రాష్ట్రీయం

బిరా బిరా కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ గద్వాల/ శ్రీశైలం, సెప్టెంబర్ 16: కృష్ణవేణి పరవళ్లతో తెలంగాణ కృష్ణా బేసిన్ కదం తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి శనివారం భారీ వరద వచ్చి చేరింది. సుమారు 1.89 లక్షల క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుకుంది. ఈ సీజన్‌లో ఇదే భారీ ఇన్‌ఫ్లో కావడం గమనార్హం. దీంతో జలాశయం నీటిమట్టం 840 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 61.79 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టు నుండి 1,09,303 క్యూసెక్కులు, రోజా నుంచి 79,880 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,89,183 క్యూసెక్కుల భారీ వరద జలాశయానికి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తి, హంద్రీనీవా ద్వారా 3,288 క్యూసెక్కుల నీరు విడుదల చేయడం చేస్తున్నారు. తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు శ్రీశైలం చేరుకుంటోంది. సుంకేసుల జలాశయం నిండడంతో గేట్లు ఎత్తారు. దీంతో ఆ నీరు కూడా శ్రీశైలం చేరుకుంటోంది.
ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న మొత్తం లక్షన్నర క్యూసెక్కుల నీటిని కుడి, ఎడమ కాల్వలకు, నెట్టెంపాడు, బీమా, కోయిలసాగర్, సమాంతర కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. తాజా వరద నీటితో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మంచి నీటి అవసరాలు గట్టెక్కనుంది. శ్రీశైలం ప్రాజెక్టులో 215.81 టిఎంసి నీటి నిల్వ సామర్ధ్యం ఉంటే, ప్రస్తుతం 62 టిఎంసికి చేరుకుంది. 885 అడుగుల నీటి మట్టానికి 839.5 అడుగులకు చేరుకుంది. ఎగువునున్న ఆల్మట్టి నుంచి 45వేల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్ నుంచి 68 వేల క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో శ్రీశైలం జలాశయం వద్ద గత 24 గంటల్లో మొత్తం పరిస్ధితి మారింది. తెలంగాణ ప్రభుత్వం జల విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తోంది.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో అటు రాయలసీమ, ఇటు తెలంగాణలో ఆశలు చిగురించాయి. 854 అడుగులకు నీటి మట్టం చేరితే రాయలసీమ రైతాంగానికి నీటిని విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేయొచ్చు. కాగా నాగార్జునసాగర్‌కు 17.25 టిఎంసి నీటిని విడుదల చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రను కోరింది. ఈ డిమాండ్‌ను ఆంధ్ర అంగీకరిస్తుందో లేదో చూడాలి. నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తే, అందులో నుంచి ఆంధ్రకు వెళ్లే నాగార్జునసాగర్‌కూ మంచినీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయాలని ఆంధ్ర షరతులు పెట్టనుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్ధకం.
ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో నీటినిల్వలు ఆశాజనకంగా లేవు. 500 అడుగుల వద్ద 116 టిఎంసి నీటినిల్వ ఉంది. ఇది డెడ్ స్టోరేజీకి దిగువున లభ్యమవుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఈ వర్షాలకు, ఎగువున కురుస్తున్న వర్షాలకు నిండుతుందనేది అనుమానమే. కాని ప్రస్తుతం ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలను విశే్లషిస్తే మరో 40 టిఎంసి నీరు ఈ నెలాఖరుకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలంగాణ సాగునీటి శాఖాధికారులంటున్నారు. నాగార్జునసాగర్ దిగువున ఆంధ్ర, తెలంగాణలోని అనేక ముఖ్య పట్టణాలు, హైదరాబాద్ నగరం మంచి నీటి అవసరాలకు సాగర్ డ్యాంపై ఆధారపడి ఉన్నాయి. శ్రీశైలంలో నీటిని నిల్వ ఉంచుకుని రెండు రాష్ట్రాలు వచ్చే వేసవి వరకు మంచినీటి అవసరాలను తీర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో రెండు రాష్ట్రాలు అర్ధవంతమైన చర్చలు జరిపి శ్రీశైలం డ్యాంలో నీటిని నిల్వ చేసుకుని రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ మంచి నీటి అవసరాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని వైకాపా సీనియర్ ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి చెప్పారు.
ఇదిలా ఉండగా కృష్ణా బోర్డు ఒకటి రెండు రోజుల్లో తదుపరి సమావేశం తేదీని ఖరారు చేయనుంది. ఈసారి హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహించనున్నారు. గతంలో అమరావతిలో నిర్వహించారు. 17 టిఎంసి నీటిని విడుదల చేయాలన్న తెలంగాణ డిమాండ్, శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం వచ్చే వరకు నీటిని విడుదల చేయరాదన్న ఆంధ్రప్రభుత్వ నిర్ణయం మధ్య కృష్ణా బోర్టు తీసుకునే నిర్ణయంపై రెండు ప్రభుత్వాలు వేచి చూస్తున్నాయి.

చిత్రం..జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం వైపు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ