రాష్ట్రీయం

గీత రాత మారుద్దాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖను ఆదాయం సమకూర్చే శాఖగా పరిగణించడం లేదని, ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధన దిశగా కృషిచేయడం జరుగుతోందని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి జవహర్ అన్నారు. 13 జిల్లాల కల్లు గీత సొసైటీ ప్రతినిధులు, కల్లు గీత కార్మికులు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జవహర్ రాజమహేంద్రవరంలో శనివారం కొత్త కల్లు గీత విధానంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ ఒకటో తేదీనుంచి కొత్త కల్లు గీత విధానం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
కల్లు గీత కార్మికులకు పూర్తిస్థాయి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా శాస్ర్తియ పద్ధతిలో కల్లును నిల్వ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే కేరళ, మహారాష్టల్రో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు కొన్ని బృందాలను పంపిస్తున్నామన్నారు. కల్లు పులియకుండా నిల్వ చేయగలిగితే ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. ఇప్పటివరకు గీత కార్మికుడిని ఒక పరిధిలో ఉండే చెట్లకు మాత్రమే గీసుకునే అవకాశం వుండేదని, ఇపుడు కొత్త పాలసీలో పరిధి నియంత్రణ లేకుండా చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 85వేల మందికిపైగా గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. 13 జిల్లాల నుంచి కల్లు గీత కార్మికులు, సొసైటీల నుంచి ప్రతినిధులతో చర్చించి సమగ్ర కొత్త కల్లుగీత విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఎక్సైజ్ ఆదాయానికి లక్ష్యాన్ని నిర్దేశించకుండా గతంలో ఎన్నడూ లేనివిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. బెల్ట్ షాపులను రద్దు చేశామని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు షాపులను రహదారులకు ఇరువైపులా తొలగించామని, 600 మద్యం షాపులను ప్రతిపాదనల మేరకు మార్పు చేశామని చెప్పారు. కల్లుగీత కార్మికుల పింఛను విధానాన్ని మార్పు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు రూ. లక్ష వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉందని, చంద్రన్న బీమా పధకాన్ని వర్తింప జేసి రూ.5 లక్షల బీమా వర్తింపజేసేలా కృషి చేస్తామన్నారు. కర్నూలు జిల్లాలో ఈతకల్లుకు సూర్యరశ్మి తగిలేలోపే దానిని భద్రం చేసే శాస్ర్తియ విధానాన్ని అనుసరిస్తున్నారని, దీనివల్ల ఈతకల్లు నీరా మాదిరిగా నిల్వ వుంటుందని, తద్వారా అత్యధిక ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయన్నారు.
గంజాయి నిర్మూలనకు 500 మంది అధికారులతో స్పెషల్ టాస్క్ఫోర్స్ విభాగాన్ని నియమిస్తున్నామని మంత్రి జవహర్ ప్రకటించారు. ప్రస్తుతం గంజాయి విత్తనాలు జల్లే కాలమని, ఎఒబి పరిధిలోని ఆరు మండలాలను గుర్తించి రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాల వరకు గంజాయి సాగును ధ్వంసం చేయడం జరుగుతోందన్నారు. గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపామని, పిడి యాక్టులో కేసులు పెడుతున్నామన్నారు. గిరిజనులకు ఉపాధి లేకపోవడంవల్లే ఇటువైపు మళ్లుతున్నారనే విషయాన్ని గమనించి వారికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జీకే వీధి, చింతపల్లి, జి మాడుగుల, ముంచింగపు, పెదబయలు, హుకుంపేట, పాడేరు, అరకు, అనంతగిరి, దుంపిరిగొడి ప్రాంతాల్లో గంజాయి సాగు నిర్మూలకు చర్యలు చేపట్టామన్నారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జుత్తిగ నర్సింహమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎర్రా దేవుడు, కల్లుగీత కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనుం శ్రీనివాసరావు, కార్యదర్శి అంగడి రాము, శ్రీకాకుళం జిల్లా సొసైటీ అధ్యక్షుడు దుబ్బా కోటేశ్వరరావు తదితరులతోపాటు ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీ నర్సింహం, డిప్యూటీ కమిషనర్ అరుణారావు, ఒఎస్‌డి నాగేశ్వరరావు, ఇఎస్ సుర్జీత్ సింగ్, ఎసి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కొత్త కల్లు గీత విధానంపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి జవహర్