రాష్ట్రీయం

గోదావరి సార్థకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 7: సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాలు ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి జిల్లాల్లో సాగును సస్యశ్యామలం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 71.653 టిఎంసి జలాలు వినియోగించారు. రోజుకు సరాసరిగా సుమారు 8400 క్యూసెక్కుల
చొప్పున పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను తోడి కృష్ణా ఆయకట్టుకు అందిస్తున్నారు. దీంతో కృష్ణా, పశ్చిమ గోదావరిలో సాగు విస్తీర్ణం పెరిగింది. అఖండ గోదావరి కుడి, ఎడమగట్లవైపు ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా ఖరీఫ్‌లో సాగునీరు అందిస్తున్నారు. ఎత్తిపోతల పధకాలను సందర్శించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు ఛైర్మన్ హెచ్‌కె సాహు నేతృత్వంలో నిపుణుల బృందం పట్టిసీమ, పుష్కర ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. పురుషోత్తపట్నం మొదటి దశ నీటి సరఫరా విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బోటుపై వెళ్లి పోలవరం పనులనూ పరిశీలించింది. ఉభయ గోదావరి జిల్లాలోని 12 ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు విస్తీర్ణం పెరిగిందని కమిటీ నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం. చాగల్నాడు, వెంకటనగరం, పుష్కర, పురుషోత్తపట్నం, తొర్రిగడ్డ పథకాల ద్వారా 40 టిఎంసి జలాలను వినియోగించుకోవడం వల్ల సాగు విస్తీర్ణం ఏటికేడాది పెరుగుతోంది. ఇందులో పుష్కర ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి ఆయకట్టు అందుబాటులోకి రాలేదు. అదేవిధంగా వెంకటనగరం-2 పథకంలో కూడా సాగు విస్తీర్ణం నిర్ధేశిత లక్ష్యం మేరకు అందించాల్సి వుంది. దీంతో ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు విస్తీర్ణం వచ్చే ఏడాది మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరుకు గోదావరి జలాలు అనుసంధానం జరిగి ఏలేరు ఆయకట్టు కూడా స్థిరీకరణ జరుగుతోంది. ఎత్తిపోతల పథకాల ద్వారా మరింత సాగు పెంచేందుకు పురుషోత్తపట్నం పథకంలో వినియోగించిన మోటార్లు, పంపులు ఎక్కడికి కావాల్సిస్తే అక్కడకు తీసుకెళ్లేలా ఆధునిక సాంకేతిక సామాగ్రిని ఏర్పాటు చేశారు. పట్టిసీమ యంత్రాలనూ అవసరమైన చోటకు తరలించవచ్చు. 12 టిఎంసి నీటిని పోలవరం ఎడమ కాలువ ద్వారా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి ఏలేరుకు పంపించేందుకు చర్యలు చేపట్టారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి తూర్పు డెల్టాకు 1800 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు 2200 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 3000 క్యూసెక్కుల సాగు జలాలను విడుదల చేశారు. ఏదేమైనప్పటికీ ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది సాగు జలాలు సవ్యంగానే అందాయని చెప్పాలి.

చిత్రం..అఖండ గోదావరి ఎడమ గట్టుపై పురుషోత్తపట్నం వద్ద ఉన్న పుష్కర ఎత్తిపోతల పథకం