రాష్ట్రీయం

ఏపీకి.. డీపీ వరల్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: ‘మీ దగ్గర నైపుణ్యం ఉంది. పెట్టుబడులు ఉన్నాయి. మా దగ్గర అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ఓడరేవుల అభివృద్ధి రంగంలో ఉభయులం కలిసి పనిచేసే అవకాశం మనముందు ఉంది’ అని సిఎం చంద్రబాబు డీపీ వరల్డ్ గ్రూపు చైర్మన్, సిఈవో సుల్తాన్ అహ్మద్ బిన్ సులేమాన్‌ను ఆహ్వానించారు. ఆదివారం ఐదోరోజు విదేశీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం యుఏఇలో పర్యటిస్తోంది. ఎమిరేట్స్ బిజినెస్ టవర్స్‌లో డీపీ వరల్డ్ గ్రూపు చైర్మన్, సిఈవో సుల్తాన్ అహ్మద్ బిన్ సులేమాన్‌తో భేటీ అయిన చంద్రబాబు మాట్లాడుతూ రానున్న కాలంలో ఓడరేవు సరకు రవాణా యావత్తూ తూర్పుతీరం నుంచే జరుగుతుందని, వాయువ్య ప్రాంతాల సరుకు రవాణా తూర్పు నౌకాశ్రయాలకు అనుసంధానించాల్సి ఉందన్నారు. నౌకాశ్రయాలకు విస్తృత సేవలందించగల సామర్థ్యం, సత్తా తమకున్నాయని చెప్పారు. అందుకు సుల్తాన్ స్పందిస్తూ సంసిద్ధత వ్యక్తం చేశారు. తమకు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ఉందని, తాము ఇప్పటికే జాతీయ వౌలిక సదుపాయాల నిధిపై భారతదేశంతో సన్నిహితంగా కలిసి పనిచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తమ ఓడరేవులకు కూడా రహదారి అనుసంధానం సాధించాల్సి ఉందన్నారు. అయితే వేగంగా నిర్ణయాలు తీసుకోవడం తమకు అత్యంత ముఖ్యమని, సమయాన్ని అత్యంత విలువైనదిగా తాము భావిస్తామని
చెప్పారు. నిర్ణయాలు వేగంగా తీసుకునే వ్యవస్థను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుని రియల్ టైమ్‌లో నిర్ణయాలు తీసుకుని ఫలితాలు సాధిస్తున్నట్లు చంద్రబాబు ఆయనకు వివరించారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక నడవా ద్వారా ఓడరేవు కార్యకలాపాలు విస్తృతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. చెన్నై ఇప్పటికే ఈవిషయంలో సంతృప్త స్థాయికి చేరిందని, రైలు, విమానయాన మార్గాలన్నీ ఆంధ్రప్రదేశ్ ద్వారానే వెళ్తుండటం తమకు అదనపు బలమని ముఖ్యమంత్రి వివరించారు. కేంద్రం ప్రకటించిన రెండు పారిశ్రామిక నడవాలు ఆంధ్రప్రదేశ్ మీదుగానే వెళ్తుండటం విశేషమని, అందులో ఒకటి తమ రాష్ట్రాన్ని నేరుగా రాయ్‌పూర్‌కు అనుసంధానం చేస్తుందని తెలిపారు. తమ రాష్ట్రంలో అంతర్గత జలరవాణా సదుపాయాలను కల్పిస్తున్నామని, ఈ అభివృద్ధి మీకు తప్పకుండా ప్రయోజనం చేకూరుస్తుందని చంద్రబాబు సుల్తాన్‌కు వివరించారు. ఉభయులం కలిసి పనిచేసే అంశంలో ఒక కార్య బృందం ఏర్పాటు చేసుకోవాలని, ఆ బృందం ద్వారా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలను వేగవంతంగా మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతామని సుల్తాన్ ప్రతిపాదించారు. తమ భారత కార్యాలయానికి అన్నీ వదిలిపెట్టకుండా ఇక్కడి నుంచే తాము నేరుగా పర్యవేక్షిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ సంయుక్త కార్యబృందం ఏర్పాటుకు ఇదొక ముందడుగని, ఇది ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తుందని, ప్రతినెలా ఈ అంశంపై సాధించిన పురోగతిని సమీక్షించుకుందామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రారంభించనున్న లాజిస్టిక్ యూనివర్సిటీలో భాగస్వామి కావాలని డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్‌ను ఆహ్వానించారు. చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, ఇంధన, వౌలిక సదుపాయాల విభాగం ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ బోర్డ్ సిఈవో జాస్తి కృష్ణకిషోర్, సాల్మన్ ఆరోక్యరాజ్ తదితరులున్నారు. కాగా, డీపీ వరల్డ్ సప్లయ్ చైన్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి మార్గం సుగమం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఆరు ఖండాల్లోని 40 దేశాల్లో నౌకాశ్రయాల్లో మెరైన్, ఇన్‌లాండ్ టెర్మినల్స్‌ను కలిగి ఉంది. సంస్థకు 103 దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. వీటిల్లోని వివిధ విభాగాల్లో 36,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అపార అవకాశాలు, అనేక ప్రోత్సాహకాలు
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నామని, అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇనె్వస్టర్లకు, వాణిజ్య, వృత్తి నిపుణులకు పిలుపునిచ్చారు. నిన్నటి నుంచి గల్ఫ్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇండియన్ బిజినెస్, ప్రొఫెషనల్ కౌన్సిల్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌తో వాణిజ్య, వ్యాపార సానుకూలాంశాలు, పెట్టుబడులకు తామిస్తున్న భరోసాపై వారికి వివరించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సైబరాబాద్ నిర్మాణంతో హైదరాబాద్‌ను విశ్వస్థాయి నగరంగా తీర్చిదిద్దామని, అలాంటి తనకు మళ్లీ నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించే అపూర్వ అవకాశం లభించిందని చంద్రబాబు వివరించారు. సహజ వనరులతో సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్‌కు పుష్కల స్థాయిలో మానవ వనరుల లభ్యత ఒక వరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్, ఫార్మా, ఏరోస్పేస్, ఫిన్‌టెక్ రంగాల అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, నాలెడ్జ్ హబ్‌గా రూపుదిద్దుకుంటున్న తమ రాష్ట్రంలో ఇనె్వస్టర్లకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. సమర్థత, పారదర్శకతతో కూడిన పరిపాలన అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌తో వాణిజ్యం చేయటం సునాయాసం, సులభతరం, ఆటంక రహితమన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మేము మొదటి స్థానంలో ఉన్నాం. మీ వ్యాపారాలకు ఆంధ్రప్రదేశ్ సరైన గమ్యస్థానం. మీరంతా మంచి ప్రతిపాదనలతో రాష్ట్రానికి రండి’ అని చంద్రబాబు ఆహ్వానించారు.

చిత్రం..డీపీ వరల్డ్ గ్రూపు చైర్మన్, సిఈవో సుల్తాన్ అహ్మద్ బిన్ సులేమాన్‌ను జ్ఞాపికతో సత్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు