రాష్ట్రీయం

రోహిత్ కులమేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్ కుల వివాదంపై వాస్తవాల పరిశీలనకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నేరుగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోహిత్ ఎస్సీ కులానికి చెందిన వారేనా? కాదా? అనే అంశంపై వాస్తవాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. రోహిత్ ఎస్సీ కులానికి చెందినవారే అయితే ఒక సమస్య పరిష్కారమైనట్టే. ఒకవేళ వడ్డెర కులమని తేలితే కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వైస్ ఛాన్సలర్ అప్పారావులపై పెట్టిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులు తొలగించాల్సి ఉంటుంది. రోహిత్ ఆత్మహత్య కేసు దర్యాప్తునకు కుల ధృవీకరణ అంశం కీలకమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా వ్యవహరిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగనుండటంతో అధికారపక్షం నేతలు ఈ వివాదానికి దూరంగా ఉన్నారు. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులు సైతం తమకెలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. కాగా కేంద్రం ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసు బృందం గుంటూరు జిల్లా గురజాల వెళ్లి రోహిత్ తాత, నానమ్మలతో మాట్లాడి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించినట్టు సమాచారం.
నాలుగోరోజూ అదే పరిస్థితి
కాగా నాలుగో రోజూ హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ అట్టుడికింది. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, దత్తాత్రేయను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, విసిని బర్త్ఫ్ చేయాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ రోహిత్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయిలు పరిహారం అందజేయనున్నట్టు ప్రకటించింది. ఆ పార్టీ నాయకులు రోహిత్ కుటుంబీకులను కలిసి విషయాన్ని వెల్లడించారు. మరోపక్క వైకాపా నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్రీయ విశ్వ విద్యాలయాన్ని సందర్శించి వాస్తవ పరిస్థితిని సహ విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఇదిలావుంటే, రోహిత్ మరణంపై ఆందోళన మరింత ఉధృతం చేసేందుకు విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. రోహిత్ మరణంపై రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణ కార్యక్రమానికి విద్యార్థి సంఘాల నాయకులు సన్నద్ధమవుతున్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

చిత్రం... రోహిత్ ఆత్మహత్య ఘటనపై దర్యాప్తునకు ముందే మంత్రి బండారు దత్తాత్రేయ, వర్శిటీ విసిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల ఆందోళన

స్మృతి ఇరానీపైనా కేసు పెట్టాలి

రోహిత్‌ది ఆత్మహత్య కాదు, హత్యే
ముగ్గురిపై క్రిమినల్ కేసులు
విద్యార్థుల ఆందోళనకు సీతారాం ఏచూరి సంఘీభావం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రీసెర్చి స్కాలర్ రోహిత్‌ది ఆత్మహత్య కాదని, అది హత్యేనని సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం ఆయన సెంట్రల్ యూనివర్శిటీ ప్రాంగణానికి వచ్చి రోహిత్ సహ విద్యార్థులను కలిసి ఆత్మహత్య పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణం అక్కడి పరిస్థితులేనని, అందుకు వర్శిటీ పాలకులు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. వర్శిటీ విసి తీరు వల్లనే నేడు రోహిత్ ఆత్మహత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయని అన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సీతారం ఏచూరి సంఘీభావం వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు పురిగొల్పిన వారిపై కొత్తగా రూపొందించిన చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టాలని అన్నారు. కేంద్ర మంత్రుల ఒత్తిడి వల్లనే పాత ఫైలును రీ ఓపెన్ చేశారని చెప్పారు. తాను ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదని, కేవలం ఈ క్యాంపస్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించడానికి వచ్చానని తెలిపారు. రోహిత్ మృతి చాలా బాధాకరమని, రోహిత్‌ది ఆత్మహత్య కాదని, అది హత్యేనని స్పష్టం చేశారు. యూనివర్శిటీల్లో వైస్ ఛాన్సలర్ సాంఘిక బహిష్కరణ విధించడం ఎన్నడూ చూడలేదని, తాను కూడా హైదరాబాద్‌లో చదువుకున్న వాడినేనని అన్నారు. యూనివర్శిటీలో ఇంత వరకూ 12 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నా కేంద్రం స్పందించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వీసీలపై కేసులు నమోదుచేయాలని అన్నారు.

విద్యార్ధుల సమస్యలపై జరిగే పోరాటానికి తమ మద్దతు ఎపుడూ ఉంటుందని, పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. ప్రధాని విదేశీ టూరిస్టుగా మారారని విమర్శించారు. రోహిత్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. యూనివర్శిటీలో కొత్త విసి వచ్చిన తర్వాత పరిస్థితులు మారకపోగా మరింత దిగజారిపోయాయని , రాష్టప్రతి ఉత్తమ యూనివర్శిటీగా ప్రకటించిన హెచ్‌సియులో పరిస్థితులు ఇలా ఉండటం ఏమిటని అన్నారు. యూనివర్శిటీ వ్యవహారాల్లోనే ఏదో లోపం ఉందని సీతారాం ఏచూరి చెప్పారు.

వర్శిటీ వ్యవహారాల్లో
జోక్యం చేసుకోలేదు
బండారు దత్తాత్రేయ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, దాని పాలనా వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకునే వీలుండదని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు తన లేఖలే కారణమని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి ఖండించారు. యూనివర్శిటీలో జరుగుతున్న ఘటనలపై విద్యార్ధి సంఘాలు తన దృష్టికి తెచ్చినపుడు వాటిని తాను సంబంధిత శాఖ మంత్రికి పంపించానని, అంతే తప్ప ఎవరిపైనా ఒత్తిడి అనేది తీసుకురాలేదని అన్నారు. రోహిత్ ఆత్మహత్య తననూ కలచివేసిందని, తాను దిగ్భ్రమ చెందానని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రోహిత్ కుటుంబ సభ్యులకు సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. యూనివర్శిటీలో పరిస్థితులు మారాలని మాత్రమే తాను సూచించానని, మరోమారు ఎబివిపి నేతలు తనకు లేఖ రాయడంతో దానిని కూడా తాను సంబంధిత మంత్రికి పంపించానని పేర్కొన్నారు. తాను ప్రభావితం చేశాననే మాటకే తావు లేదని చెప్పారు.

కొట్టేసిన వాక్యాల్లో ఏముందో...
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు రోహిత్ సూసైడ్‌నోట్
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
రెండవ దశలోనే నిందితుల విచారణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫిబ్రవరి ఒకటి లోగా విద్యార్థి ఆత్మహత్యపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్డీ సైబరాబాద్ కమిషనర్‌కు, యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌ను ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు బుధవారం సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న రోహిత్ ఆ లేఖలో ఏ విద్యార్థిసంఘం పేరును పేర్కొనకపోవడంపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. రోహిత్ సూసైడ్ నోట్‌లోని చివరివాక్యం అసంపూర్తిగా ఉండటాన్నికూడా వారు పరిశీలిస్తున్నారు. సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షలకోసం పంపామని, అందులో కొట్టేసిన పదకొండు లైన్లలో ఏముందోనన్నదికూడా విశే్లషిస్తారని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. రోహిత్ చేతి రాత ప్రతిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారని, సూసైడ్ నోట్‌లో రాత అతనిదా కాదా అన్నది పరిశీలిస్తారని చెప్పారు.
దర్యాప్తులో ఏ అవకాశాన్ని వదలమని, అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. యూనివర్శిటీ నుంచి సస్పెన్షన్‌కు గురైన విద్యార్థుల్లో ఒకరైన దొంత రమేష్ ఫిర్యాదు మేరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, వైస్ చాన్సలర్ పి అప్పారావు, బిజెపి ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఎబివిపి నేత సుశీల్‌కుమార్, కృష్ణచైతన్యలపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. విద్యార్థుల సస్పెన్షన్‌పై కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఎన్‌హెచ్‌ఆర్డీకి రాసిన లేఖను కూడా పరిశీలిస్తున్నామని, అదేవిధంగా యాకూబ్ మెమన్ ఉరితీతపై విద్యార్థులు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. విద్యార్థి చదువుతున్న యూనివర్శిటీలోని రికార్డులను కూడా పరిశీలించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఎబివిపి విద్యార్థి సుశీల్‌కుమార్‌పై అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ దాడికి పాల్పడిన అంశాన్ని, ఆ విద్యార్థి ఆసుపత్రిలో చేరిన అంశంపై కూడా విచారణ జరపనున్నారు. యూనివర్శిటీలో వైస్ చాన్సలర్ వ్యవహరిస్తున్న తీరు, విద్యార్థుల సస్పెన్షన్ వ్యవహారంలో పూర్తి స్థాయి విచారణ అనంతరమే ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన వారిపై విచారణ జరిపే అవకాశం ఉంది.

బాధ్యులపై చర్యలు తీసుకోండి

రోహిత్ ఆత్మహత్యపై జగన్ ధ్వజం మిగిలిన వారిపై సస్పెన్షన్ తొలగించాలని డిమాండ్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య ఘటనతో మానవత్వం మాయమైపోయిందనిపిస్తోందని వైకాపా నేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై తగిన చర్యలు చేపట్టడంతో పాటు ఇప్పటికీ బహిష్కరణలో ఉన్న మిగిలిన విద్యార్ధులకు స్వేచ్ఛ కల్పించాలని జగన్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం సెంట్రల్ యూనివర్శిటీకి వచ్చిన జగన్ విద్యార్ధి సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సియు విద్యార్ధుల ఉద్యమానికి జగన్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన రోహిత్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ హెచ్‌సియులో జరిగిన ఘటనలపై సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సైతం తమని తాము ప్రశ్నించుకోవాలని అన్నారు. రోహిత్‌పై చర్యలు తీసుకోవాలని విసికి లేఖలు మీద లేఖలు రాయడం దేనికి సంకేతమని అన్నారు. రోహిత్ చాలా తెలివైన విద్యార్ధి అని, అతనిది చాలా పేద కుటుంబమని, రోహిత్ తల్లి ఎన్నో ఆశలతో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నుండి అతడిని ఉన్నత చదువులు చదివించడానికి హైదరాబాద్ వచ్చారన్నారు. రోహిత్ ఎస్సీనా కాదా అని ప్రచారం చేయడంలో అర్ధం ఏమిటని అన్నారు. చనిపోయిన తర్వాత కులంపై రాద్ధాంతం ఎందుకన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలూ చేపట్టాలని జగన్ పేర్కొన్నారు.

సామాజిక బహిష్కరణ అనేది ఏ దృష్టితో చూసినా సరికాదని, ఈ తరహా ఘటనలను తాము తీవ్రంగా ఖండిస్తామని అన్నారు.

మొత్తం జరిగిన ఘటనను మార్చే ప్రయత్నం కొంతమంది చేయడం సరికాదని అన్నారు. విచారణలో మంచి పేరున్న వారిని సభ్యులుగా వేయలేదని, చిన్న ఉద్యోగులతో కమిటీ వేయడం వల్ల ప్రయోజన.ం ఏమిటో కేంద్రమే చెప్పాలని అన్నారు. విద్యార్థులను విద్యార్థులుగా ఉండనివ్వడం లేదని, రోహిత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. విద్యార్థుల ఉద్యమానికి తమ మద్దతు ఎపుడూ ఉంటుందని, తక్షణం విద్యార్థుల డిమాండ్లను పరిశీలించాలని అన్నారు. తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారని తెలిపారు.

ఉద్యోగాలు ఇస్తాం

రోహిత్ తల్లి, సోదరుడికి సర్కారీ కొలువులు
ఐదు లక్షల ఆర్థిక సాయం ఏపి మంత్రుల ప్రకటన

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: సెంట్రల్ యూనివర్శిటీ రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య సంఘటనపై నిజ నిర్ధారణ కమిటీ నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ విసి పదవి నుండి స్వచ్ఛందంగా తప్పుకోవాలని ఏపి మంత్రులు పీతల సుజాత, రావెల కిషోర్‌బాబు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్‌రావు, ఎస్సీ సెల్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఉప్పల్ ఎస్‌బిహెచ్ కాలనీలో నివాసముంటున్న రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజాను వారు బుధవారం పరామర్శించారు. రోహిత్ మృతి తమను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ సోదరుడు రాజాకు కాంట్రాక్ట్ పద్ధతిపై లెక్చరర్ ఉద్యోగం ఇస్తామని, అతని తల్లికి కూడా ఉద్యోగం కల్పిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టిడిపి తరపున రూ.5లక్షలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు కళా వెంకట్‌రావు ప్రకటించారు.
సమన్యాయం ఎక్కడ?: పాశ్వాన్
విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థులకు సమన్యాయం లభించడంలేదని దళిత సేన జాతీయ అధ్యక్షుడు, ఎంపి రాంచంద్ర పాశ్వాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై స్పందిస్తూ హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఉప్పల్ ఎస్‌బిహెచ్‌కాలనీలోని రోహిత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై సిబిఐ విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి: ఏచూరి
పీహెచ్‌డి విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, వైస్ చాన్సలర్ అప్పారావు తక్షణమే పదవుల నుండి వైదొలగాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉప్పల్ ప్రశాంతినగర్ కమ్యూనిటీ హాల్‌లో రోహిత్ కుటుంబీకులను పరామర్శించారు. రోహిత్ ఘటన దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నా విసి విశ్వవిద్యాలయాన్ని సందర్శించకపోవడం శోచనీయమని అన్నారు.

నాలుగో రోజూ నిరసనలు

రోహిత్‌కు నివాళులు... నేతల పరామర్శలు నిరసనలు ఆపాలి: సెంట్రల్ వర్శిటీ డీన్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నాలుగో రోజూ విద్యార్ధుల నిరసనలతో దద్దరిల్లిపోయింది. పలు పార్టీల నేతలు యూనివర్శిటికి వచ్చి రోహిత్ స్థూపం వద్ద నివాళులు అర్పించి చిత్రపటానికి పూలమాలలు వేశారు. నాయకులు అంతా విద్యార్థులతో మాట్లాడి కారణాలను తెలుసుకున్నారు. సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, వైకాపా నేత జగన్మోహన్‌రెడ్డి, టిడిపి నేత జూపూడి ప్రభాకర్ తదితరులు క్యాంపస్‌కు వెళ్లారు. కాగా క్యాంపస్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అంతా సహకరించాలని డీన్ ప్రకాష్‌బాబు కోరారు. విద్యార్ధులతోనూ, పాలనా సిబ్బందితో మాట్లాడుతున్నామని మిగిలిన విద్యార్ధులపై ఉన్న సస్పెన్షన్ తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అలాగే రోహిత్ కుటుంబానికి పరిహారం అందించేందుకు కూడా తమ వంతు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కాగా యూనివర్శిటీని కొద్ది రోజుల పాటు మూసివేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కాదని చెప్పారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరగలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, హైకోర్టులో విద్యార్ధుల సస్పెన్షన్‌కు సంబంధించి ఉన్న కేసు విచారణకు రాలేదని వర్శిటీ వర్గాలు స్పష్టం చేశాయి.

గురజాలలో హైదరాబాద్ పోలీసులు

రోహిత్ బంధువుల విచారణ

గురజాల, జనవరి 20: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రీసెర్చ్ విద్యార్థి వేముల రోహిత్ బంధువులను బుధవారం గుంటూరు జిల్లా గురజాలకు వచ్చిన హైదరాబాద్ పోలీసులు విచారించారు. రోహిత్ ఎస్సీనా, బీసీనా అనే అంశంపై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు రోహిత్ స్వగ్రామమైన గురజాలలో హైదరాబాద్‌లోని మాదాపూర్ ఏసీపీ రమణకుమార్ సిబ్బందితో విచారణ సాగించారు. పట్టణంలోని శ్రీదేవి రైస్‌మిల్లు సమీపంలో నివసిస్తున్న రోహిత్ తండ్రి వేముల మణికుమార్, తాత వెంకటేశ్వర్లు, నాయనమ్మ రాఘవమ్మలను కలిసి కులం గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాము వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారమని, బీసీలమని రోహిత్ బంధువులు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.

మంత్రి ఇల్లు ముట్టడికి
ఎఐఎస్‌ఎఫ్ యత్నం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై రోజురోజుకూ నిరశనలు పెల్లుబుకుతున్నాయి. బుధవారం వరుసగా రెండో రోజు రాంనగర్‌లోని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించేందుకు యత్నించిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దత్తన్నపై విపక్షాల గురి

సమర్థించుకునే ప్రయత్నంలో బిజెపి నేతలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 20: సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారం బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు తలనొప్పిగా మారింది. ప్రతిపక్షాలన్నీ ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. కాగా రోహిత్ దళితుడా? కాదా? అనే అంశంపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజా రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాఉండగా రోహిత్ ఆత్మహత్య చేసుకోవడంపై ఎపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఏపిసిసి ప్రధాన కార్యదర్శి సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.
రోహిత్ ఆత్మహత్యపై రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టిడిపి, టిఆర్‌ఎస్ పాలకుల వైఖరేమిటీ? అని టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు ఏమీ పట్టనట్లుగా వౌనంగా ఉంటున్నారని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడ్ని చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ వడ్డెర కులం అని స్వయంగా రోహిత్ నానమ్మ మీడియాకు చెప్పిందని పద్మజారెడ్డి తెలిపారు. ఈ ఘటనపై రాజకీయం చేయవద్దని ఆమె అన్ని పార్టీలను కోరారు. బిజెపి ఏపి శాఖ యువమోర్చా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విపక్షాలు కేంద్ర మంత్రి దత్తాత్రేయపై కక్షపూరితంగా విమర్శలు చేస్తున్నాయని అన్నారు.