రాష్ట్రీయం

బోరుబావిలో బాలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ (రూరల్), ఆగస్టు 15: ఏడాదిన్నర బాలుడు బోరుబావిలో పడి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న దుర్ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామంలో చోటుచేసుకుంది. బోరుబావి సుమారు 200 అడుగుల లోతు ఉన్నట్టు అంచనా. కాగా, బాలుడ్ని సురక్షితంగా వెలికితీసేందుకు బావికి సమాంతరంగా మూడు జెసిబిలతో రెస్క్యూ బృందాలు తవ్వకాలు సాగిస్తున్నాయి. చంద్రశేఖర్ 15 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఎన్డీఆర్‌ఎఫ్, వైద్య సిబ్బంది బాలుడికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అర్థరాత్రి 12 గంటల వరకూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాలుడిని ఎలాగైనా రక్షించేందుకు ఫ్లడ్ లైట్ల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే మంగళవారం రాత్రి 10.30 సమయం నుంచీ వర్షం మొదలుకావటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. అయినప్పటికీ అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
తమ కుమారుడు చంద్రశేఖర్‌కు ఎలాంటి ప్రాణహాని జరక్కుండా రక్షించాలని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై అధికారులను వేడుకుంటున్నారు. అనుమర్లపూడి మల్లికార్జునరావు, అనూష దంపతుల కుమారుడు చంద్రశేఖర్ మంగళవారం సాయంత్రం తన తల్లి వెంట పొలానికి వెళ్లాడు. తల్లి పొలం పనిలో నిమగ్నమై ఉండగా అదే ప్రాంతంలో ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలోకి జారిపడ్డాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి బయల్దేరిన అనూష కుమారుడి కోసం ఆతృతతో పరుగులు తీసింది. చంద్రశేఖర్ ఆచూకీ కోసం చుట్టుపక్కల పరిశీలించి అనుమానమొచ్చి బోరుబావి వైపు తొంగిచూసింది. అందులో నుంచి భయంతో బాలుడు మూలుగులు వినిపించటంతో నిశే్చష్టురాలై విలపిస్తూ కేకలు వేసింది. పరిసర పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు ఆ ప్రాంతానికి చేరుకుని బాలుడ్ని తాళ్ల సాయంతో బయటకు తీసేందుకు విఫలయత్నం చేశారు. ఈలోగా స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. రెవిన్యూ, పోలీసు యంత్రాంగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు సిఎంకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. దీంతో సీఎం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్, రూరల్ ఎస్పీ అప్పలనాయుడు, ఒఎస్‌డి సుధాకర్‌లు బోరుబావి ప్రాంతాన్ని పరిశీలించి ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బలగాలను రప్పించారు. బాలుడ్ని ప్రాణాలతో సురక్షితంగా వెలికి తీయాలని సీఎం ఆదేశించటంతో అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నరసరావుపేట ఆర్డీవో జి రవీంద్ర, డిఎస్పీ కె నాగేశ్వరరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు. రాత్రి 10.30కు వర్షం మొదలవటంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. బాలుడు సురక్షితంగా బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తూ గ్రామస్తులంతా బోరుబావి వద్ద ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

చిత్రం.. బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల లోతున గొయ్యి తవ్విన దృశ్యం. ఇన్‌సెట్‌లో బాలుడు