రాష్ట్రీయం

జనసేన పటిష్ఠతకు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: జనసేనను పటిష్టం చేసే దిశగా ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి ఒక రూపాన్ని ఇచ్చి, అక్కడ నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుకున్న తర్వాత తెలంగాణలో పార్టీని నిలపాలని సహచరులు ఇస్తున్న సలహాను పవన్ పాటిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో అకస్మాత్తుగా పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేస్తే అధికార పార్టీ నుండి ఎదురయ్యే సమస్యలను అధిగమించే సత్తా పార్టీ యంత్రాంగానికి ఇప్పటికిపుడు లేకపోవడంతో ముందు ఆంధ్రాలో పార్టీని పటిష్టం చేసేందుకు పవన్ ఏర్పాట్లు చేశారు. ప్రజాసమస్యలపై స్పందించడం ద్వారానే పార్టీకి ప్రచారం తీసుకురావాలనే వ్యూహంతో పవన్ ముందుకు వెళ్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా వచ్చిన అనేక బృందాలతో సమావేశమైన పవన్ తన కొత్త సినిమా షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. రాజకీయ పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగానే మరికొన్ని సినిమాలను నిర్మించాలనే యోచనలో పవన్ ఉన్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రజా సమస్యలు, ఎదురవుతున్న తీవ్రమైన ఇబ్బందులపై అధ్యయనం చేసిన పవన్ వాటిపై మరింత లోతైన అధ్యయనానికి సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, నిపుణులతో కమిటీలను నియమించారు. విద్యావ్యవస్థ, నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, భూ సమస్యలు, వైద్యం, గృహనిర్మాణం, ఇంధనం, గనులు వంటి కొన్ని అంశాలను తీసుకుని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రానున్న రోజుల్లో పార్టీ విధానంపై స్పష్టత ఇచ్చేందుకు పవన్ కసరత్తు చేస్తున్నారు. మరో పక్క పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఐటి విభాగాన్ని ఏర్పాటు చేసుకున్న పవన్, మహిళా విభాగానికి, యువజన విభాగాలకు కూడా తుది రూపాన్ని ఇస్తున్నారు. రెండు , మూడు నెలల్లో తన సినిమా పూర్తి చేసి సంక్రాంతి నాటికి ప్రజల్లోకి వెళ్లాలని పవన్ భావిస్తున్నట్టు తెలిసింది. ప్రతి మండల కేంద్రానికి చేరేలా పాదయాత్ర లేదా రథయాత్రపై కసరత్తు చేస్తున్నారు. ఇటీవల నంద్యాల ఉప ఎన్నికలోనూ, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలోనూ పోటీచేయాలనే ఒత్తిడిని అధిగమించి పార్టీ ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులను పదే పదే వివరించడం ద్వారా పవన్ తనపై పెరిగిపోతున్న అంచనాలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సమస్యపై చర్చ జరుగుతున్న తరుణంలోనే మరో కొత్త సమస్య ముందుకు రావడంతో అన్నింటిపైనా పోరాడే వ్యవస్థ జనసేనకు లేదనే వాస్తవ పరిస్థితిని ఆయన వివరిస్తున్నారు. కొత్త ఆశలకు రూపాన్నిచ్చిన ప్రజారాజ్యం పురిట్లోనే నూరేళ్లు నిండటంతో ప్రతి ఒక్కరికీ తనపై నమ్మకాన్ని పెంచాల్సిన దురవస్థ ఏర్పడిందని పవన్ భావిస్తున్నారు. జనసేన పార్టీ ఉంటుందా...ఎంతకాలం ఉంటుంది...ఎవరితో కలిసి పనిచేస్తుందనే అనుమానాలను నివృత్తి చేసుకుంటూ జనసేన స్వశక్తిని రుజువుచేసుకోవాలంటే కొంత క్షేత్రస్థాయి బలం ఉండాలని పవన్ నమ్ముతున్నారు. ఎన్నికల్లో గెలిచి అర్జంట్‌గా శాసనసభకు వెళ్లడం కంటే ముందు ప్రజల్లో పార్టీపై గట్టి నమ్మకం కల్పించడమే లక్ష్యంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పవన్ తొలి రోజు నుండే మార్గదర్శనం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి 150 ఏళ్లు పడితే, బిజెపికి 50 ఏళ్లు పట్టిందని, టిడిపికి 35 ఏళ్లు పట్టిందని చెబుతున్న పవన్ పార్టీ ఎదగడానికి కొంత సమయం పడుతుందనే వాస్తవికతను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి పార్టీకి సంబంధించి విధివిధానాలు, ముసాయిదా ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసేందుకు నలుగురైదుగురు నిపుణులతో కసరత్తు ప్రారంభించారు. మరో పక్క విద్యార్ధులు, యువకులు, న్యాయవాదులు, విద్యావేత్తలతో అనునిత్యం విస్తృతంగా చర్చిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి అంశంపైనా అనుకూల , ప్రతికూల వ్యక్తులతో ఒకే వేదికపై చర్చ నిర్వహించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ విధానాలను రూపొందించే పనిలో పవన్ పడ్డారు.