రాష్ట్రీయం

ప్రాజెక్టు పంద్రాగస్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 15: ఇకనుంచి ప్రతి పంద్రాగస్టుకు ఒక పథకాన్ని జాతికి అంకితం చేస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. అఖండ గోదావరి నది ఎడమ గట్టుపై తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. జనవరిలో మొదలైన పథకం పనులు ఆగస్టులో పూర్తి చేసి గోదావరి నీటిని అందించడం ఒక చరిత్రగా బాబు అభివర్ణించారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అనంతరం పంపుల స్విచ్ ఆన్ చేశారు. గోదావరి జలాలు పంపుహౌస్‌కు చేరేచోట జల పూజ నిర్వహించారు. అనంతరం పంపుహౌస్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. జలమే జీవనాధారమని, ప్రాజెక్టులు అభివృద్ధికి చిహ్నమని, నీరే ప్రగతికి ప్రాణమనే ఆలోచనా విధానంతో స్మార్ట్ వాటర్ గ్రిడ్ చేపట్టామన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల వల్ల రాష్ట్రంలో 13 జిల్లాలకుగాను 11 జిల్లాల వరకు గోదావరి జలాలు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో అవసరం మేరకు మొబైల్ లిఫ్ట్‌లు పెడతామన్నారు. ఎక్కడబడితే అక్కడ అప్పటికపుడు బిగించుకునేలా ప్రభుత్వం వద్ద మొబైల్ పంపులు ఉన్నాయన్నారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తూనే ఉన్నారని, రైతులను రెచ్చగొట్టి కోర్టులకూ వెళ్లారన్నారు. అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులను కోరారు. 90శాతం రైతులు భూములిస్తే 10 శాతంమందిని అడ్డుపెట్టుకుని రెచ్చగొడుతున్నారన్నారు. పురుషోత్తపట్నం పథకం 40 ఏళ్లకల అని, అది నెరవేరిందన్నారు. గోదావరి నుంచి రోజుకు 20టి ఎంసి జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయన్నారు. పురుషోత్తపట్నం పథకం ద్వారా 24 టిఎంసి జలాలను ఏలేరు రిజర్వాయరులో నిల్వ చేసుకుని ఎప్పకపుడు వినియోగించుకునే అవకాశం లభించిందన్నారు. ఇక్కడ నుంచి విశాఖకు నీళ్లివ్వడం ద్వారా ‘సుజల స్రవంతి పథకం’ కూడా త్వరలో పూర్తికానుందన్నారు.
స్మార్ట్ వాటర్ గ్రిడ్ ద్వారా 100 టిఎంసి కృష్ణా నుంచి శ్రీశైలం అక్కడ నుంచి నాగార్జున సాగర్‌కు పంపిణీ చేస్తామన్నారు. మరో మూడు నెలల్లో 28 సాగునీటి ప్రాజెక్టులు పూర్తికానున్నాయన్నారు. మిగిలిన ప్రాజెక్టులకూ కార్యాచరణ ఇస్తున్నానన్నారు. అందుకే ‘జలసిరికి హారతి’ పథకాలు చేపట్టామన్నారు. జలం ఒక సిరి, సంపద, ప్రగతికి చిహ్నం, నీళ్లుంటే సుస్థిరత సాధ్యమవుతుందని, రానున్న రోజుల్లో ఉపాధికి, దానినిబట్టి సంపద సృష్టికి నీళ్లే ఆధారమన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుతున్నామన్నారు. మరోవైపు నదుల అనుసంధానం చేస్తున్నామన్నారు. ఇంకోవైపు డ్రిప్, స్ప్రింకర్ల ద్వారా నీటిని పొదుపుగా వినియోగించుకునే పథకాలు కొనసాగిస్తున్నామని సిఎం పేర్కొన్నారు.
భ్రష్టుపట్టిన ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేసి, రూ.550 కోట్లు కేటాయించామన్నారు. నీరు చెట్టు, నీరు ప్రగతి, జలసిరికి హారతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. జనవరిలో మొదలెట్టిన పురుషోత్తపట్నం పథకాన్ని ఆగస్టులో పూర్తి చేశామన్నారు. బిహెచ్‌ఇఎల్ నుంచి ఇంకా పంపులు రాలేదని, అందుకే ప్రభుత్వం వద్ద సిద్ధంగావున్న పంపులను తెచ్చి ఇక్కడ బిగించామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మొబైల్ లిఫ్ట్‌లు పెడతామన్నారు. ఏలేరుకు కాలువ ద్వారా గోదావరి నీరివ్వడం ఒక వినూత్న చరిత్ర అన్నారు. పోలవరం పనులను వేగవంతంగా నిర్వహిస్తున్నామని, 2018నాటికి గ్రావిటీ ద్వారా నీరిస్తామన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం లక్ష్యం మేరకు పనులు పూర్తిచేయడానికి కృషిచేసిన జల వనరుల శాఖ ఇఎన్‌సి వెంకటేశ్వరరావు, ఎస్‌ఇ సుగుణాకరరావు, మెగా కాంట్రాక్టు సంస్థను చంద్రబాబు అభినందించారు. సమావేశంలో రాష్ట్ర జల వనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం మోటార్లను స్విచాన్‌చేసి ప్రారంభిస్తున్న సిఎం చంద్రబాబు