రాష్ట్రీయం

కవి, విమర్శకుడు అద్దేపల్లి అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 13: ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ అద్దేపల్లి రామమోహన్‌రావు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బుధవారం తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఎస్ అచ్యుతాపురం గ్రామంలో నివసిస్తున్న డాక్టర్ అద్దేపల్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. కాకినాడ స్థిరపడిన అద్దేపల్లి స్వస్థలం కృష్ణా జిల్లా బందరు. అద్దేపల్లి సుందరరావు, రాజరాజేశ్వరి దంపతులకు ఆయన 1936 సెప్టెంబర్ 6న జన్మించారు. బందరు సమీపంలోని చింతగుంటపాలెంలో 1941-46మధ్య ఎలిమెంటరీ విద్యను, బందరు జవారుపేట జె బ్రాంచ్ స్కూల్‌లో హైస్కూల్ విద్యను అభ్యసించారు. బందరులోని హిందూ కళాశాలలో ఇంటర్, ఆంధ్ర జాతీయ కళాశాలలో బిఎ అభ్యసించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో ఎంఎ తెలుగులో వర్సిటీ ప్రథమ ర్యాంక్ సాధించారు.
1955 మే 1న అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులున్నారు. బందరు హిందూ కళాశాలలో, నందిగామలో ఎన్టీఆర్ కళాశాలలో కొంతకాలం పనిచేసి, 1971లో కాకినాడ నగరంలోని ఎంఎస్‌ఎన్ ఛారిటీస్ డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా చేరి, అదే కళాశాలలో 1994 సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేశారు. బందరు తనకు కన్నతల్లి అయితే కాకినాడ నగరాన్ని పెంచిన తల్లిగా అద్దేపల్లి చెప్పుకునేవారు. 1960లో ఆయన రాసిన మొదటి కవిత కృష్ణా పత్రికలో అచ్చయ్యింది.
ఆయన రాసిన మధుజ్వాల (ఉమర్ ఖయాం రుబారుూలకు అనువాదం), అంతర్జ్వాల, రక్తసంధ్య, గోదావరి నా ప్రతిబింబం, మెరుపు పువ్వు దీర్ఘ కవితలు ఎంతో ఆదరణ పొందాయి. విమర్శకుడిగా శ్రీశ్రీ కవితా ప్రస్థానం, విమర్శ వేదిక, శ్రీశ్రీ మహాప్రస్థానం-ఒక పరిశీలన, కుందుర్తి వచన కవితా వైభవం, స్ర్తివాద కవిత్వం- ఒక పరిశీలన, మహాకవి జాషువా కవితా సమీక్ష వంటి రచనలు చేశారు. సాహిత్య విమర్శకుడిగా సుమారు 70 పుస్తకాలకు ముందుమాట రాశారు. మచిలీపట్నం ఆంధ్ర సారస్వత సమితీ వ్యవస్థాపకుడిగాను, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడిగాను, కాకినాడ క్రాంతి సాహితీ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు.
గొప్ప సాహితీ విమర్శకుణ్ని కోల్పోయాం: చంద్రబాబు
విజయవాడ: అద్దేపల్లి రామమోహనరావు మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలుగు సాహితీ లోకం ఒక గొప్ప సాహితీ విమర్శకుడిని కోల్పోయిందన్నారు. కవికి ప్రాపంచిక దృష్టి ఉండాలన్న వాదాన్ని అద్దేపల్లి విశ్వసించారని, కడదాకా సాహితీ సేవ చేశారని నివాళులర్పించారు. మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం కవితా సంపుటంపై తొలి సమీక్ష చేసిన ఖ్యాతి ఆయనదేనన్నారు. అద్దేపల్లి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

డాక్టర్ అద్దేపల్లి రామ్మోహనరావు (ఫైల్‌ఫొటో)