రాష్ట్రీయం

అర్చకులకూ పే స్కేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: అర్చకులకు తీపి కబురు. ఇక నుంచి ఉద్యోగులకు మాదిరిగా పే స్కేలు అమలు చేయనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నవంబర్ నుంచే పే స్కేలు అమలవుతుందన్నారు. అలాగే దేవాలయాల నిర్వహణకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయనున్నట్టు కెసిఆర్ వెల్లడించారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం అర్చకులతో సిఎం సమావేశమయ్యారు. ఈ సందర్భాంగా అర్చకుల సంక్షేమం, దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 1805 దేవాలయాలకు ధూప దీప నైవేధ్యం పథకాన్ని అమలు చేస్తున్నామని, వీటికి అదనంగా మరో 3 వేల ఆలయాలకు పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దేవాలయాల పట్ల వివక్ష కొనసాగింది. ప్రభుత్వాలు దేవాలయాలకు కనీసం ఎకరా భూమి కూడా ఇవ్వలేదు. దేవాలయాల భూములు అన్యాక్రాంతమైనా, కబ్జాలకు గురైనా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలు మరింత అన్యాయానికి గురయ్యాయి. ఇక్కడి గుడులను గుడులుగా చూడలేదు. ఇక్కడ పుష్కరాలను పుష్కరాలుగా చూడలేదు. దేవాలయాల అభివృద్ధిని పట్టించకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్చకుల సమస్యలపైనా, దేవాలయాల అభివృద్ధిపైనా, బ్రాహ్మణుల సంక్షేమం పైనా ప్రత్యేక దృష్టి పెట్టాం. యాదాద్రి, ధర్మపురి, వేములవాడ, భద్రాద్రి తదితర ఆలయాలను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నాం’ అని అన్నారు. గతంలో కేవలం 1805 దేవాలయాలకు నెలకు రూ.2500 మాత్రమే ధూప దీప నైవేధ్యానికి ఇస్తుండగా, దీన్ని తమ ప్రభుత్వం వచ్చాక రూ. 6 వేలకు పెంచిందన్నారు. ఈ పథకంలోకి కొత్తగా మరో 3 వేల దేవాలయాలు చేర్చుతున్నామన్నారు. దీంతో ధూప దీప నైవేధ్యాలు పొందే ఆలయాల సంఖ్య 4805కు చేరుతుందని కెసిఆర్ వివరించారు. అర్చకుల గౌరవ మర్యాదలకు లోటులేకపోయినా, వ్యక్తిగతంగా వారి కుటుంబాలకు పూట గడవడం కష్టంగా ఉండే పరిస్థితి ఉంది. అర్చక వృత్తిని ఎంచుకున్న వారికి పెళ్లిళ్లు జరగని పరిస్థితి ఏర్పడిందన్నారు. వీరి జీతభత్యాలు ఆలయ కమిటీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి ఉందన్నారు. ఇక నుంచి ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అర్చకులకు పే స్కేళ్లు అమలు చేయడంతో పాటు ఇతర దేవాలయాల్లోని ఇతర ఉద్యోగులకూ ప్రతీ నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సిఎం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వీరికీ వేతన సిఫారసులను అమలు చేస్తామన్నారు. దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని, వీటి నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నీ పర్యవేక్షించడానికి కొత్తగా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇప్పటికే బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. వంద కోట్ల నిధులతో ప్రత్యేక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దేవాలయాల పేరిట 83 వేల ఎకరాల భూములున్నట్టు లెక్క తేలిందన్నారు. అర్చకులు కూడా దేవాలయాల నిర్వహణ, దైవ సంబంధ కార్యక్రమాలపై మరింత దృష్టి కేంద్రీకరించాలని సిఎం సూచించారు. ఎక్కడా పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అర్చకులు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పూజలు చేయడంతో పాటు తాను ఎక్కడికెళ్లినా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, తెలంగాణ రాష్ట్ర ప్రాప్తిరస్తు అని దీవించారని గుర్తు చేసుకున్నారు. శృంగేరి పీఠాధిపతులు, చిన జీయర్ స్వామి, కంచి పీఠాధిపతుల సలహాలు, సూచనలు పాటిస్తూ ధార్మిక పరిషత్ కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. అర్చకుల సమస్యలు పరిష్కరించడంతో తనకు 15 లడ్డూలు తిన్నంత ఆనందంగా ఉందని సిఎం వ్యాఖ్యానించారు.
ఏపీ అర్చక సమాఖ్య అభినందనలు
అర్చకులకు ప్రభుత్వోద్యోగుల మాదిరిగా పే స్కేళ్లు అమలు చేయడం, దేవాలయాల అభివృద్ధికి ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయడంపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య అభినందనలు తెలిపింది. దైవభక్తి, అర్చకుల పట్ల ఆదరణ కలిగిన కెసిఆర్‌కు వేలాది మంది అర్చకుల కుటుంబాల ఆశీర్వచనాలు లభిస్తాయని ఏపీ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్రం.. ప్రగతి భవన్‌లో శుక్రవారం అర్చకులతో సమావేశమై మాట్లాడుతున్న సిఎం కెసిఆర్