రాష్ట్రీయం

రిజర్వేషన్ల కాపు కాస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 14: బలహీనవర్గాల రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని సిఎం చంద్రబాబు ప్రకటించారు. రాజకీయ రిజర్వేషన్లతో ప్రమేయం లేకుండా కాపులకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక కోటాకింద రిజర్వేషన్లు కల్పిస్తానన్నారు. ఈమేరకు బీసీ వర్గాల్లోని అపోహలు పటాపంచలు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన సోమవారం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన కాపుల ఆత్మీయ రాష్ట్ర సదస్సులో చంద్రబాబు ఉత్సాహంగా మాట్లాడారు. 13 జిల్లాల నుంచి కాపు, బలిజ సంఘ నేతలు, కాపు రిజర్వేషన్ జెఏసి నేతల ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చారు. సిఎంగా, ప్రతిపక్ష నేతగా అన్ని ప్రాంతాలపై తనకు ఎంతో అవగాహన ఉన్నప్పటికీ వివిధ వర్గాలు, కులాల సామాజిక, ఆర్థిక సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు తాను చేపట్టిన పాదయాత్రలో గుంతకల్లులో రైతు రుణమాఫీ, పిఠాపురంలో కాపులకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన హామీనిస్తూ ఆమేర ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చామన్నారు. రైతు రుణమాఫీపై తొలి సంతకం చేసినప్పటికీ, ముందు ప్రకటించినట్టు కాపులకు ఆరు మాసాల్లో బీసీ రిజర్వేషన్ల కల్పనకు కొన్ని అవాంతరాలు వచ్చాయని వివరణ ఇచ్చారు. కంటితుడుపు జీవోల ద్వారా ఒరిగేదేమీ లేదని భావించి శాస్ర్తియ పద్ధతిలో శాశ్వత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతోనే మంజునాథ్ కమిషన్ నియమించామన్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాలంటూ ఇప్పటికి రెండుసార్లు మంత్రివర్గ సమావేశాల్లో కోరామని గుర్తు చేశారు. సాధ్యమైనంత త్వరగానే నివేదిక అందగలదని, ఆపై వెనువెంటనే మంత్రివర్గంలో చర్చించి కేంద్రానికి సిఫార్స్ చేస్తామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. సమాజంలో అన్ని కులాలు, వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తానని ప్రత్యక్ష ఎన్నికల్లో సాధ్యంకాని పక్షంలో నామినేటెడ్ పదవుల్లో ఆ లోటు భర్తీ చేస్తానన్నారు. అధికారంలో తాను ఉన్నంతవరకు కాపులకు ఏమాత్రం అన్యాయం జరుగబోదని, అన్యాయం జరిగితే మీరు ఉపేక్షించరు కదా అంటూ చలోక్తి విసిరారు.
కాంగ్రెస్ మొదటి నుంచి కాపులకు తీరని ద్రోహం చేసిందంటూ, బ్రిటీష్ హయాంనుంచి ఉన్న రిజర్వేషన్లను 1956లో నీలం సంజీవరెడ్డి రద్దు చేశారని గుర్తుచేశారు. 1961లో దళిత వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య సిఎం కావటంతోనే 3250 జీవో ద్వారా మళ్లీ రిజర్వేషన్లు కల్పిస్తే, 1966లో కాసు బ్రహ్మానందరెడ్డి రద్దు చేశారన్నారు. తిరిగి 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానంటూ హామీనిచ్చి 2008లో వీరిని పక్కనబెట్టి మరో 8కులాలను బీసీలుగా గుర్తించారని గుర్తు చేశారు. 2006లో జస్టిస్ దాళ్వ సుబ్రహ్మణ్యం కమిషన్ కాపుల గణాంక వివరాల సేకరణకు అయిన రూ.40 లక్షల వ్యయంతో తొలుత రూ.20 లక్షలు ఇవ్వాలని కోరినప్పటికీ, వైఎస్ నయాపైసా ఇవ్వలేదన్నారు. పైగా 2009 ఎన్నికల్లో తిరిగి హామీనిచ్చారని ఏదేమైనా ఆ పదేళ్ల కాలంలో పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇక గత ఎన్నికల్లోగానీ, ఇటీవల జరిగిన ప్లీనరీలోగాని వైఎస్ జగన్ కాపు రిజర్వేషన్లను ప్రస్తావించిన దాఖలాలు లేవన్నారు.
విద్యార్థి దశలోనే బలిజ వర్గానికి చెందిన మోహన్‌ను తిరుపతి యూనివర్సిటీ విద్యార్థి సంఘ చైర్మన్‌గా ఎన్నిక చేయించానన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి సాలీనా వెయ్యి కోట్లు కేటాయిస్తూ విదేశీ విద్యకు స్వయం ఉపాధి పరిశ్రమల స్థాపనకు ఆర్థికంగా సహకరిస్తున్నామన్నారు. సమావేశంలో పలు జిల్లాల కాపు సంఘాల నేతలు చంద్రబాబును ఘనంగా సత్కరించారు. సభలో మంత్రులు చినరాజప్ప, కిమిడి కళా వెంకట్రావు, పి నారాయణ, ఎంపి తోట నరసింహం, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రసంగించారు.

చిత్రం.. కాపుల ఆత్మీయ సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు