రాష్ట్రీయం

మన్యం అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఆగస్టు 28: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విశాఖ మన్యం అతలాకుతలమైంది. ఏజెన్సీలో ఆది, సోమవారాల్లో భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ ఏకధాటిగా వర్షం పడటంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించాయి. దీంతో గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సోమవారం ఉదయానికి జి.మాడుగులలో అత్యధికంగా 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాడేరులో 90 మిల్లీమీటర్లు, ముంచంగిపుట్టులో 50, హుకుంపేటలో 42, పెదబయలులో 30, అరకులోయలో 26, చింతపల్లిలో 22, డుంబ్రిగుడలో 12, కొయ్యూరులో 26మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఏజెన్సీలోని అతి తక్కువ వర్ష పాతం అనంతగిరిలో 9.4, గూడెంకొత్తవీధిలో 8.4 మిల్లీమీటర్లు నమోదైంది. భారీ వర్షానికి అనేకచోట్ల చెరువులకు గండిపడి నీరంతా పంట పొలాల్లోకి చేరడంతో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పంట పొలాలు నీట మునిగి గిరిజన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్ష బీభత్సవానికి జి.మాడుగుల మండలంలోని అనేక చోట్ల పొలాలన్నీ చెరువులయ్యాయి. గిరిజన రైతులు ఇటీవలే వేసిన వరి నాట్లు కొట్టుకుపోయాయి. అనేకచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. జి.మాడుగుల నుంచి చింతపల్లి వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారి ధ్వంసమైంది. భారీ వర్షాలకు గెడ్డలు, వాగుల్లోకి భారీగా నీరు చేరి పొంగి ప్రవహించడంతో జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ రచ్చపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు సెర్రెకు రామారావు (45) ఆదివారం సాయంత్రం కొట్టుకుపోయాడు. పక్క గ్రామానికి నిత్యావసర వస్తువుల కోసం వెళ్లిన గిరిజనుడు తిరిగి వస్తుండగా మధ్యలో గెడ్డను దాటబోయి నీటి ప్రవహానికి గల్లంతయ్యాడు. జి.మాడుగులలోని కాలువలలో నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో సోమవారం ఉదయం ఒక వ్యాపారి ప్రమాదవశాత్తూ కాలువలోకి జారిపడి కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు అనేకచోట్ల పెంకుటిళ్లు నేలకూలాయి. గెడ్డలు, వాగులు పొంగడంతో గ్రామాలకే పరిమితమైపోయిన గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏజెన్సీలోని ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి, లేదా మండల కేంద్రానికి రావాలన్నా ఎక్కడోకచోట గెడ్డ, వాగులు దాటాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో బాహ్య ప్రపంచంతో గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. దీనికితోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మండల కేంద్రాలవాసులే కాకుండా గ్రామాల్లోని గిరిజనులూ అంధకారంలో ఉండిపోయారు. ఒకవైపు వర్షం, మరొవైపు విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చిత్రాలు..వర్షాలకు కొట్టుకుపోయిన పాడేరు - చింతపల్లి రహదారి. * గండిపడిన చెరువు