రాష్ట్రీయం

సింగిల్ విండో.. సినిమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్‌తో పాటు షూటింగ్‌ల కోసం సింగిల్ విండో అనుమతులను అందించే ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభించినట్టు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలో ఆయన లాంఛనంగా టిఎస్ బాక్సాఫీస్ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ మంత్రులతో సబ్ కమిటీ వేసిందని, వారికి ఉపయోగపడే ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని అన్నారు. చిన్న చిత్రాల ప్రోత్సాహానికి ఐదో ఆట ప్రదర్శించేందుకు అనుమతి ఇస్తున్నామని అన్నారు. ఇందుకు సంబంధించిన జీవోలను ఒకటి రెండు రోజుల్లో ఇస్తామని చెప్పారు. సినిమా షూటింగ్‌లకు వివిధ శాఖల నుండి అనుమతులకు నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టిఎస్‌ఎఫ్‌డి ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకుంటే ఏడు రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు అవుతాయని చెప్పారు. ఏడు రోజుల లోపు అనుమతి రాకపోతే వచ్చినట్టు పరిగణించి షూటింగ్‌లు ప్రారంభించుకోవచ్చని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిలింస్టూడియో నిర్మాణానికి సంబంధించిన స్థలం ఎంపిక దీపావళి తర్వాత జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌లలో మినీ థియేటర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని ఆయన వెల్లడించారు. సినీ అవార్డుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె వి రమణాచారి అధ్యక్షతన కమిటీ సమావేశమైందని, మార్గదర్శకాలను తయారుచేసి ముఖ్యమంత్రి అనుమతితో నిర్వహిస్తామని అయన తెలిపారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ రెండు మంచి కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని అన్నారు. ఎఫ్‌డిసి చైర్మన్ రాం మోహన్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ అభివృద్ధికి అనేక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోందని చెప్పారు. ఎండి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ దేశంలో అత్యుత్తమ విధానాన్ని ప్రారంభించామని అన్నారు. ఆన్‌లైన్ అనుమతులకు సంబంధించి ప్రతి శాఖలో ఒక నోడల్ అధికారి ఉంటారని, వీరు వారంలో అనుమతుల ప్రక్రియ పూర్తి చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జెఎండి కిశోర్ బాబు, హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ టి మురళీకృష్ణ, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ షాన్‌వాజ్ ఖాసిం, సినీ ప్రముఖులు దిల్ రాజు, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్‌ను ప్రారంభిస్తున్న మంత్రి తలసాని