చేయడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. అలాగే బోర్డు విధివిధానాల రూపకల్పనపై ఇరు రాష్ట్రాలు తమ సూచనలు సలహాలు పది రోజుల్లో బోర్డుకు సమర్పించాలని, అవి తమకు అందాక ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన మాన్యువల్ ఖరారు చేస్తామని చైర్మన్ సాహు స్పష్టం చేశారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు ‘లోగో’లో కొన్ని చేర్పులు, మార్పులను సూచించాయి. బోర్డు కూడా అందుకు అంగీకరించటంతో లోగో ఆమోదంపొందింది. బోర్డు మరో 25 పోస్టుల భర్తీ చేసుకోవడానికి ఇరు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. బోర్డు కార్యాలయానికి జలసౌధలో వసతి కల్పించడం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చైర్మన్ సాహు కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు పరిపాలన కోసం ఇరు రాష్ట్రాలు తమ సిబ్బందిని కేటాయించడం పట్ల కూడా చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఈఎన్‌సి మురళీధర్, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్, ఈఎన్‌సి వెంకటేశ్వర్‌రావు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.