రాష్ట్రీయం

పీఠంపై పావని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 16: కాకినాడ నగర పాలక సంస్థ మేయర్‌గా సుంకర పావని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కాళా భీమశంకర సుబ్రహ్మణ్యేశ్వర సత్తిబాబు ఎన్నికయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ హాలులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ మేరకు శనివారం ఉదయం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన 48 కార్పొరేటర్లు తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు కాకినాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎన్నికల ఇన్‌ఛార్జి, పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. అధినేత సూచించిన మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను కౌన్సిల్‌లో వెల్లడిస్తామని ప్రకటించారు. అనంతరం నగర పాలక సంస్థ కౌన్సిల్ హాలులో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. మేయర్ ఎన్నికకు అభ్యర్ధుల ప్రతిపాదనలను కలెక్టర్ ఆహ్వానించారు. మేయర్ అభ్యర్ధిగా తెదేపా 28వ డివిజన్ కార్పొరేటర్ సుంకర పావని పేరును 16వ డివిజన్ కార్పొరేటర్ మల్లాడి గంగాధర్ ప్రతిపాదించగా, ఆమె అభ్యర్ధిత్వాన్ని 1వ డివిజన్ కార్పొరేటర్ పేరాబత్తుల లోవబాబు బలపరిచారు. ఒక్క ప్రతిపాదనే రావడంతో సుంకర పావని కాకినాడ నగర మేయర్‌గా కలెక్టర్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 2వ డివిజన్ కార్పొరేటర్ కాళా భీమశంకర సుబ్రహ్మణ్యేశ్వర సత్తిబాబు అభ్యర్ధిత్వాన్ని 45వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శైలజ ప్రతిపాదించగా, 49వ డివిజన్ కార్పొరేటర్ పాలిక ఉషారాణి బలపరిచారు. ఇక్కడా ఒకే ప్రతిపాదన రావడంతో సత్తిబాబు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్టు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు పదవీ స్వీకారాన్ని చేపట్టారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపి తోట నరసింహం, ఎమ్మెల్సీ కె రవికిరణ్‌వర్మ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అధినేత నమ్మకాన్ని వమ్ము చేయను: మేయర్ పావని
పార్టీ అధినేత చంద్రబాబు నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని కాకినాడ మేయర్ సుంకర పావని చెప్పారు. మేయర్‌గా ఎన్నికైన అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయనని, తనను మేయర్‌గా నియమించేందుకు కారకులైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.

చిత్రం..మేయర్ పావనికి ఎన్నిక పత్రాలు అందజేస్తున్న కలెక్టర్