రాష్ట్రీయం

సినీ భాగస్వాముల మధ్య ఆస్తుల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: సినీ మేనేజింగ్ పార్టనర్ల ఆస్తుల వివాదం పోలీస్ ఠాణాకు ఎక్కింది. 12ఏళ్లుగా భాగస్వామ్యం ఉన్న వ్యాపారం వీడిపోయింది. తన అనుమతి లేకుండానే భూములు అమ్మాడని ఆరోపిస్తూ తన వ్యాపార భాగస్వామి చింతలపూడి శ్రీనివాస్‌పై అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీనివాస్ సహ 13మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిర్మాత శ్రీనివాస్‌తోపాటు 12 మందికి నోటీసులు ఇచ్చామని, పూర్తి స్థాయి విచారణ తరువాతే కేసులు నమోదు చేస్తామని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. వీరి మధ్య ఆస్తుల వివాదంపై కోర్టులో కేసు ఉండగానే నాగ సుశీల పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం తనను బ్లాక్ మెయిల్ చేయడమేనని భాగస్వామి శ్రీనివాస్ ప్రత్యారోపణ చేశారు. పనె్నండేళ్ల క్రితం శ్రీనాగ్ ప్రొడక్షన్స్, శ్రీనాగ్ కార్పొరేషన్ అనే పేరుతో మేనేజింగ్ పార్టనర్‌గా చింతలపూడి శ్రీనివాస్, పార్టనర్‌గా నాగ సుశీల కలసి సినిమాలు నిర్మించడంతోపాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు. నాగ సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా ఆటాడుకుందాం రా..కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి చిత్రాలను తెరకెక్కించారు. సుశాంత్ నటించిన రెండు సినిమాలు నష్టాలు తెచ్చిపెట్టాయి. అయితే గత కాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. కాగా అక్కినేని నాగార్జున చొరవతో వీరిద్దరి మధ్య రాజీ కుదుర్చినట్టు సమాచారం. అయినా..అవి ఫలించకపోగా వీరి మధ్య విభేదాలకు సంబంధించిన ఓ కేసు హైకోర్టులో నడుస్తోంది. కేసు కోర్టులో నడుస్తుండగానే తనపై నాగ సుశీల పోలీసులకు ఫిర్యాదు చేయడం తనను బ్లాక్ మెయిల్ చేయడమేనని శ్రీనివాస్ ఆరోపించారు. ఇటీవల కొన్ని ఆస్తులు అమ్మకంలో డబ్బులు వచ్చాయని, అవి తాను అడుగుతానని భయంతో నాగ సుశీల తనపై కేసు పెట్టారని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. నాగ సుశీల ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీనాగ్ కంపెనీకి చెందిన 37 ఎకరాలు స్థలాన్ని నాగ సుశీలకు తెలియకుండానే శ్రీనివాస్ అమ్మాడని ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టామని, సినీ నిర్మాత శ్రీనివాస్‌తోపాటు మరో 12మందికి నోటీసులు పంపిస్తామన్నారు. పూర్తిస్థాయి విచారణ తరువాతే వీరిపై చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని డీసీపీ పేర్కొన్నారు.

చిత్రం..అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల