రాష్ట్రీయం

ఒమన్ నుండి స్వస్థలాలకు వలస కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 29: గత నాలుగు మాసాల నుండి ఒమన్‌లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు దశల వారీగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారుల తోడ్పాటుతో రెండవ విడతగా మంగళవారం తెలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది బాధితులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లికి చెందిన సంగెం చిన్న య్య, జగిత్యాల జిల్లా కూడిమ్యాలకు చెందిన చెన్న వెంకటేశ్వర్లు మస్క ట్ (ఒమన్) నుండి హైదరాబాద్‌కు ఒమన్ ఎయిర్‌వేస్ ఫ్లయిట్ ద్వారా శంషాబాద్ వినాశ్రయంలో మంగళవారం ఉదయం దిగారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతానికి చెందిన మరో 20 మంది వలస కార్మికులు సూరపాటి తుంబనాథం, మిట్టన పొట్టయ్య, సీరపు వాసుదేవ్, పైలా గురునాథ్‌రెడ్డి, ఆర్.త్రినాథ్‌రెడ్డి, వాసుదేవులు రెడ్డి, జి.గురుమూర్తి, సేతి మురళి, జె.పురుషోత్తం, గోవిందు రామయ్య, బి.కోటేశ్వర్‌రావు, యెదురు మోహనరావు, వీరాస్వామి, ఆర్.కురేష్‌రెడ్డి, కె.రజయారెడ్డి, దువ్వు గణేష్‌రెడ్డి, పేలి డంబారు, కొర్లపు అశోక్ కుమార్, డి.మాధవరెడ్డి, వేణురెడ్డి మస్కట్ నుండి ముంబై మీదుగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం సమయంలో చేరుకున్నారని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఒమన్‌లో చిక్కుబడిపోయిన కార్మికులకు మస్కట్‌లోని భారత రాయబారి ఇంద్రామణి పాండే ప్రత్యేక చొరవ చూపుతూ ఉచిత విమాన టిక్కెట్లను సమకూర్చడం వల్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 57 మంది వలస కార్మికులు కూడా తమతమ స్వస్థలాలకు చేరుకున్నారని చెప్పారు. ఒమన్ దేశంలోని సోహార్ నగరంలో గల పెట్రోన్ గల్ఫ్ కంపెనీని గత నాలుగు మాసాల క్రితం యాజమాన్యం ఉన్నపళంగా మూసివేయడంతో సుమారు 900 మంది భారతీయులు రోడ్డున పడ్డారు. సుమారు ఎనిమిది నుండి పదేళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యం నాలుగు నెలల వేతన బకాయిలతో పాటు గ్రాట్యుటీని కలుపుకుని ఒక్కొక్కరికి 3 నుండి 4 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. తమకు రావాల్సిన బకాయిల కోసం కార్మికులు ఒమన్‌లోనే ఉంటూ, చేసేందుకు పని లభించక, రోడ్ల పక్కన పడుకుంటూ, అర్ధాకలితో నానాఅవస్థలు ఎదుర్కొన్నారు. అక్కడి లేబర్ కోర్టులో కేసు వేయగా, కార్మికుల పక్షాన పోరాడేందుకు భారత రాయబారి చొరవ చూపుతూ, బాధితులను దశల వారీగా స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే రెండవ విడతగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది బాధితులు ఒమన్ నుండి స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే బాధితుల వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడాన్ని గమనించిన మస్కట్‌లోని చిరు మెగాయూత్ ఫోర్స్ ప్రతినిధులు చందక రాందాస్, పోల్సాని లింగయ్య చేతి ఖర్చుల కోసం 79 మందికి వేయి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించగా, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుండి స్వస్థలాలకు వెళ్లేందుకు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధికారి చిట్టిబాబు బస్ చార్జీలకు సరిపడా డబ్బులు అందజేశారు. ఒమన్‌లోని పెట్రోన్ కంపెనీ యాజమాన్యం మోసానికి గురై ఖాళీ చేతులతో స్వస్థలాలకు చేరుకున్న గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.దేవేందర్‌రెడ్డి కోరారు.

చిత్రం..ఒమన్ నుండి స్వదేశానికి చేరుకున్న వలస కార్మికులు