రాష్ట్రీయం

వరల్డ్ టాపర్ ఏపీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 6: సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ఏపీ ఘనతను అంతర్జాతీయ కంపెనీలు గుర్తించాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పనిచేస్తూ అంతర్జాతీయ ఖ్యాతిపొందిన సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థలు ఏపీలోని సోలార్ పార్కులపై ఆసక్తి చూపుతున్నాయి. సంప్రదాయేతర విద్యుదుత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (ఎన్‌ఆర్డీసీ) కర్నూలులోని 1000 మెగావాట్ల సోలార్ పార్కుపై అధ్యయనానికి సిద్ధమైంది. సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రయోజనాలను చాటిచెప్పడమే ఈ అధ్యయన లక్ష్యమని అధికారులు అంటున్నారు. ఎన్‌ఆర్డీసీ డైరెక్టర్ జైస్వాల్ తన బృందంతో శుక్రవారం ఇంధన మంత్రి కళా వెంకట్రావును కలిశారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని సోలార్ హబ్‌గా మార్చే ఉద్దేశ్యతో ఉన్నారని మంత్రి కళా వెంకట్రావు ఎన్‌ఆర్డీసీ బృందానికి తెలిపారు. దీంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాలను ఐదు శాతం దిగువకు తగ్గించడమే లక్ష్యంగా మైక్రో గ్రిడ్ వ్యవస్థ నిర్మాణంపైనా సిఎం దృష్టి పెట్టారని వివరించారు. ఆ ప్రయోజనాలతో రైతులకు పగలే 7 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారన్నారు. మైక్రో పవర్‌గ్రిడ్ వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలకూ ప్రయోజనమేనని ప్రభుత్వం గుర్తించింది. కాగా సోలార్, పవన విద్యుదుత్పత్తికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని జైస్వాల్ అభినందించారు. ఆంధ్రను దేశంలోనే సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో అగ్రగామిగా మార్చుతున్నట్లు మంత్రి ఆయనకు వివరించారు. మొత్తం 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుండడమే ఇందుకు తార్కాణమన్నారు. వీటిలో ఇప్పటికే కర్నూలులోని 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పూర్తయిందన్నారు. దీన్ని రికార్డు స్థాయిలో కేవలం 24 నెలల్లోనే నిర్మించామన్నారు. మిగిలిన సోలార్ పార్కుల్లో అనంతపురం జిల్లాలోని 1500 మెగావాట్ల అనంతపురం-2 అల్ట్రా మెగా సోలార్ ప్లాంటును కూడా త్వరలో పూర్తిచేస్తామన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను సరసమైన ధరలకు సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పర్యావరణానికి నష్టం చేయని సోలార్, పవన విద్యుదుత్పత్తిని అందుకే ప్రోత్సహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి దార్శనికతవల్ల ఆంధ్రప్రదేశ్ సౌర, పవన విద్యుత్ రంగంలో జాతీయ చాంపియన్‌గా నిలిచిందన్నారు. సోలార్ పంపుసెట్ల విషయంలోనూ తమది జాతీయ రికార్డుగా చెప్పారు. ఇప్పటివరకూ 15,109 సోలార్ పంపుసెట్లు అమర్చామని మంత్రి కళా వెంకటరావు వివరించారు. దీనిపై స్పందించిన జైస్వాల్ సమర్థ ఇంధన వినియోగం, ఇంధన పరిరక్షణ, సౌర, పవన విద్యుత్‌ను ప్రోత్సహించడంలో సిఎం చంద్రబాబు అమలు చేస్తున్న విధానాలు ప్రశంసనీయంగా ఉన్నాయన్నారు. కర్నూలు జిల్లాలో ఒకేచోట వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్దదని, దీని తరువాతి స్థానంలో చైనాలోని లోంగ్యాగ్జియాలో మాత్రమే 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఉందని జైస్వాల్ అన్నారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రొఫెసర్ రాజ్‌కిరణ్‌తో కలిసి ఇంధన, ఐ అండ్ ఐ, సిఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌ను జైస్వాల్ కలిశారు. మెక్సికో, కాలిఫోర్నియా, చైనాల్లో ఉన్న ఎన్‌ఆర్డీసీ సంస్థలను సందర్శించాలని ఆయనను ఆహ్వానించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌లో 20 శాతం సంప్రదాయేతర విద్యుదుత్పత్తితోనే తీరుతోందని ఈసందర్భంగా అజయ్ జైన్ తెలిపారు. మొత్తం డిమాండ్ 55వేల మిలియన్ యూనిట్లు ఉండగా, 11వేల మిలియన్ యూనిట్లు సంప్రదాయేతర విద్యుదుత్పత్తి ద్వారా తీరుతోందని వివరించారు. మూడేళ్లలో ఈ రంగంలో రూ.30,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 1,994 మెగావాట్ల సోలార్, 3,038 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన జరిగిందని చెప్పారు. జైస్వాల్‌కు కర్నూలు సోలార్ పార్క్‌ను చూపించాల్సిందిగా సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండి ఆదిశేషుకు సూచించారు. ఎన్‌ఆర్డీసీ బృందం శనివారం ఈ సోలార్ ప్లాంట్‌ను సందర్శించే అవకాశం ఉంది. కర్నూలులోని సోలార్ పార్కు రూ.7వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటైందని, 2,500 మందికి ఉపాధి కల్పించిందని, ఏటా సుమారు 2100 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని ఏపి ట్రాన్స్‌కో సిఎండి, ఏపి జెన్కో ఎండి, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఈసందర్భంగా తెలిపారు. దీనివల్ల కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయన్నారు. తద్వారా పర్యావరణానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు.