రాష్ట్రీయం

మెగాకు మేముసైతం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 17: పరిశ్రమల స్థాపనకు పబ్లిక్ రవాణా వ్యవస్థ, విద్యుత్, నీటివసతి ప్రధానం. వౌలిక వసతులు కల్పిస్తే మెగా టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు మేం సిద్ధం అని కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ చైర్మన్ కిహక్ సంగ్ వెల్లడించారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ అభివృద్ధి సాధించేలా ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వాధికారులకు సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల మధ్య ఏర్పాటు చేస్తున్న మెగా టెక్స్‌టైల్ పార్కును కొరియా బృందం గురువారం సందర్శించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఇక్కడకు చేరుకున్న కొరియా బృందం, టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. ఈ ప్రాంతానికి అందుబాటులోవున్న రవాణా సౌకర్యాలు, నీటి లభ్యత, విద్యుత్ సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారు, వారు ఎక్కడెక్కడ ఉంటారని ఆరా తీశారు. ప్రతిపాదిత పార్కు కోసం స్థల సేకరణ ఎప్పటి వరకు పూర్తి చేస్తారు, వౌళిక వసతులు ఎప్పటిలోగా కల్పిస్తారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌ను పరిశీలించి, వివిధ బ్లాకుల్లో కొన్ని మార్పులను సూచించారు. ఒక బ్లాకు, మరో బ్లాకుకు మధ్య రెండు వరసల రోడ్డు ఏర్పాటు చేయాలని సూచించారు. మెగా టెక్స్‌టైల్ పార్కు నుంచి రైల్వే ట్రాక్ వెడుతున్న కారణంగా భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని సూచించారు. సివిల్ నిర్మాణాలకు ఎక్కువ నిధులు ఖర్చు చేయటం బదులుగా, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలన్నారు. వరంగల్‌కు చెందిన చేనేత కార్మికులు తయారు చేసిన జంపుఖానాలను పరిశీలించిన కొరియా బృందం, వాటి నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఈ ఉత్పత్తులకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, చేనేత కార్మికుల వారసత్వ సంపద కాపాడాలని సూచించారు. ఒక్కో జంపుఖానా తయారీకి తీసుకునే సమయం, అయ్యే ఖర్చు అడిగి తెలుసుకున్న కొరియా ప్రతినిధులు, ఈ విషయాన్ని జంపుఖానాలపై ముద్రిస్తే కార్మికుల శ్రమ విలువ తెలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ టెక్స్‌టైల్ పార్కుకు మెరుగైన రవాణా వ్యవస్థ ఉందని, పార్కుకు సమీపంలో ఆరు లైన్లతో ఔటర్ రింగురోడ్డు నిర్మాణం జరుగుతోందని కొరియా ప్రతినిధులకు తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పార్కుకు సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ నుంచి ప్రతిరోజు 250ఎంఎల్‌డి నీటిని అందించేలా ప్రణాళిక రూపొందించారన్నారు. టెక్స్‌టైల్ పార్కు కోసం ప్రత్యేకంగా 250 మెగావాట్ల విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే ఎలా అని కొరియా ప్రతినిధి బృందం ప్రశ్నించగా, సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే ప్రత్యామ్నాయ వ్యవస్థను సబ్‌స్టేషన్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. జిల్లాలో సుమారు మూడువేల చేనేత కార్మికులు ఉన్నారని చెప్పారు. టిఎస్‌ఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ వెంకటనర్సింహ్మారెడ్డి, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ క్లస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్‌సిఎం రెడ్డి మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలను కొరియన్ బృందానికి మ్యాపుల ద్వారా వివరించారు. కార్యక్రమంలో మెగా టెక్స్‌టైల్ పార్కు డైరెక్టర్ మిహిర్ పరేఖ్, టిఎస్‌ఐఐసి జోనల్ మేనేజర్ రజన్ రాథోడ్, జిల్లా జాయింట్ కలెక్టర్ హరిత, పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..వరంగల్ చేనేత కార్మికులు తయారు చేసిన జంపుఖానాలను పరిశీలిస్తున్న కొరియా ప్రతినిధులు