రాష్ట్రీయం

చర్చలతోనే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: అధికారులు, ఉద్యోగుల విభజనపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల అధికారులు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం లభిస్తుందని డివోపిటి (కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ) హితవు పలికింది. ఉద్యోగుల విభజనపై కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు నడుచుకుంటే వివాదాలకు తావుండదని కూడా సూచించింది. తెలంగాణ సచివాలయం ‘సి’ బ్లాక్‌లో సోమవారం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల కార్యదర్శి అజయ్ మిట్టల్ అధ్యక్షతన ఉద్యోగులు, అధికారుల విభజనపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు దినేశ్‌కుమార్, ఎస్‌పి సింగ్‌తో రాష్ట్ర సలహా కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారంకాని, వివాదంగా మారిన 1302 మంది అధికారులు, ఉద్యోగుల విభజనపై కమిటీ ప్రధానంగా చర్చించింది. రాష్ట్ర సలహా కమిటీ కాలపరిమితి ఇప్పటికే ముగిసిపోయినప్పటికీ ఇంకా కొన్ని కేడర్ల విభజన పూర్తి కాకపోవడంతో కేంద్రం గడువు పొడిగించిందని డివోపిటి కార్యదర్శి అజయ్ మిట్టల్ గుర్తు చేశారు. బహుశ రాష్ట్ర సలహా కమిటీ సమావేశం ఇదే చివరిది కావొచ్చ ని కూడా అభిప్రాయపడినట్టు సమాచారం. ఇలా ఉండగా ఉద్యోగుల విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు నడుచుకుంటే వివాదాలకు ఆస్కారమే ఉండదని డివోపిటి సూచించింది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 24 మంది సెక్షన్ ఆఫీసర్లను ఆ రాష్ట్రం విధులలో చేర్చుకోకుండా తిప్పిపంపించిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ డివోపిటి దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు కేటాయించిన 90 ఉద్యోగులను ఖాళీలు లేకపోయినా సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి చేర్చుకున్నామని ఎస్‌పి సింగ్ గుర్తు చేశారు. అలాంటప్పుడు తాము బదిలీ చేసిన ఎస్‌వోలను విధులలో ఎందుకు చేర్చుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికే తమ వద్ద సరిపడినంత ఎస్‌వోలు ఉండటంతో తిప్పిపంపించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ వివరించారు. ఉద్యోగుల విభజన కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు జరగడంతో, ఆ కమిటీ ఆదేశాల మేరకు నడుచుకోవాలని డివోపిటి సూచించింది. వివాదాస్పదంగా మారిన ఎస్‌వోల అంశాన్ని ఇరు రాష్ట్రాలే తేల్చుకోవాలని డివోపిటి స్పష్టం చేసింది. విభజన చట్టం మేరకు కమలనాథన్ కమిటీ 55,870 మంది ఉద్యోగులను విభజించి ఆంధ్రప్రదేశ్‌కు 31,614 మంది, తెలంగాణకు 24,259 మంది ఉద్యోగులను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఇరు రాష్ట్రాల మధ్య డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, నాన్ కేడర్ ఎస్సీలు, డిఎస్పీలతో పాటు వైద్య, కార్మికశాఖకు చెందిన అధికారుల విభజన జరుగకపోవడంపై డివోపిటి ఆరా తీసింది. ఈ అంశాన్ని ఇరు రాష్ట్రాల సిఎస్‌లు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని డివోపిటి సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయించిన నాలుగవ తరగతి ఉద్యోగులను తిరిగి పంపించాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

చిత్రం..ఉద్యోగులు, అధికారుల పంపకాల వివాదంపై రెండు రాష్ట్రాల సిఎస్‌లతో జరిపిన సమావేశంలో మాట్లాడుతున్న డివోపిటి కార్యదర్శి అజయ్ మిట్టల్