రాష్ట్రీయం

ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 9: ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్య అనారోగ్యంతో జనగామ జిల్లా మాణిక్యాపురంలో గురువారం కన్నుమూశారు. 1935 మార్చి 29న జన్మించిన ఆయన తన 14వ ఏటనే ఒగ్గుకథ చెప్పడం ప్రారంభించి సుమారు 4,500 ప్రదర్శనలిచ్చి ఆ కళకు ఖండాంతర ఖ్యాతిని తెచ్చారు. 1977 మలేషియా ఉత్సవ్‌లో, 1987మనీస్‌లాండ్ ఉత్సవాలలో పాల్గొని ఒగ్గుకథకు ప్రాచుర్యం తెచ్చారు. 2004లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును, 2005లో కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళాసాగర్ అవార్డు, 2014లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి విశిష్ట పురస్కారాన్ని స్వీకరించారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కార్‌ను, 2015లో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం అందుకున్నారు. 2012లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు తదితర ప్రముఖుల నుంచి సత్కారిలు అందుకున్నారు.
దేశం గర్వించే కళాకారుడు: కేసీఆర్
సత్తయ్య మరణం పట్ల కెసిఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు యావత్ దేశం గర్వించదగిన కళాకారుడిగా సత్తయ్య ప్రపంచ ఖ్యాతిని పొందారన్నారు. సత్తయ్య కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢసానుభూతిని వ్యక్తం చేశారు. ఒగ్గు కథను విశ్వవ్యాప్తం చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆయన పేరు తెచ్చారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనియాడారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పందిస్తూ సత్తయ్య మృతి తెలంగాణకు, ఒగ్గు కళాకారులకు తీరని లోటని అన్నారు. గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సత్తయ్య మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒగ్గు కళకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిన కళాకారుడు సత్తయ్య అని కొనియాడారు. ఒగ్గు కథకు పర్యాయపదంగా సత్తయ్య నిలిచారని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్‌వి సత్యనారాయణ అన్నారు. జానపద కళా సంద్రంలో సత్తయ్య మహానౌక అని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమలరావు నివాళులర్పించారు.

చిత్రం..ఒగ్గుకథ కళాకారుడు చుక్క సత్తయ్య