రాష్ట్రీయం

శ్రీశైల మల్లన్నకు రావణ వాహనసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి, అమ్మవార్లకు రావణవాహన సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారు, స్వామివారికి ఆలయ అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీశ్వరపూజ, మండపారాధనలు, పంచవరణార్చనలు, జపానుష్టానాలు, హోమాలు జరిగాయి. సాయంత్రం నిత్యహవనాలు, బలిహరణలు నిర్వహించారు. అక్క మహాదేవి అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రావణ వాహనంపై ఆశీనులను జేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరో నాలుగు రోజులు చలి తీవ్రత
నెలాఖరు నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 14: రాష్ట్రంలో చలి పెరిగింది. సాధారణం కన్నా రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రా యూనివర్శిటీ ఓష్ణోగ్రఫీ విశ్రాంత ఆచార్యులు భానుకుమార్ మాట్లాడుతూ యూరప్ నుంచి రాజస్థాన్ మీదుగా గాలులు దక్షిణ భారత దేశం వైపునకు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఉపరితలంపై అధికపీడనం ఏర్పడింది.. దీని వలన గడచిన రెండు రోజులుగా చలిగాలులు మరింతగా పెరిగాయని చెప్పారు. ఈ పరిస్థితి మరో నాలుగు రోజులపాటు కొనసాగుతుందని ఆయన తెలియచేశారు. విశాఖ ఏజెన్సీలో అనేక ప్రాంతాల్లో నాలుగు, ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుడు మకర రాశిలోకి వస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని భానుకుమార్ తెలియచేశారు.

‘ఉపాధి’ వేతనాల పంపిణీలో కుంభకోణం
పోస్ట్‌మాస్టర్ సహా నలుగురిపై సిబిఐ కేసు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 14: శ్రీకాకుళం జిల్లా సతివాడ పోస్ట్ఫాస్ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు వేతనాల పంపిణీలో అవకతవకలకు పాల్పడినందుకు శ్రీకాకుళం జిల్లా సతివాడ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, అందులోని మరో ముగ్గురు ఉద్యోగులపై సిబిఐ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. వీరంతా 2013-15 సంవత్సరాల మధ్య ఈ పోస్ట్ఫాస్ ద్వారా కూలీలకు బట్వాడా కావల్సిన సుమారు కోటిన్నర రూపాయల మొత్తానికి సంబంధించి అవకతవకలు జరిగినట్టు సిబిఐ అధికారులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేయడంతోపాటు, శ్రీకాకుళం జిల్లా సతివాడ, గార, విశాఖ నగరంలోని మురళీనగర్ ప్రాంతాల్లోని నిందితుల ఇళ్లపై సిబిఐ అధికారులు దాడులు జరిపి, సోదాలు నిర్వహించారు. దర్యాప్తు కొనసాగుతున్నట్టు సిబిఐ అధికారులు వెల్లడించారు.
ప్రముఖ ఉర్దూ కవి రజాబేగ్ మృతి
మామిడికుదురు, జనవరి 14: తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన ప్రముఖ ఉర్దూ కవి రజాబేగ్ (వికార్ నగరి) (75) గురువారం తెల్లవారుజామున చెన్నైలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆయన షియా మతానికి సంబంధించి పలు ఉర్దూ కవిత్వాలు, కసిదాలు రచించారు. ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు ఆయనను పలు బిరుదులతో సత్కరించాయి. గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న రజాబేగ్, చెన్నైలోని కుమారుని వద్ద ఉంటున్నారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఆయన పుట్టిన రోజైన జనవరి 14న మృతిచెందడం విశేషం. రజాబేగ్ మృతికి పలువురు ముస్లిం నాయకులు సంతాపం తెలిపారు.
నెల్లూరు అభివృద్ధికి 50కోట్లు మంజూరు
నెల్లూరుసిటీ, జనవరి 14: నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లరూపాయలు మంజూరు చేసిందని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ చెప్పారు. గురువారం ఉదయం ఆయన స్థానిక విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఏడాదిన్నర నుంచి అప్పులో ఊబిలో కొట్టమిట్టడుతున్న నెల్లూరు కార్పొరేషన్‌కు కొత్త సంవత్సరంలో ప్రభుత్వం 50కోట్లు మంజూరు చేసిందన్నారు. నెల్లూరు నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి సరఫరా పైపులకోసం నిర్మాణం కోసం ప్రభుత్వం ఇటీవల 1100కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. ఈ రెండు పనులకు నెల 20వ తేదీన టెండర్లు పిలుస్తామన్నారు. నూతన సంవత్సరం కానుకగా మంత్రి నారాయణ 50కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మరో 50కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో ఈ నిధులతో కార్పొరేషన్‌లో కొత్తగా విలీనం అయిన ప్రాంతాలలో రోడ్లు, డ్రైయిన్లు, తాగునీటి పైపులైన్లు వేస్తామన్నారు. అదే విధంగా నెల్లూరులో ఒక మెగా పార్కును నిర్మాణం చేయబోతున్నామని పేర్కొన్నారు.
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం
గిద్దలూరు, జనవరి 14: ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలోని 7వ వార్డు ఎస్‌పిసి పాళెంలో నివాసం ఉంటున్న దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తెపై ఆదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడు గురువారం సాయంత్రం అత్యాచారానికి పాల్పడ్డాడు. 7వ వార్డులో నివాసం ఉంటున్న బాలికను గురువారం సాయంత్రం నేరెళ్ల రంగస్వామి (24) అత్యాచారం చేశాడు. శ్రవంతి పాచిపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సెలవులు కావడంతో తనకున్న ఇద్దరు పిల్లలను ఇంటివద్దే వదిలి పని నిమిత్తం వెళ్లింది. అందులో పెద్దకుమార్తెను టివి చూపిస్తానని రంగస్వామి తన ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లి ఇంట్లో పిల్ల కన్పించకపోయేసరికి చుట్టుపక్కలవారిని అడుగ్గా రంగస్వామి వెంట వెళ్లిందని చెప్పడంతో రంగస్వామి ఇంటికి వెళ్లగా అప్పుడే ఏడుస్తూ బైటకు వచ్చిన తన కుమార్తెను చేరదీసి విషయం కనుక్కుంది. చుట్టుపక్కలవారు రంగస్వామికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గిద్దలూరు సిఐ ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో కేసు నమోదుచేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభత్వ వైద్యశాలకు తరలించారు. రంగస్వామి పోలీసుల అదుపులో ఉన్నాడు.

తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి రైతులు ఓకే!
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 14: రాజధాని ప్రాంతంలో ఏదో ఒక నిర్మాణం చేపట్టాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తాత్కాలిక సచివాలయానికి స్థలాన్ని ఎంపిక చేయడం పట్ల వారు సంతోషంగా తమ ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయాన్ని మంగళగిరి ప్రాంతంలోని అమరావతి టౌన్‌షిప్‌లో నిర్మించాలని పలుమార్లు ప్రతిపాదనలు తయారు చేసినప్పటికీ వాయిదా పడుతూ వచ్చింది. ఆఖరికి 22ఎకరాల స్థలంలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంతో భూములిచ్చిన రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అడిగిన వెంటనే రాజధాని నిర్మాణాలకు వేలాది ఎకరాల భూములిచ్చిన ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతంలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తే ఎలా అంటూ మంత్రులు, అధికారులను రైతులు పలు సందర్భాల్లో ప్రశ్నించారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయాన్ని వెలగపూడి కేంద్రంగా నిర్మించాలని నిర్ణయించింది.

అందరూ కూర్చోండి..
అభివృద్ధిపై చర్చించండి
ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 14: గ్రామసీమల్లో సమైక్యత, సుహృద్భావ వాతావరణం నెలకొనాలనే ఉద్దేశ్యంతో తొలిసారిగా సంక్రాంతి సంబరాలను ప్రభుత్వపరంగా భారీగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి తన నివాస గృహం నుంచి ముఖ్యులతో నేరుగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కనీసం ఏడాదికొకసారైనా గ్రామీణ ప్రాంత వాసులందరూ రెండు రోజులపాటు కలిసి కూర్చుని ఒకర్ని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కష్టసుఖాలు చర్చించుకోవటం వల్ల నేటి తరానికి గ్రామీణ సంస్కృతి, చరిత్ర తెలుస్తాయన్నారు. ఇదే సమయంలో గ్రామస్తులంతా కూర్చుని తమ గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణను రూపొందించుకోవాలని కోరారు. ఇదే సమయంలో గ్రామాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై కూడా చర్చ జరిగి ప్రజలను చైతన్యపర్చాలన్నారు. తొమ్మిదేళ్ల పాటు తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అంకితభావంతో పనిచేయటం వల్లనే అనుకున్న లక్ష్యాలను సాధించగలిగామన్నారు. ప్రధానంగా సైబరాబాద్ అనే సరికొత్త సిటీని సృష్టించగలిగామన్నారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన హైటెక్ సిటీ నిర్మాణాన్ని చేపట్టగలిగామన్నారు. తాను చేపట్టిన అభివృద్ధి పనుల వల్లనే నేడు తెలంగాణకు హైదరాబాద్ ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున నిధులను సమీకరించి హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయటం తెలుగుదేశం, బిజెపి కూటమి ద్వారానే సాధ్యవౌతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరినీ కలిసి వాస్తవ పరిస్థితులను తెలియజేసి గెలుపు కోసం కృషి చేయాలని తెలుగుదేశం నాయకులను చంద్రబాబు కోరారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ తాత్కాలిక కార్యాలయాల నుంచే పరిపాలన సాగిస్తున్నామన్నారు.

రూ. 5 కోట్ల
ఎర్రచందనం పట్టివేత
కంటైనర్ స్వాధీనం, డ్రైవర్ అరెస్టు
రైల్వేకోడూరు, జనవరి 14: కడప జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద గురువారం అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కంటైనర్‌లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. కంటైనర్ డ్రైవర్ రామును అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి డిఎఫ్‌ఓ టివి సుబ్బారెడ్డి కథనం మేరకు వివరాలిలావున్నాయి. బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద గురువారం ఉదయం తమిళనాడుకు చెందిన టిఎన్ 05 జె 3535 నెంబరు కంటైనర్‌ను బాలుపల్లె అటవీ అధికారి శ్రీనివాసులరెడ్డి, చెక్‌పోస్టు అధికారి కృష్ణయ్య, సిబ్బంది తనిఖీచేయగా అందులో పెద్దమొత్తంలో ఎర్రచందనం దుంగలు కనిపించాయి. రాజంపేట, ఒంటిమిట్ట ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ కంటైనర్ ద్వారా ఎర్రచందనం దుంగలను వేలూరుకు చెందిన డ్రైవర్ రాము ద్వారా చెన్నై తరలించే క్రమంలో పట్టుబడ్డాయి. డ్రైవర్ రామును విచారించగా గుర్తుతెలియని వ్యక్తులు గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో తనకు ఈ వాహనాన్ని అప్పగించినట్లు వెల్లడించాడు. అతని వద్ద దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా డిఎఫ్‌ఓ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెక్‌పోస్టు సిబ్బంది పెంచలయ్య, కోటి, లాలు, ఎస్.బాషా సహకారంతో కంటైనర్‌ను పట్టుకోగలిగామన్నారు.