రాష్ట్రీయం

దక్షిణ అయోధ్యలో మద్యం జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 9: అటు శ్రీ సీతారామచంద్ర స్వామి రామాలయం.. ఇటు కోదండరాముని కోవెల.. మరోవైపు పంచాయతీ కార్యాలయం.. పక్కనే రక్షకభట నిలయం.. ఎడమవైపు నిత్యాన్నదాన సత్రం.. కుడివైపు అనుబంధ ఆలయాలు.. ప్రశాంత వాతావరణం ఉండాల్సిన ఈ ప్రాంతాన్ని మద్యం వ్యాపారులు తమకు అనువైనది ఎంచుకున్నారు. పుణ్యక్షేత్రమైన భద్రాద్రిలో ఇలాంటి దృశ్యాలకు లోటులేదు. మరో చోట ఐటీడీఏ కార్యాలయం, పక్కనే అమ్మవారి ఆలయం, సమీపంలోనే పాఠశాలలు ఉన్నా అధికారులు పట్టించుకోరు. ఎక్సైజ్, పోలీసుశాఖల అధికారులు అండగా నిలవడంతో మద్యం వ్యాపారుల హవా కొనసాగుతోంది. ఆలయాలకు, కార్యాలయాలకు వచ్చే వారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు.
భద్రాద్రిలో ఇప్పుడు మద్యం దుకాణాల ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. రోజుకో చోట మద్యం దుకాణం ఏర్పాటు చేయడం, వాటిని స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతోంది. స్థానికుల నిరసనలను పట్టించుకోకుండా జనావాసాల మధ్యనే దుకాణాలు ఏర్పాటు చేస్తున్నందున మహిళలు తిరుగుబాటు చేస్తున్నారు. నూతన మద్యం విధానంలో భద్రాచలంలో 7 మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతించారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పట్టణ శివారు ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటు చేయాలని మొదటి నుంచి డిమాండ్ ఉంది. ఇంతకాలం దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా గుడి,బడి, ప్రభుత్వ కార్యాలయాల చెంతనే వైన్‌షాపులను ఏర్పాటు చేయడంతో ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించకపోవడం విడ్డూరం. భద్రాద్రిని సుమారు రూ.110 కోట్లతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాలు భద్రాద్రి పవిత్రను దెబ్బతీసేలా ఏర్పాటు కావడం చేయడం వివాదమవుతోంది. ఇక్కడ పూర్తిస్థాయిలో మద్య నిషేధం అమలు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. కానీ, ఇక్కడికి వచ్చే భక్తులకు మద్యం దుకాణాలే ముందుగా స్వాగతం పలికే పరిస్థితి ఉంది. ఇకనైనా మద్యం దుకాణాలను పట్టణ శివారు ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

చిత్రం..ఐటీడీఏ కార్యాలయం ఎదురుగా మద్యం దుకాణం