రాష్ట్రీయం

రోహిత్‌ను చంపి ఉరేసుంటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: చదువుల్లో ఎంతో ఉన్నతంగా రాణిస్తున్న తన కుమారుడు రోహిత్‌ను ఉద్దేశపూర్వకంగా ఎవరో హతమార్చి ఉరివేసి ఉంటారని తండ్రి, గుంటూరు జిల్లాకు చెందిన వేముల మణికుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకంపనాలు సృష్టిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్ మృతిపై స్వయంగా తండ్రి పలు అనుమానాలు రేకెత్తించడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది. వడ్డెర కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రోహిత్ తండ్రి మణికుమార్ మంగళవారం నగరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ తనతో పాటు మరో నలుగురితో కలిసి నిరాహారదీక్ష చేస్తుండగా వారిలో తన కుమారుడు ఒక్కడే శిబిరం నుంచి వెలుపలకు వెళ్లి గదిలో ఉరేసుకుని బలవన్మరణం చెందాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. వాస్తవానికి తన కుమారుడు అంతటి పిరికివాడు కాదన్నారు. నిజంగా ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తే సమస్య పరిష్కరించాలనే తపనతో పలువురి ఎదుటే నడిరోడ్డుపై పెట్రోలు పోసుకుని సజీవ దహనమయ్యేవాడన్నారు. తన కుమారుడి మనస్తత్వం ఏమిటో తనకు బాగా తెలుసన్నారు. వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోదలిస్తే మొత్తం ఐదుగురూ కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండేవారు కదా అన్నారు. సంఘటన అనంతరం సస్పెన్షన్లు ఎత్తివేయటంతో నలుగురూ పత్తాలేకుండా పోయారన్నారు. రోహిత్ శవం వున్నప్పుడు ఏ ఒక్క నాయకుడూ వచ్చి తమను పరామర్శించిన పాపాన పోలేదని, బూడిదైన తరువాత విమానంలో వచ్చి కంటతడి పెట్టటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రోహిత్ మరణాన్ని ఎవరికి వారు తమ రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలతో ఉద్యమాలకు వాడుకుంటున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రోహిత్ మరణంపై సిబిఐ విచారణ జరిపినప్పటికీ ప్రయోజనం వుండదని, ఆ సంస్థ ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీకి వత్తాసు పలుకుతుందన్నారు. అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మణికుమార్ డిమాండ్ చేశారు. రోహిత్ రాసినట్టుగా చెబుతున్న లేఖలో పలు కొట్టివేతలుండటం మరింత అనుమానం కలిగిస్తుందన్నారు. తన భార్య రాధిక దళితులుగా చెప్పుకుంటున్న వాదన సరైనది కాదని, ఆమె తల్లిదండ్రులు కూడా వడ్డెరలేనని, తల్లి గుంటూరులో మున్సిపల్ స్కూల్‌లో ఉపాధ్యాయిని కాగా తండ్రి నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేసి ఇటీవల కాలంలో మరణించారన్నారు. తన భార్య అమాయకురాలని, అయితే తన అత్త మహా తెలివిగలదంటూ ఆమె ప్రోద్భలంతోనే ఎస్సీ సర్ట్ఫికెట్లు సృష్టించుకొని వుండవచ్చన్నారు. మతం మార్చుకోకుండా కులం మార్చుకోవడంలో చాలా తెలివిగా ప్రవర్తించారని ప్రస్తుతం తాము బిసి-ఎ గ్రూపులో వుండగా అందుకే క్రైస్తవ మతం తీసుకుంటే బిసి-సిలోకి వెళ్లేవారని అందుకే ఏకంగా కులానే్న మార్చుకోవటం జరిగి ఉండవచ్చునన్నారు. ఒకదశలో మణికుమార్ ఏమి మాట్లాడుతున్నాడో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. కుమారుడిని కోల్పోయానని బాధతో వున్నానని ఒకసారి, వాస్తవాలు తెలియాలి మినహా తనకెలాంటి ఆర్ధిక సహాయం వద్దని, ప్రభుత్వం ఆర్ధిక సహాయం ఇస్తే తీసుకుంటానని మరోసారి చెప్పారు. పదేళ్ల క్రితం తమ భార్యాభర్తలు మధ్య వివాదాలు రాగా విడాకులు అడగ్గా ఆలోచించకుండా విడాకులు ఇచ్చానని, అయితే కొద్దికాలానికే పిల్లల కోసమంటూ తన దరిచేరగా విడాకులు చించిపారేసానని అప్పటి నుంచి ఇటీవల కాలం వరకు సహజీవనం సాగించానన్నారు. తనకు దూరంగా ఉంటున్నట్టు తన భార్య చెబుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు. కొద్దిరోజుల వరకు కూడా తామిద్దరం కలిసి గుంటూరు సమీపంలో వెంగళాయపాలెంలో అద్దె ఇంట్లో నివసించటం జరిగిందన్నారు. ఎవరైనా వచ్చి విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. రెండు నెలల క్రితం భార్యాభర్తలను కలిసి రెండో కుమారుడికి పెళ్లి సంబంధాలు కూడా చూడటం జరిగిందన్నారు. అయితే పెద్ద కొడుకు చదువు మినహా పెళ్లి వద్దని చెప్పటంతో రెండో కొడుక్కి పెళ్లి ఏర్పాటు చేసామని తెలిపారు.