రాష్ట్రీయం

మన్యానికి మణిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 26: ఆంధ్ర, ఒడిశా బోర్డర్ (ఎఒబి)ను ఆనుకుని ఉన్న మూడు జిల్లాలను అనుసంధానిస్తూ కేంద్రం కొత్తగా ఒక జాతీయ రహదారిని మంజూరుచేసింది. ఈ రోడ్డు తూర్పు గోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో తొలి జాతీయ రహదారి కావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ రహదారి నిర్మాణం వల్ల మన్య ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు అనుసంధానమవుతాయి. దీంతో ఆదివాసీల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ప్రధానంగా పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. సహజసిద్ధ అందాలను తిలకిస్తూ ఈ జాతీయ రహదారి ప్రయాణం ఒక మధురానుభూతిని మిగిల్చేలా దట్టమైన అడవులను తాకుతూ జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి డిపిఆర్ సిద్ధమైంది. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఫోర్ లేన్లుగా నిర్మించే ఈ రహదారి నిర్మాణానికి రూ.2000 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఈమేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిధులు మంజూరుచేసింది. ఈ రోడ్డు నిర్మాణం వల్ల సహజసిద్ధ అందాలతో అలరారే మన్యంలో పర్యాటక అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి మంగళవారం రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో అధికార్లతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఏజెన్సీలో ప్రస్తుతం ఉన్న రెండు లేన్ల రోడ్లను జాతీయ రహదారిగా విస్తరిస్తారు. మొత్తం 418 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ రోడ్డు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 120 కిలోమీటర్లు, విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 298 కిలోమీటర్ల మేర సాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నుంచి మొదలయ్యే ఈ జాతీయ రహదారి గోకవరం, రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మీదుగా విశాఖ జిల్లా పరిధిలో చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకు, ఎస్ కోట మీదుగా విజయనగరం జిల్లాలోకి వెళుతుంది. పాడేరు, అరకు, చింతపల్లి, లంబసింగి, అడ్డతీగల, రాజవొమ్మంగి వంటి దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా ఈ జాతీయ రహదారి సాగుతుంది. ఈ నేపథ్యంలో పర్యాటకంగా ఈ ప్రాంతం మైదాన ప్రాంతంతో అనుసంధానమై శరవేగంగా అభివృద్ధి చెందేందుకు అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో ఏజెన్సీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడుతుందంటున్నారు. ఇటు పర్యాటకపరంగానూ, అటు వ్యవసాయ ఉత్పత్తుల పరంగానూ అభివృద్ధి జరిగి, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అంచనా. ప్రధానంగా ఎఒబిలోని మావోల ప్రాబల్యానికి ఈ రహదారి నిర్మాణంతో విఘాతం కలుగుతుందని, బాహ్య ప్రాంతాలతో సంబంధాలు మెరుగుపడితే అలవోకగా ఈ ప్రాంతం అన్నల ప్రాబల్యం నుంచి బయటపడే అవకాశముటుందని జాతీయ రహదారి మన్యం మీదుగా నిర్మించే ఆలోచన జరిగిందని తెలుస్తోంది.
ఇదిలావుండగా 16వ నెంబరు జాతీయ రహదారిపై ఆరు ఫ్లై ఓవర్లు నిర్మించనున్నామని, త్వరలో ఈ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు దాదాపు 67 కిలోమీటర్ల రోడ్డును తనిఖీ చేశామని చెప్పారు. ఈ హైవే పూర్తిగా శిథిలమైందని, రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని చెప్పారు. ఈ రోడ్డు మరమ్మతు నిమిత్తం రూ.4 కోట్ల నిధులు మంజూరుచేశామని మంత్రి చెప్పారు. మొత్తమీద తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం నుంచి విశాఖ, విజయనగరం జాతీయ రహదారి నిర్మించడంవల్ల ఇటు తూర్పు, అటు విశాఖ, మరోవైపు విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందంటున్నారు.