రాష్ట్రీయం

సిట్‌పై ముప్పేట దాడి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: డ్రగ్స్ దందా డొంక కదిలించిన సిట్ ఆఫీసర్ అకున్ సబర్వాల్‌కు బెదిరింపులు రావడం, కేసు మరింత తీవ్రం కానుందన్న సంకేతానికి తావిస్తోంది. మత్తు అభియోగాలతో సిట్ విచారణ ఎదుర్కొంటున్న చిన్న చేపలిచ్చే సమాచారంతో, పెద్ద చేపల గుట్టు రట్టయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ముప్పేట దాడి మొదలైంది. సినీవర్గాన్ని మాత్రమే సిట్ టీం టార్గెట్ చేస్తోందన్న కొత్తవాదనను జనంలోకి తీసుకెళ్లి విచారణను దారి మళ్లించే ప్రయత్నం ఒకవైపు జరుగుతుంటే, బెదిరింపులతో అధికారుల మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం మరోవైపు మొదలైంది. మరోవైపు రాజకీయంగానూ ‘సిట్ విచారణ తీరు’పై ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పరిణామాలకు కారణం, ఏ క్షణంలోనైనా ఇండస్ట్రీ షేకయ్యే మత్తుబాబుల జాబితాను ఎన్స్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టవచ్చన్న భయాలు ముసురుకోవడమే. డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ దూకుడు పరిణామాలను నిన్నటి వరకూ నిశితంగా గమనిస్తూ వచ్చిన ప్రభుత్వం సైతం, శనివారం నాటి పరిణామాల్లో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించక తప్పలేదు. ‘డగ్స్’తో సంబంధాలు పెట్టుకున్నవాళ్లు ఎంతటి వాళ్లనైనా ఉపేక్షించేది లేదని ఖమ్మం పర్యటనలో ఉన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, హైదరాబాద్‌లో ఎక్సైజ్ మంత్రి పద్మారావు ప్రకటించారు. సిఎం కెసిఆర్ సైతం సిట్ బృందానికి ‘గో అహెడ్’ సంకేతాలిచ్చినట్టు చెబుతున్నారు.
ఇదిలావుంటే, శనివారం నటుడు తరుణ్‌ను సుదీర్ఘంగా విచారించిన సిట్ కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌కు తావిస్తోన్న పబ్‌ల చిట్టా విప్పడంతో, మరిన్ని నోటీసులు జారీ చేసేందుకు సిట్ వర్గం సిద్ధమవుతోంది. ఇదిలావుంటే, తెలుగు సినీవర్గానికి చెమటలు పట్టించే రీతిలో డ్రగ్స్ విచారణ సాగిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న సమాచారం శనివారం కలకలం రేపింది. సిట్ ఆఫీసర్ సబర్వాల్‌కు గత రెండు మూడు రోజులుగా ఆఫ్రికన్ భాషలో విఓఐ-సి కాల్స్ వస్తున్నట్టు తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మకు ఫిర్యాదు అందింది. దీంతో డిజిపి అనురాగ్ శర్మ తక్షణ ఆదేశాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్‌కు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై ఆరా మొదలైంది. బెదిరింపు కాల్స్‌పై పోలీసులు సీరియస్‌గానే దృష్టి పెట్టారని డిజిపి అనురాగ్ ప్రకటించారు. వివోసి-ఇ కాల్స్‌ను గుర్తించడం కష్టం కాబట్టి, సాంకేతిక నిపుణుడిని రంగంలోకి దించామని, ఒకటి రెండు రోజుల్లోనే బెదిరింపు కాల్స్ డొంకను ఇంటెలిజెన్స్ విభాగం బయటకు తీయనుందని డిజిపి చెబుతున్నారు. ఆగంతకుల బెదిరింపుల నేపథ్యంలో సిట్ టీం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు భద్రతను పెంచారు.
బెదిరింపులకు లొంగను: అకున్
డ్రగ్స్ మాఫియా బెదిరింపులకు లొంగేది లేదని అకున్ గట్టిగానే చెబుతున్నారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. సిఎం కేసిఆర్ ఆదేశాలతో కేసును మరింత లోతుగా విచారిస్తున్నాం. దర్యాప్తులో ఏ కోణాన్నీ విడిచిపెట్టడం లేదు. కేసు విచారణ విషయంలో ఆగంతక ఫోన్ కాల్స్‌కు బెదిరిపోయేది లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల కేసు విచారణ కొత్తదేం కాదన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖుల విచారణ ఎక్సైజ్ కార్యాలయంలో కొనసాగుతుందని, కేసు విచారణ పారదర్శకంగా జరుపుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లోని పబ్‌లు, బార్లు డ్రగ్స్ వినియోగానికి అడ్డాలుగా మారాయని ధ్రువీకరించారు. శనివారం పబ్‌లు, బార్లు యజమానులతో సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ విక్రయాలకు ఆస్కారం కల్పిస్తున్న పబ్‌లు, బార్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్‌కు ఆస్కారం కల్పిస్తున్నారన్న ఫిర్యాదులపై 14 పబ్‌లు, బార్లకు నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగానికి పాల్పడుతోన్న ‘ఎఫ్’ క్లబ్ లైసెన్స్ రద్దు చేసినట్టు ప్రకటించారు. ఇక్కడి డ్రగ్స్ దందా మూలాలు అంతర్జాతీయ మాఫియాతో కనెక్టై ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ముఠా నెదర్లాండ్, ఐరోపా, జర్మనీ వంటి దేశాలనుంచి డ్రగ్స్ దిగుమతి చేస్తున్నట్టు సిట్ నిర్ధారించిందని సబర్వాల్ స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, శనివారం కూడా సిట్ టీం యథాతథంగా డ్రగ్స్ కేసులో విచారణలు నిర్వహించింది. తరుణ్‌ను సుదీర్ఘంగా, లోతుగా విచారించిన సిట్ టీం కీలకమైన లోగుట్టే రాబట్టిందని అంటున్నారు. ముందే సేకరించిన కీలక ఆధారాలతో ఒక్కొక్కరినీ ఒక్కో తరహాలో విచారిస్తూ మరింత సమాచారం రాబడుతున్న సిట్ బృందం, ఆదివారం నుంచి మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం కనిపిస్తోంది. వందలాది స్కూలు పిల్లలు డ్రగ్స్ ఉచ్చులో ఇరుక్కున్న పరిస్థితి కళ్లముందు కనిపిస్తుండటంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కేసుపై సీరియస్‌గానే దృష్టిపెట్టారు. నటి చార్మి, హీరో రవితేజను విచారించిన తరువాత కీలకమైన రెండో జాబితాను ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఆ జాబితాలో ప్రకటించేవారి పేర్లతో సినీ పరిశ్రమ షాక్‌కు గురవ్వడం ఖాయమని చెబుతున్నారు. విచారణను ఎదుర్కొంటున్న వారు ఎవరి పేర్లు బయటపెడతారోనని, సిట్ ప్రకటించే జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయోనన్న ఆందోళనతో ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.