రాష్ట్రీయం

అమోఘం.. అపూర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ..జై, గణపతి బప్పా మోరియా..’ భక్తజనం నినాదాలతో భాగ్యనగరం పులకించి పోయింది. గత 11రోజులుగా పూజలందుకున్న వినాయకుడికి భక్తులు వీడ్కోలు పలికారు. అనంత చతుర్దశి సందర్భంగా మంగళవారం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్వర్యంలో కన్నుల పండువగా శోభాయాత్ర సాగింది. శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు అశేషంగా తరలి వచ్చారు. నగరంలోని రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు తమ ప్రాంతాల్లో కొలువు దీరిన వినాయకుల నిమజ్జనానికి వాహనాలను ప్రత్యేకంగా అలంకరించి, డప్పు వాయిద్యాలతో, చిన్నా పెద్దా తేడా లేకుండా నృత్యం చేస్తూ నిమజ్జనానికి బయలుదేరారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సిసి కెమెరాలతో పరిశీలించారు.
అయితే ఈ దఫా నిమజ్జనానికి పోలీసులు తొందర పెట్టారు. ఖైరతాబాద్ అనంత మహాగణపతి విగ్రహాన్ని మధ్యాహ్నం 12గంటల లోపే నిమజ్జనం చేయించాలని పోలీసులు యత్నించారు. కాగా శోభాయాత్ర నెక్లెస్ రోడ్డులోని క్రేన్ నెంబర్.4కు చేరుకునే సరికి మధ్యాహ్నం 1.40 గంటలయ్యింది. భక్తుల హర్షధ్వానుల మధ్య భారీ క్రేన్‌తో మహా గణనాథుని నిమజ్జనం చేశారు. బాలాపూర్ గణేశ్ నిమజ్జనం సాయంత్రం 6.30 గంటలకు చేశారు. బాలాపూర్ నుంచి బయలుదేరే ఊరేగింపు ప్రతి ఏడాది చార్మినార్‌కు చేరుకునే సరికి మధ్యాహ్నం 2 గంటలు దాటేది. కానీ ఈ దఫా మధ్యాహ్నం ఒంటిగంటలోపే దాటించారు. పాతనగరంలోని అన్ని వినాయకుల మండపాల నుంచి బయలుదేరిన ఊరేగింపులు చార్మినార్ వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. వినాయకుల ప్రతిష్ఠ జరిగిన తర్వాత చాలా ప్రాంతాల్లో 3వ రోజు, 5వ రోజు, 9వ రోజూ నిమజ్జనానికి తరలించినా, మంగళవారం ఏ మాత్రం వినాయకుల ఊరేగింపుల సంఖ్య తగ్గలేదు, భక్తుల సంఖ్య కూడా తగ్గలేదు. చార్మినార్ సమీపంలోని శంషీర్‌గంజ్, పార్థివాడకు చెందిన భక్తులు వాహనానికి తొమ్మిది రకాల పండ్లతో చేసిన అలంకరణ చూపరులను విశేషంగా ఆకర్షించింది.
వినాయక చౌక్ వద్ద సందడే, సందడి
పాత నగరంలోని బాలాపూర్, అలియాబాద్, గౌలిపురా, ఛత్రినాక, కందికల్ గేట్ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన ఊరేగింపులో చార్మినార్ కూడలి వద్ద కలిసి మొజంజాహి మార్కెట్ (వినాయక్‌చౌక్) దిశగా సాగాయి. అదే సమయంలో సంతోష్‌నగర్, మాదన్నపేట, చంపాపేట, సైదాబాద్, ఓల్డ్ మలక్‌పేట్ నుంచి బయలుదేరిన ఊరేగింపులు చాదర్ ఘాట్ మీదుగా మొజంజాహి మార్కెట్‌కు చేరుకున్నాయి. మరోవైపు పురానాపూల్, కార్వాన్, లంగర్‌హౌజ్ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన వాహనాలు మొజంజాహి మార్కెట్‌కు చేరుకున్నాయి. ఈ విధంగా మూడు వైపుల నుంచి ఊరేగింపులు తరలి రావడంతో, మార్కెట్ ప్రాంతం చూడముచ్చటగా కనిపించింది. మొజంజాహి మార్కెట్ వద్ద పోలీసులు మూడు ప్రాంతాల నుంచి వాహనాలను ఏ మాత్రం ఆపకుండా ముందుకు పంపించారు. మూడు ప్రాంతాల నుంచి వచ్చిన ఊరేగింపులు ప్రధాన ఊరేగింపులో కలిసి ఆబిడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు సాగాయి. మారేడ్‌పల్లి, తార్నాక, హబ్సిగుడా, బేగంపేట్, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఊరేగింపులు బాటా, రాణిగంజ్ మీదుగా వినాయక్ సాగర్‌కు చేరుకున్నాయి.
ప్రసాదాల పంపిణీ..
ఊరేగింపులో పాల్గొనేందుకు అనేక మంది కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. భక్తుల సౌకర్యార్థం అనేక వ్యాపార, వాణిజ్య సంస్థలు దారి పొడుగునా షామియానాలు వేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ప్రజలు వివిధ రకాల ప్రసాదాలు ఆరగిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. కొంత మంది యువకులు గులాల్ చల్లుకుంటూ నృత్యం చేశారు. ఒక్కో వినాయకుని ఊరేగింపు ఒక విశిష్టత కనిపించింది. నిర్వాహకులు కూడా అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించి, రాజస్థానీ పగిడీ ధరించి నృత్యం చేశారు. ఊరేగింపుగా వచ్చే వినాయకుని విగ్రహాలను వెంట వెంటనే నిమజ్జనం చేసి, ఆ వాహనాలను వెనక్కి పంపించేందుకు వీలుగా 27 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై 18 క్రేన్లను, నెక్లెస్‌రోడ్డు వైపు 9 క్రేన్లను ఏర్పాటు చేశారు.
సరూర్‌నగర్ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అనేక ఊరేగింపులు సరూర్‌నగర్ చెరువుకు చేరుకున్నాయి. అక్కడ కూడా భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు.