రాష్ట్రీయం

గోదావరిపై పర్యాటకానికి బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 16: దేశంలోని నదీ పర్యాటక యాత్రల్లో కీలకమైనదిగా భావించే పాపికొండలు విహార యాత్రకు తాత్కాలికంగా బ్రేకు పడింది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలోవుంచుకుని తూర్పు గోదావరి జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నదిలో ఇటీవలి బోటు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరిలో పాపికొండలు విహార యాత్రకు వినియోగిస్తున్న సుమారు వందకు పైగా బోట్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బోట్లకు సంబంధించి అనేక లోపాలు బయటపడడంతో విహారయాత్రలను తాత్కాలికంగా నిషేధించాలని నిర్ణయించారు. పాపికొండలు యాత్రలో కనీస భద్రతా ప్రమాణాలు లేవని ‘ఆంధ్రభూమి’ కథనంలో వెలుగుచూసిన పలు అంశాలు వాస్తవమేనని అధికారుల తనిఖీల్లో నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు బుధవారం ఉదయం
నుంచి తనిఖీలు ముమ్మరం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ మల్లికార్జున గోదావరి నదీ పర్యాటకాన్ని భద్రతాపరంగా ఇబ్బందులేని యాత్రగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న క్రమబద్ధీకరణ పర్యవేక్షక కమిటీ (రెగ్యులేటరీ అధారిటీ) పకడ్బందీ చర్యలు చేపట్టింది. భద్రతా ప్రమాణాలు లేనిదే ఒక్క బోటునుగానీ, లాంచీని గానీ నదిలో కదలనిచ్చేది లేదని ఆదేశాలు జారీచేశారు. వారం పది రోజుల వ్యవధిలో అన్ని బోట్లు భద్రతా ప్రమాణాలు పాటించిన తర్వాతే పర్యాటకం మొదలయ్యే విధంగా చర్యలు చేపట్టారు. బోట్లకు, లాంచీలకు నేవిగేషన్ రూట్ మ్యాపింగ్‌ను రూపొందించాలని నిర్ణయించారు.
జిల్లా వ్యాప్తంగా పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలు లేని ఆరు బోట్ల లైసెన్స్‌లు రద్దుచేశారు. గోదావరి నదిలో 114 బోట్లు తిరుగుతుంటే, అలందులో 96 బోట్లకు మాత్రమే లైసెన్స్‌లు ఉన్నట్టు గుర్తించారు. బోట్ల నిర్వహణలో అగ్నిమాపక, విపత్తుల నివారణ సంస్థ భాగస్వామ్యం లేకపోవడాన్ని గుర్తించారు. వాస్తవానికి ప్రతీ పర్యాటక బోటు అగ్నిమాపక విభాగం నుంచి ఎన్‌ఒసి తీసుకోవాల్సి ఉంది. బోటు, లాంచీల సామర్ధ్యం ప్రకారమే ప్రయాణీకులను ఎకిస్తున్నారా? లేదా? అనే విషయం పర్యాటకులకు తెలిసేలా బోర్డులు ప్రదర్శించాలనే కనీస సూత్రాన్ని కూడా బోటు, లాంచీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని గుర్తించారు.
లాంచీకి, బోటుకు మాత్రమే కాకుండా ప్రయాణికులకు కూడా బీమా కల్పించే విధంగా టిక్కెట్ ధరను ఇటు పర్యాటకులకు, అటు యాజమాన్యాలకు అనుకూలంగా నిర్ణయించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఒక్క ప్రయాణీకుని కచ్చితంగా లైఫ్ జాకెట్ ఉండాలని, బోటుకు స్టాండ్ బై ఇంజన్ ఉండాలని, ఫస్ట్ ఎయిడ్ బాక్సులో ప్రాథమిక వైద్యానికి సంబంధించి సామాగ్రి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్‌లు తప్ప, తాజాగా యువకులెవరికీ డ్రైవింగ్ లైసెన్స్‌లు లేని విషయం బయటపడింది. స్విమ్మింగ్ సర్ట్ఫికెట్లు సైతం చాలామందికి లేవు. బోట్లకు, లాంచీలకు లైసెన్సుల మంజూరు, క్రమబద్ధీకరణ, నిరంతర పర్యవేక్షణ ఎవరుచేయాలనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఉన్నట్టు కనిపించలేదు. దీంతో పర్యాటక శాఖ నుంచి నిరంతర పర్యవేక్షణకు అవుట్ సోర్సింగ్ విధానంలో సిబ్బంది నియామకం, భద్రతా చర్యలకు సంబంధించి అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించడానికి వన్‌టైమ్ ఫీజు కింద బోటు యజమానుల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించారు. ఇసుక దిబ్బలు తగిలి ఎక్కడైనా బోటుకు సాంకేతిక అవాంతరం రాకుండా ఉండేందుకు డెప్త్ ఇండికేటర్లను ఏర్పాటు చేయాల్సివుంది. అయితే డెప్త్ ఇండికేటర్లు ఖరీదు ఎక్కువగా ఉండటంతో సొంతంగా ఏర్పాటు చేసుకోవడం భారమని యజమానులు తెలియజేయడంతో నేవిగేషన్ రూట్ మ్యాప్‌ను అనుసరించి గమన దిశను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. నిరంతర పర్యవేక్షక సిబ్బంది, ఆహార పదార్థాల నాణ్యత పర్యవేక్షణ, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అగ్ని ప్రమాద నివారణ సామాగ్రి, బోటు సామర్ధ్యాన్ని తెలియజేసే ప్రదర్శన బోర్డులు, స్విమ్మింగ్ వచ్చిన అదనపు సిబ్బంది, బోటు కండిషన్‌పై నిరంతర పర్యవేక్షణ, లైసెన్స్ పరిశీలన, రెన్యువల్స్ తదితర పలు అంశాల్లో సమగ్ర ప్రమాణాలు విధిగా అమలు చేసిన తర్వాతే గోదావరి నదిలో బోట్లు నడపడానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. దీనితో ప్రస్తుతం గోదావరి నదిలో పాపికొండల ప్రయాణం తాత్కాలికంగా నిలిచిపోయింది.