రాష్ట్రీయం

26నే ఇవాంక హైదరాబాద్ రాక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: హైదరాబాద్ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామిక ఔత్సాహిక సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ఈ నెల 26నే హైదరాబాద్ చేరుకోనున్నారని తెలిసింది. అయితే ఈ విషయాన్ని భద్రతా అధికారులు గోప్యంగా ఉంచారు. సదస్సును ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. సదస్సు ప్రారంభానికి రెండు రోజుల ముందే ఇవాంక నగరానికి చేరుకుంటారని విశ్వసనీయ సమాచారం. 26,27 తేదీల్లో మహిళా పారిశ్రామిక వేత్తలతోనూ, భారతీయ పారిశ్రామిక వేత్తలతోనూ సమావేశం కావడంతో పాటు హైదరాబాద్ నగరంలో ప్రాచీన సంస్కృతి, వారసత్వాలకు కాణాచిగా ఉన్న భవనాలు, చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. 26నే ఎఆర్ రహ్మన్ నిర్వహించే మ్యూజికల్ ఫెస్టుకు ఆమె హాజరవుతారు. 28వ తేదీన ప్లీనరీ కార్యక్రమం 7 గంటలు ముగుస్తుంది. అనంతరం భారత ప్రధాని నరేంద్రమోదీ ఇవాంక బృందానికి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేస్తున్నారు. 29వ తేదీ రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇవాంక బృందంతో పాటు పలువురు భారతీయ పారిశ్రామిక వేత్తలకు గోల్కొండ ఫోర్టులో విందు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే గంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పాలకుల చరిత్రకు సజీవ సాక్ష్యంగా లైట్ అండ్ సౌండ్ అలంకరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తోంది. కీలక సదస్సులు, సహ సదస్సులు, ఇతర కార్యక్రమాలు హేటెక్స్‌లో జరుగుతాయి. అమెరికా నుండి 400 మంది ప్రతినిధులు, భారత్ నుండి 400 మంది, మిగిలిన అన్ని దేశాల నుండి 400 మంది ప్రతినిధులు హాజరవుతారు.
దాంతో పోలీసులు గోల్కొండ ఫోర్టును, ఫలక్‌నుమా ప్యాలెస్‌ను, హేటెక్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల ముందు నుండే ఈ ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా నిషేధ ఆజ్ఞలు అమలుచేయనున్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన పారిశ్రామిక వేత్తలతో పాటు ప్రముఖ తారలు కూడా హాజరవుతారని తెలిసింది. ప్రముఖ సినీనటి శిల్పాశెట్టి, జాతీయ అవార్డు గ్రహీత నీతా లుల్ల కూడా హాజరవుతారు.
100 స్టార్టప్‌ల ప్రదర్శన
ప్రఖ్యాతి గాంచిన వంద స్టార్టప్‌లను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. స్టార్టప్‌ల ఆలోచన, అవి ఎదిగిన క్రమం, క్రమానుగత సవాళ్లు, పరిష్కారాలు కూడా ఈ సందర్భంగా వివరిస్తారు. విజయవంతమైన స్టార్టప్‌లను చూసి అదే తరహా కొత్త స్టార్టప్‌లను రూపొందించేందుకు వీలుంటుందని చెబుతున్నారు. హైపర్‌లూప్, ఇండియా ఎడ్జ్, సాగూన్, సోషల్ కాప్స్, స్పేసెక్స్, టెస్లా తదితర సంస్థలు స్టార్టప్‌లను ప్రదర్శిస్తాయి.
ఒఆర్‌ఆర్ సందర్శన
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇవాంక ట్రంప్ 28వ తేదీన హైదరాబాద్ చేరుకోవాలి, అయితే రెండు రోజులు ముందుగానే హైదరాబాద్ వస్తారని విశ్వసనీయంగా తెలిసింది. ఇవాంక ట్రంప్ నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. ఆమెతో పాటు అక్కడి నుండి 400 మంది పారిశ్రామిక వేత్తలు, 50 మంది సిబ్బంది, 10 మంది సహాయకులు కూడా రానున్నట్టు తెలిసింది. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఆమె అవుటర్ రింగ్‌రోడ్ మీదుగా హైటెక్ సిటీ మైండ్‌స్పేస్‌లోని వెస్టిన్ హోటల్‌కు చేరుకుంటారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
సదస్సులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. మల్టీమీడియా ఇంటరాక్టివ్ తెరలు, సెన్సార్ టచ్ తెరలు, రోటోస్కోప్ టెక్నాలజీలను వినియోగించనున్నారు.
లాడ్ బజార్‌లో షాపింగ్
చార్మినార్, లాడ్ బజార్‌లలో ఇవాంక షాపింగ్ చేసేందుకు వీలుగా కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.