రాష్ట్రీయం

కరుణించని కేంద్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 11: ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ కేంద్ర విద్యా సంస్థలు కేటాయించినప్పటికీ, వాటిని పూర్తి చేసేందుకు నిధుల విడుదలలో కేంద్రం వైఖరి విమర్శలకు తావిస్తోంది. ఆయా విద్యా సంస్థలు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసుకునేందుకు అవసరమైన నిధులు ఏకమొత్తంలో కేటాయించకుండా, దశలవారీగా నిధులు కేటాయించేందుకు నిర్ణయించడం, విభజన హామీల నుంచి కేంద్రం పక్కకు తప్పుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. అవసరమైన నిధులను విడుదల చేయకపోగా, బ్యాంక్‌ల నుంచి రుణం తీసుకునేందుకు కూడా కేంద్రం సహకరించకపోవడం గమనార్హం. ఆ రుణాలకు వడ్డీ ఎవరు చెల్లిస్తారంటూ కేంద్రం మెలికపెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. దీంతో చాలా విద్యా సంస్థల నిర్మాణంలో పురోగతి లేక శంకుస్థాపన దశలోనే ఉండిపోయాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏడు ప్రముఖ విద్యా సంస్థలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చింది. ఎన్‌ఐటి (తాడేపల్లిగూడెం), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం,ట్రావెల్ మేనేజ్‌మెంట్ ( నెల్లూరు), నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కొటిక్స్ (అనంతపురం), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (నెల్లూరు), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ (గన్నవరం) తదితర విద్యా సంస్థలను రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సు, ఎడ్యుకేషన్,రీసెర్చి (ఐఐఎస్‌ఇఆర్), ఐఐఐటి, ఎయిమ్స్ (మంగళగిరి) వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కూడా కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 3408 ఎకరాలను ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు వీలుగా కేటాయించింది. ఈ ప్రాజెక్టులు త్వరగా కార్యరూపం దాల్చేలా రహదారి సౌకర్యాన్ని, ప్రహరీలను 670 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించింది. వీటిల్లో చాలా విద్యా సంస్థలకు సొంత భవనాలు లేని కారణంగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. చాలా విద్యా సంస్థలకు గడిచిన మూడు సంవత్సరాల్లో డిపిఆర్ (సవివర నివేదిక)ని కూడా తయారు చేయలేదు. విశాఖలోని ఐఐఎంను 1030 కోట్ల రూపాయలతో, తాడేపల్లి గూడెంలోని ఎన్‌ఐటిని 500 కోట్లు, చిత్తూరులోని ఐఐఐటిని 300 కోట్లు, తిరుపతిలోని ఐఐఎస్‌ఇఆర్‌ను 450 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నట్లు నివేదిక తయారు చేశారు. గతంలో ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కేంద్ర ప్రకటించింది. కాని ఆ హామీలను పక్కకు పెట్టి, దశల వారీగా నిధుల విడుదల చేసేందుకు తాజాగా నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ ప్రాజెక్టులు పూర్తి అయ్యేందుకు 10 నుంచి 15 సంవత్సరాల సమయం పడుతుంది. ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి కొంతకాలం కిందట శంకుస్థాపన ఆర్భాటంగా చేశారు. కానీ పనుల్లో పురోగతి లేకపోవడంతో ఆ ప్రాంతంలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. దీనికి ప్రహరీని సైతం నిర్మించలేని దుస్థితి నెలకొంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ మంజూరు చేసినప్పటికీ, ఆచార్య నాగార్జున వర్సిటీలో తరగతులు నిర్వహిస్తున్నారు. విశాఖలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ తరగతులు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెంలోని ఎన్‌ఐటి తరగతులు కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. హాస్టళ్లను కూడా ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. తాత్కాలిక వసతి భవనాల్లో నిర్వహిస్తున్న తరగతుల కారణంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో చేరినప్పటికీ, పూర్తిస్థాయి ఫ్యాకల్టీ, సౌకర్యాలు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. నిధుల విడుదల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్‌ల నుంచి రుణం తీసుకునేందుకు ప్రతిపాదించింది. ఇందుకు కేంద్రం గ్యారంటీర్‌గా వ్యవహరించాలని కోరింది. నిధులు విడుదల చేయకపోగా, తీసుకున్న రుణానికి వడ్డీ ఎవరు చెల్లిస్తారంటూ కేంద్రం మెలిక పెట్టినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి అవుతాయో తెలియని స్థితి నెలకొంది. ప్రైవేట్ రంగంలో ఏర్పాటవుతున్న వర్సిటీలు తక్కువ వ్యవధిలో భవనాలను నిర్మించుకుని తరగతులు ప్రారంభిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విద్యా సంస్థలకు సొంత భవనాలు అమరేందుకు ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.