రాష్ట్రీయం

కొత్త కాంతులు తెచ్చిన సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 13: రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశ, విదేశాల్లోని తెలుగువారు భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలను ఘనంగా చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని కోటి 80 లక్షల పేద కుటుంబాల వారు పెద్ద పండుగను సంతోషంగా చేసుకోవాలన్నదే తమ అభిమతమని, గత ఏడాది వలనే ఈ ఏడాది కూడా వారికి చంద్రన్న సంక్రాంతి కానుకను అందజేశామన్నారు. సంక్రాంతి వ్యవసాయదారుల పండుగ అని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. పల్లె ప్రాంతాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా మూడో విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. సంక్రాంతి పండుగ సమీపించటానికి ముందే రాష్ట్రానికి పెట్టుబడుల పండుగ వచ్చిందని, విశాఖలో నిర్వహించిన సిఐఐ సదస్సులో రూ. 4.67 లక్షల కోట్ల పెట్టుబడులను ఎంఓయులు కుదిరాయని చంద్రబాబు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు విశాఖ సదస్సు మార్గం చూపిందన్నారు.

నాగార్జున వర్శిటీ విసిగా
రాజేంద్రప్రసాద్ నియామకం

విశాఖపట్నం, జనవరి 13: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి నూతన వైస్ ఛాన్సలర్‌గా ఆంధ్రా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎ.రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాలలో ఫ్యాకల్టీ చైర్మన్‌గా ఉన్నారు. ఈయన నెల్లూరులో ప్రాథమిక విద్యను, తిరుపతిలో డిగ్రీ, నెల్లూరులో బిఎల్ డిగ్రీని పూర్తి చేశారు. నాగపూర్ వర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఎయు నుంచి డాక్టరేట్‌ను పొందారు. 1985లో ఎయులో అధ్యాపకునిగా చేరారు. 1994లో అసోసియేట్ ప్రొఫెసర్‌గాను, 2002లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2013-14లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, స్కూల్ ఆఫ్ కార్పొరేట్ లా విభాగానికి ఆచార్యునిగా, విభాగాధిపతిగా పనిచేశారు. 1983-85 మధ్య కాలంలో విశాఖలోని ఎన్‌విపి న్యాయ కళాశాల అధ్యాపకునిగా, ఎయు న్యాయ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఫ్యాకల్టీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1996లో బెస్ట్ థీసెస్ అవార్డు (ఎయు), 2001లో కామనె్వల్త్ ఫెలోషిప్, బెస్ట్ రిసెర్చ్ అవార్డు, 2008లో బెస్ట్ అకడమిషియన్ అవార్డు, 2001లో బెస్ట్ రిసెర్చర్ అవార్డు అందుకున్నారు.

మార్చి నుంచి మళ్లీ
ప్రత్యేక హోదా ఉద్యమం
మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ

కాకినాడ, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మళ్ళీ వచ్చే మార్చి నుండి ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, ఎపి ప్రత్యేక హోదా సాధన సమితీ కన్వీనర్ కారెం శివాజీ ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో బుధవారం శివాజీ విలేఖరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎపి ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించామని, అయితే విద్యార్థులు పరీక్షల్లో నష్టపోకూడదన్న తల్లిదండ్రుల కోరిక మేరకు ఉద్యమాన్ని ఈ ఏడాది మార్చికి వాయిదా వేశామన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాని కారణంగా దాదాపు ఈ రెండేళ్ల కాలంలో సుమారు 10 లక్షల కోట్ల మేర రాష్ట్రానికి నష్టం జరిగిందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని తాము ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేశామన్నారు. అయితే ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలతో దోబూచులాడుతున్నాయని ఆయన విమర్శించారు. అమరావతి నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటోందన్నారు.

అద్దేపల్లి మృతితో బందరులో విషాదం

మచిలీపట్నం, జనవరి 13: ప్రజాకవి అద్దేపల్లి రామ్మోహనరావు అకాల మరణంతో ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లా మచిలీపట్నం వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మోహనరావు బుధవారం మధ్యాహ్నం కాకినాడలో తుదిశ్వాస విడిచారన్న వార్త పట్టణవాసులను కలచివేసింది. రామ్మోహనరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. 1936 సెప్టెంబర్ 5న మచిలీపట్నంలోని చింతగుంటపాలెంలో జన్మించిన రామ్మోహనరావు వృత్తిరీత్యా అధ్యాపకులు కావటంతో 1970లో కాకినాడకు మకాం మార్చారు. కాకినాడలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నా తరచూ మచిలీపట్నం వస్తూ పలు సాహిత్య సభల్లో ఆయన పాల్గొనేవారు. దీంతో జిల్లాకు చెందిన కవులు, రచయితలతో ఆయనకు ఆత్మీయ సన్నిహిత సంబంధాలున్నాయి.

ఐక్యతకు ఈ అవార్డు నిదర్శనం
హెరిటేజ్ ఎండి నారా భువనేశ్వరి వెల్లడి

చంద్రగరి, జనవరి 13: హెరిటేజ్ గోకుల ప్లాంటులో సిబ్బంది ఐకమత్యంతో ముందుకెళుతూ జాతీయ ఇంధన పొదుపు అవార్డు జాతీయ స్థాయిలో సాధించడం సంతోషకరమని, ఇదేవిధంగా సంస్థ సిబ్బంది మరిన్ని అవార్డులు సాధించాలని ఆ సంస్థ ఎండి, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్లలోని హెరిటేజ్ ఫుడ్స్ ఫ్యాక్టరీకి ఇంధన పొదుపు అవార్డు వచ్చిన సందర్భంగా అభినందన సభను ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎండి నారా భువనేశ్వరి మాట్లాడుతూ హెరిటేజ్ ఫుడ్ ప్లాంట్ జాతీయ స్థాయిలో నాలుగోసారి జాతీయ ఇంధన పొదుపు అవార్డు సాధించడం అభినందనీయం అన్నారు. కార్మికులు క్రమశిక్షణ, అంకితభావం, అకుంఠిత దీక్షలు ఈ అవార్డు రావడానికి దోహదపడినట్లు తెలిపారు. సంస్థ ప్రెసిడెంట్ సాంబశివరావు మాట్లాడుతూ అనంతపురంలో పవన విద్యుత్ టు ఎండబ్ల్యూ ప్లాంట్‌ను స్థాపించి గోకుల ప్లాంట్‌కు అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.